icon icon icon
icon icon icon

రాయ్‌బరేలీలో రాహుల్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. కేరళలోని వయనాడ్‌ నుంచి ఆయన పోటీ చేయగా అక్కడ పోలింగ్‌ కూడా ముగిసిన విషయం తెలిసిందే.

Updated : 04 May 2024 06:33 IST

నామినేషన్ల చివరిరోజు నిర్ణయం
అమేఠీ నుంచి కేఎల్‌ శర్మ

దిల్లీ, రాయ్‌బరేలీ, అమేఠీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. కేరళలోని వయనాడ్‌ నుంచి ఆయన పోటీ చేయగా అక్కడ పోలింగ్‌ కూడా ముగిసిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా.. తాను ఇదివరకు ప్రాతినిధ్యం వహించిన అమేఠీ నుంచి గానీ, తల్లి సోనియాగాంధీని రెండు దశాబ్దాలుగా లోక్‌సభకు పంపుతూ వస్తున్న రాయ్‌బరేలీ నుంచి గానీ ఆయన బరిలో దిగవచ్చని గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తర్జనభర్జనల అనంతరం సోనియా కుటుంబం చివరకు రాయ్‌బరేలీవైపే మొగ్గింది. పార్టీ విధేయుడైన సీనియర్‌ నేత కిశోరీలాల్‌ శర్మ (కె.ఎల్‌.శర్మ)కు అమేఠీలో అవకాశమిచ్చింది. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన ఆయన గత ఇరవై ఏళ్లుగా ఈ రెండు ప్రతిష్ఠాత్మక స్థానాలనూ సోనియా కుటుంబం తరఫున పర్యవేక్షిస్తూ వస్తున్నారు. రాహుల్‌, శర్మ.. ఇద్దరూ శుక్రవారం తమ నామపత్రాలు సమర్పించారు. రాయ్‌బరేలీలో అట్టహాసంగా సాగిన రాహుల్‌ నామినేషన్‌ కార్యక్రమానికి సోనియా, ప్రియాంక, రాబర్ట్‌ వాద్రా, మల్లికార్జున ఖర్గే వంటి అగ్రనేతలంతా హాజరయ్యారు. తాజా పరిణామాలతో ప్రియాంక ఈసారి పోటీ చేయడం లేదని స్పష్టమైంది. సోనియా 2004 నుంచి 2024 వరకు రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహించి, ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో సోనియా చేతిలో ఓడిపోయిన ప్రతాప్‌ సింగ్‌నే మరోసారి భాజపా అక్కడ బరిలోకి దించింది.

వారసత్వం కాదు.. బాధ్యత: కాంగ్రెస్‌

పోరాట బరి నుంచి పారిపోయినవారు దేశానికి నేతృత్వం వహిద్దామనుకుంటున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్‌ చేసిన ప్రయోగం విఫలమవుతుందని హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు.  ‘ఓడిపోయిన సీటులో గాంధీ కుటుంబం మళ్లీ పోటీ చేయదు. రాహుల్‌ అమేఠీలో ఓడినందుకు దానిని విడిచిపెట్టారు. ఇప్పుడు రాయ్‌బరేలీలో ఓడిపోతే ఆ స్థానాన్ని కూడా వదిలేస్తారు. చివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌లా గాంధీ కుటుంబం నుంచి రాహులే ఇక్కడ చివరివారు’ అని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ విమర్శించారు. ఎన్నికలకు ముందే అమేఠీలో ఓటమిని కాంగ్రెస్‌ అంగీకరించిందని అక్కడి భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతిఇరానీ ఎద్దేవా చేశారు. విమర్శలకు కాంగ్రెస్‌ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ‘ఎక్స్‌’లో సుదీర్ఘ పోస్ట్‌ ద్వారా వివరణ ఇచ్చారు. దీర్ఘకాల వ్యూహంతోనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ ఎత్తుగడ భాజపా, దాని మద్దతుదారులను కలవరపెడుతోందని పేర్కొన్నారు. ‘ఇది వారసత్వం కాదు. ఒక బాధ్యత, విధి. అమేఠీ, రాయ్‌బరేలీ మాత్రమే కాదు.. దేశం మొత్తం గాంధీ కుటుంబానికి బలమైన కోట. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి మూడుసార్లు, కేరళ నుంచి ఒకసారి రాహుల్‌ ఎంపీగా గెలిచారు’ అని చెప్పారు.

ప్రియాంక ఒకచోటకు పరిమితం కాకూడదనే..

ప్రియాంక దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ మోదీ అసత్యాలను ఎండగడుతున్నారని, అందుకే ఆమె ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాకూడదని భావించామని జైరాం తెలిపారు. ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని చెప్పారు. అమేఠీ నుంచి రాహుల్‌పై పోటీ చేయడమే ఇప్పటివరకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఉన్న గుర్తింపు అని, ఇకపై ఆమెకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం ఉండబోదని అన్నారు.


రాహుల్‌ ఆస్తులు రూ.20 కోట్లు

తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తిపాస్తులు ఉన్నట్లు రాహుల్‌గాంధీ ప్రకటించారు. దీనిలో రూ.3.81 కోట్ల షేర్లు సహా చరాస్తుల విలువ రూ.9.24 కోట్లు. బ్యాంకులో దాచుకున్న రూ.26.25 లక్షలు, బంగారం బాండ్లుగా రూ.15.21 లక్షలు దీనిలో కలిపి ఉన్నాయి. స్థిరాస్తుల విలువను రూ.11.15 కోట్లుగా పేర్కొన్నారు. సొంతంగా సముపార్జించిన ఆస్తులు రూ.9.04 కోట్లు, వారసత్వంగా వచ్చినవి రూ.2.10 కోట్లు అని చూపించారు. చేతిలో నగదు రూ.55వేలు ఉందని, అప్పులు రూ.49.79 లక్షలు ఉన్నాయని తెలిపారు. 22-23 ఆర్థిక సంవత్సరంలో రాహుల్‌ వార్షిక సంపాదన రూ.1.02 కోట్లు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఎం.ఫిల్‌. చేశారు. మోదీ సమాజ్‌ను కించపరిచేలా మాట్లాడినందుకు రెండేళ్ల జైలుశిక్ష పడిందని, దానిని సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఆయన వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img