icon icon icon
icon icon icon

పోలైన ఓట్ల గణాంకాలు సకాలంలో వెల్లడికి ప్రాధాన్యం

సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి, రెండు దశల పోలింగ్‌లో నమోదైన ఓటింగ్‌ శాతాన్ని వెల్లడించడంలో జాప్యంతో పాటు ఆ గణాంకాల్లో వ్యత్యాసం ఉండడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం స్పందించింది.

Updated : 04 May 2024 06:42 IST

విపక్షాల విమర్శలకు ఈసీ స్పందన

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి, రెండు దశల పోలింగ్‌లో నమోదైన ఓటింగ్‌ శాతాన్ని వెల్లడించడంలో జాప్యంతో పాటు ఆ గణాంకాల్లో వ్యత్యాసం ఉండడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం స్పందించింది. పోలైన ఓట్ల వివరాలను సకాలంలో, పారదర్శకంగా వెల్లడించడానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తెలిపింది. ప్రతి విడత పోలింగ్‌కూ ఇదే విధానం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఓటింగ్‌ శాతం వివరాలను వెంటనే వెల్లడించడంలేదని, బహిర్గతం చేసిన గణాంకాల్లోనూ అంతరాలు ఉంటున్నాయన్న కాంగ్రెస్‌, వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల ఆరోపణలకు ఈసీ స్పందించడం ఇదే తొలిసారి. ‘ఓటింగ్‌ శాతాల వెల్లడితో పాటు పారదర్శకమైన పని తీరు ఈసీ విధి. దీనికిగాను ప్రామాణికమైన విధానాలను ఎల్లవేళలా పాటించడం జరుగుతుంది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ కచ్చితమైన ఓటింగ్‌ వివరాల్ని ‘ఫారం 17సి’లో నమోదు చేస్తారు. ప్రిసైడింగ్‌ అధికారులు, హాజరైన పోలింగ్‌ ఏజెంట్లు అందరూ సంతకాలు చేసిన ఆ ప్రతులను ఏజెంట్లు అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఇలా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోని ప్రతి బూత్‌లో నమోదైన ఓటింగ్‌ శాతం వివరాలు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు చేరుతాయి’ అని ఈసీ వివరించింది. ఈసీ ఓటర్‌ టర్నవుట్‌ యాప్‌ ద్వారా నియోజకవర్గాల వారీ ఓటింగ్‌ సమాచారాన్ని మీడియాతో పాటు అందరికీ అందుబాటులో ఉంచుతున్నామని తెలిపింది.

పోలింగ్‌ శాతం పెంచేందుకు కృషి

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రథమ, ద్వితీయ దశల పోలింగ్‌లో ఓటింగ్‌ శాతం 2019లో ఎన్నికల కన్నా తక్కువగా ఉండడంపై ఎన్నికల సంఘం స్పందించింది. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు సాధ్యమైనంత ఎక్కువగా తరలి వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.

48 గంటల్లోగా ‘నో డ్యూస్‌’ పత్రాలు

ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులకు వారు దరఖాస్తుచేసుకున్న 48 గంటల్లోగా ...బకాయిలు లేవని తెలిపే (నో డ్యూస్‌) ధ్రువీకరణ పత్రాలు అందించాలని అన్ని రాష్ట్రాలకు ఈసీ ఆదేశాలిచ్చింది. ఆ ధ్రువీకరణ పత్రాన్ని అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా సమర్పించకపోతే వారి నామినేషన్‌ పత్రం తిరస్కరణకు గురవుతుంది కనుక ఈ విషయంలో జాప్యం తగదని అధికారులకు స్పష్టం చేసింది. బకాయిలన్నీ చెల్లించినప్పటికీ అటువంటి ధ్రువీకరణ పత్రం జారీ చేయకపోవడం ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img