icon icon icon
icon icon icon

50% రిజర్వేషన్ల పరిమితిని మోదీ ఎత్తేయగలరా?

దేశంలో 50శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ప్రధాని మోదీ ఎత్తేయగలరా అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి భాజపాతోపాటు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

Updated : 04 May 2024 06:38 IST

రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారు
ప్రచార సభల్లో రాహుల్‌ ధ్వజం

పుణె, భువనేశ్వర్‌: దేశంలో 50శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ప్రధాని మోదీ ఎత్తేయగలరా అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి భాజపాతోపాటు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే కుల గణను జరిపి తీరుతామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఒడిశాలోని రాయగడలో జరిగిన సభలోనూ ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే రాయ్‌బరేలీలో నామినేషన్‌ వేయాల్సి ఉన్నందున అక్కడి సభలో ఆయన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. ‘రాజ్యాంగాన్ని మారిస్తే భారత్‌ గుర్తింపు కోల్పోతుంది. మేం అధికారంలోకి రాగానే కుల గణన చేపడతామన్న మాటను నిలబెట్టుకుంటాం. 50శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాం. ఈ పరిమితివల్ల కోట్ల మంది ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు. మన పోరాటం రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికే. మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాల పెద్దలు అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారు. వారు రాజ్యాంగాన్ని మార్చడం గురించి, రిజర్వేషన్లను ఎత్తేయడం గురించి మాట్లాడుతున్నారు. ఇటువంటి ప్రయత్నాలను మేం ఎన్నటికీ అనుమతించం. దేశంలో 15శాతం మంది దళితులు, 8శాతం మంది గిరిజనులు, 50శాతం ఓబీసీలున్నారు. వీరి మొత్తం జనాభా 73శాతం. కానీ కార్పొరేట్‌, ఇతర రంగాల్లో వారి ప్రాతినిధ్యం నామమాత్రం. అందుకే కాంగ్రెస్‌ కుల గణన చేపడతామని చెబుతోంది. వారికి న్యాయం చేస్తామంటోంది’ అని పుణె సభలో రాహుల్‌ పేర్కొన్నారు.

‘రాజ్యాంగాన్ని రక్షించడానికి ఇండియా కూటమి, కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తున్నాయి. రాజ్యాంగంవల్లే దళితులకు, ఆదివాసీలకు, ఇతర బలహీనవర్గాలకు న్యాయం జరుగుతోంది. అలాంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారు. మేం గిరిజనులను ఆదివాసీలు అని పిలుస్తుంటే భాజపా నేతలు వనవాసీలంటూ అవమానపరుస్తున్నారు. గిరిజనులకు కాంగ్రెస్‌ పార్టీ అడవులు, నీరు, భూములను అప్పగిస్తుంది. ఒడిశాలోని రైతులు, దళితులు, కార్మికులు, గిరిజనులు, ఓబీసీలకు కొంత నగదు సాయం చేస్తాం. రైతుల రుణాలను మాఫీ చేస్తాం. అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాలను రెట్టింపు చేస్తాం’ అని రాయగడలో ప్రదర్శించిన వీడియో సందేశంలో రాహుల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img