icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (7)

మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి, భాజపా నాయకురాలు ఇమర్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీతూ పట్వారీపై శుక్రవారం కేసు నమోదైంది.

Updated : 04 May 2024 06:39 IST

భాజపా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు.. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై కేసు నమోదు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి, భాజపా నాయకురాలు ఇమర్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీతూ పట్వారీపై శుక్రవారం కేసు నమోదైంది. భిండ్‌, గ్వాలియర్‌ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఇమర్తీ దేవి మాట్లాడినట్లు ఉన్న ఓ ఆడియో క్లిప్‌ తాజాగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే అది తన గొంతు కాదని ఆమె స్పష్టం చేశారు. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ ఆడియో క్లిప్‌పై విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఇమర్తీ దేవిపై జీతూ పట్వారీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో గ్వాలియర్‌లోని డబ్రా పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. మరోవైపు- ఇమర్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జీతూ పట్వారీ ‘ఎక్స్‌’ వేదికగా క్షమాపణలు తెలిపారు.


ప్రధాని విమానాలను కొనుక్కున్నారుగానీ.. రైతుల రుణాలను మాఫీ చేయలేదు: ప్రియాంక

ఆగ్రా: ప్రధాని మోదీ సొంత అవసరాల కోసం విమానాలను కొనుక్కున్నారుగానీ రైతుల రుణాలను మాఫీ చేయలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేహ్‌పుర్‌ సీకరీలో కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున శుక్రవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆమె పాల్గొన్నారు. ‘ఎన్నికలప్పుడు మీ భావోద్వేగాలను వాడుకుని ఆయన ఓట్లు సాధిస్తారు. కానీ మీకు ఏమీ ఇవ్వరు. ఆయన సంపన్నులైన తన స్నేహితులకే అన్నీ ఇస్తారు’ అని ప్రియాంక ధ్వజమెత్తారు.


కాంగ్రెస్‌ విస్మరించిన గ్రామీణాన్ని మేం మారుస్తున్నాం

స్వాతంత్య్రానంతరం భారీ పరిశ్రమలు, రహదారులపైనే తొలి ప్రధాని నెహ్రూ దృష్టిసారించడంతో గ్రామీణ ప్రాంతాలు విస్మరణకు గురయ్యాయి. అవి ఎలాంటి సదుపాయాలకు నోచుకోలేదు. దీనివల్ల నగరాలకు వలసలు పెరిగాయి. మోదీ సర్కారు మాత్రం భిన్న విధానాల ద్వారా గ్రామీణ భారతాన్ని మార్చాలని ప్రయత్నిస్తోంది.

మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లాలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ


పాక్‌ ఎన్నికల్లో రాహుల్‌ నెగ్గుతారు

ఒకవేళ పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగినట్లయితే, రాహుల్‌గాంధీ అక్కడ పోటీచేస్తే భారీ ఆధిక్యంతో నిస్సందేహంగా నెగ్గుతారు. ఆ దేశంలో ఆయనతో సరితూగలేక మేం చేతులెత్తేస్తాం. ఎందుకంటే అక్కడ ఆయనకు చాలా ప్రజాదరణ ఉంది! మన దేశంలో మాత్రం నరేంద్రమోదీదే గెలుపు.

అస్సాంలోని బార్‌పెటా లోక్‌సభ ర్యాలీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ


జూన్‌ 4 తర్వాత కాంగ్రెస్‌ను ఖర్గే వెతుక్కోవాలి

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వెలువడిన తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తన పార్టీ ఎక్కడుందో వెతుక్కునే యాత్ర చేపట్టాలి. ఎందుకంటే ఆ పార్టీ ఇక ఎక్కడా కనిపించదు. కర్ణాటకలో దేశవ్యతిరేక శక్తులతో కలిసి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రూ.12 లక్షల కోట్ల అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ ఒకవైపు, ఒక్క అవినీతి ఆరోపణా లేకుండా 23 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా ఉన్న మోదీ నేతృత్వంలోని భాజపా మరోవైపు ఉన్నాయి. రాహుల్‌, మోదీల్లో మీకు ఎవరు కావాలి? ఉద్ధవ్‌ ‘నకిలీ’ శివసేన నడుపుతున్నారు. అసలైన పార్టీ శిందేతోనే ఉంది.

గోవా, కర్ణాటక, మహారాష్ట్ర సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా


ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ కుమారుడికి టికెట్‌ ఇవ్వాలన్న భాజపా నిర్ణయంతో కోట్లమంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారు. ప్రభుత్వం ఒక వ్యక్తిముందు అంత బలహీనంగా లొంగిపోయిందా? మేం పగలూరాత్రీ ఎంతో పోరాడినా ఇంతవరకు ఆ ఎంపీని అరెస్టు చేయలేదు. శ్రీరాముడి పేరుతో ఓట్లు మాత్రమే కావాలా? ఆయన చూపిన బాటలో నడవరా?

సోషల్‌ మీడియాలో రెజ్లర్‌ సాక్షి మలిక్‌


ఫోన్లలో మాట్లాడేందుకూ ప్రజలు భయపడుతున్నారు

ప్రభుత్వంలో ఎవరు తమ మాటలు వింటున్నారో అనే ఆలోచనతో ప్రజలు ఫోన్‌లో మాట్లాడడానికే భయపడుతున్నారు. భాజపా పాలనలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉంది. మీరు ఎలాంటి దేశంలో జీవించాలనుకుంటున్నారు? మీ పిల్లలు ఎలా ఎదగాలని కోరుకుంటున్నారు? అనే విషయాలు గుర్తుంచుకుని ఓటు వేయండి.

గోవాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img