icon icon icon
icon icon icon

వయనాడ్‌లో ఓటమి భయంతోనే.. రెండోచోట యువరాజు పోటీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన కొత్త సీటు వెదుక్కొంటారని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు.

Updated : 04 May 2024 06:36 IST

కాంగ్రెస్‌కు ఆల్‌టైం అతి తక్కువ స్థానాలు
బెంగాల్‌లో ద్వితీయశ్రేణి పౌరుల్లా హిందువులు: మోదీ

బర్ధమాన్‌, కృష్ణానగర్‌, బీర్‌భూమ్‌ (పశ్చిమబెంగాల్‌): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన కొత్త సీటు వెదుక్కొంటారని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌ను ఉద్దేశించి) కేరళలోని వయనాడ్‌లో ఓడిపోతాననే భయంతోనే రాయ్‌బరేలీ బరిలోకి దిగుతున్నారని విమర్శించారు. అమేఠీ నుంచి పోటీ చేయడానికి భయపడి రాయ్‌బరేలీ పారిపోయారని ఎద్దేవా చేశారు. శుక్రవారం పశ్చిమబెంగాల్‌లోని బర్ధమాన్‌, దుర్గాపుర్‌, కృష్ణానగర్‌, బీర్‌భూమ్‌ ఎన్నికల సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీతోపాటు తృణమూల్‌ సర్కారుపై ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అతితక్కువ సీట్లు వస్తాయి. 50 దాటడం కూడా కష్టమే. కాంగ్రెస్‌ చరిత్రలో ఈ ఎన్నికల్లో గెలిచేవే అతి తక్కువ సీట్లు. దీనిపై ఎలాంటి ఒపీనియన్‌ పోల్స్‌ అవసరం లేదు’’ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి అధికారమిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషను కోటాలు లాక్కొని ‘జిహాదీ ఓటుబ్యాంకు’కు కట్టబెడుతుందని విమర్శించారు. హిందువులను భాగీరథి నదిలో విసిరేస్తామంటూ టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు ప్రకటించారని, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తున్న బెంగాల్‌ సర్కారు హిందువులను ద్వితీయశ్రేణి పౌరులుగా చేసిందని మండిపడ్డారు. స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ కుంభకోణం కారణంగా రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయినవారిలో ఎలాంటి తప్పు చేయని టీచర్లు, అభ్యర్థుల సహాయార్థం భాజపా రాష్ట్ర శాఖ ప్రత్యేక లీగల్‌సెల్‌, సామాజిక మాధ్యమ వేదిక ఏర్పాటు చేస్తుందని మోదీ ప్రకటించారు.  సందేశ్‌ఖాలీ అల్లర్ల నిందితుడు షేక్‌ షాజహాన్‌ను కాపాడాలని చూసిన బెంగాల్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి సమాధి తవ్వుతోందని ప్రధాని విరుచుకుపడ్డారు.


భూములు, మద్యం, గనులు, ఇసుక ఝార్ఖండ్‌లో ఏదీ వదలడం లేదు

రాంచీ, చాయీబాసా: ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) - కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు నేతలు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారని, రాష్ట్రంలోని ఖనిజ వనరులను దోచుకొంటున్నారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఝార్ఖండ్‌ రాష్ట్రం చాయీబాసాలోని టాటా కళాశాల మైదానంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ‘మహా విజయ్‌ సంకల్ప్‌ సభ’ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సంథాల్‌ పరగనాల డివిజనులో చొరబాట్లను ప్రోత్సహిస్తున్న జేఎంఎం సర్కారు పొరుగున ఉన్న బెంగాల్‌ తరహాలో ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దీని కారణంగా గిరిజన జనాభా తగ్గుతోందని, స్థానిక మహిళలకు రక్షణ ఉండటం లేదని తెలిపారు. సంకీర్ణ సర్కారు నేతలు గిరిజనుల భూములు, ఆర్మీ భూములు, మద్యం, గనులు, ఇసుక.. ఇలా ఏదీ వదలడం లేదన్నారు. ఝార్ఖండ్‌ రాష్ట్రాన్ని భాజపా ఏర్పాటుచేసిందని, తమ శవాల మీదుగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయండన్న నేతలతో నేడు జేఎంఎం చేతులు కలిపిందని ప్రధాని విమర్శించారు. శుక్రవారం సాయంత్రం ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో మోదీ గంటసేపు భారీ రోడ్‌షో నిర్వహించారు. చాయీబాసా నుంచి రాంచీ చేరుకోగానే స్థానిక బిర్సా కూడలిలోని గిరిజన పోరాటవీరుడు బిర్సాముండా విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. రోడ్‌షో అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకొన్న మోదీకి గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ స్వాగతం పలికారు. ఝార్ఖండ్‌లో శనివారం కూడా ప్రధాని ఎన్నికల ప్రచారం కొనసాగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img