icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (5)

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దిల్లీ, హరియాణాకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 40 మందితో ప్రచార తారల జాబితాను శనివారం ప్రకటించింది.

Updated : 05 May 2024 06:49 IST

ఆప్‌ ప్రచార తారల్లో కేజ్రీవాల్‌ దంపతులు

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దిల్లీ, హరియాణాకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 40 మందితో ప్రచార తారల జాబితాను శనివారం ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య సునీత, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఈ జాబితాలో ఉన్నారు. మనీశ్‌ సిసోదియా, సత్యేందర్‌ జైన్‌ పేర్లూ ఉన్నాయి. కేజ్రీవాల్‌, సిసోదియా, సత్యేందర్‌ జైన్‌లు ముగ్గురూ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎంపీల్లో సంజయ్‌సింగ్‌, రాఘవ్‌ చడ్డా, సందీప్‌ పాఠక్‌, దిల్లీ మంత్రుల్లో అతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌, గోపాల్‌రాయ్‌, కైలాష్‌ గహ్లోత్‌ ప్రచార తారల జాబితాలో చోటు లభించింది. కొందరు పార్టీ నేతలు, పంజాబ్‌ మంత్రులు కూడా ప్రచార తారలుగా వ్యవహరించనున్నారు.


ప్రధాని వ్యాఖ్యలపై ఈసీకి జేఎంఎం ఫిర్యాదు

రాంచీ: ఝార్ఖండ్‌ పర్యటనలో ప్రధానమంత్రి అన్‌ పార్లమెంటరీ భాష వాడారని, దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్రంలోని జేఎంఎం ప్రభుత్వం భారత ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి గులాం అహ్మద్‌ మిర్‌ స్పందిస్తూ.. ‘‘రాహుల్‌ను ‘షెహజాదా’ (యువరాజు) అని ప్రధాని అంటున్నారు. రాహుల్‌ ‘షహీద్‌జాదా’ (అమరుడి తనయుడు) అనే విషయం ప్రజలకు తెలుసు’’ అన్నారు. 


భాజపా గూటికి అర్విందర్‌ సింగ్‌ లవ్లీ

దిల్లీ: దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అర్విందర్‌ సింగ్‌ లవ్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ సమక్షంలో శనివారం ఆయన కాషాయ పార్టీ కండువా కప్పుకొన్నారు. పార్టీ పదవికి రాజీనామా చేసిన రోజు తాను ఏ పార్టీలోనూ చేరబోనంటూ పేర్కొన్న ఆయన.. వారం తిరగక ముందే భాజపాలో చేరడం గమనార్హం. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు సైతం భాజపాలో చేరారు.


తన పత్రాలతో మరొకరు నామినేషన్‌ వేశారని ఫిర్యాదు
ఠాణేలో కేసు నమోదు

ఠాణె: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన ఓ వ్యక్తిని మోసగించి అలాంటి పేరు కలిగిన మరొకరు నామినేషన్‌ వేసిన ఘటనపై మహారాష్ట్రలోని ఠాణె పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. భివాండి నుంచి పోటీ చేసేందుకు మిలింద్‌ దేవ్‌రామ్‌ కాంబ్లే అనే వ్యక్తికి ఓ పార్టీ ఏ, బీ ఫాంలు ఇచ్చింది. అలాంటి పేరే కలిగిన మిలింద్‌ కాశీనాథ్‌ కాంబ్లే.. దేవ్‌రామ్‌ కాంబ్లేను మాయమాటలతో నమ్మించి నామినేషన్‌ పత్రాలు, పాన్‌, ఆధార్‌ సహా ఇతర ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నాడు. వాటితో తానే అభ్యర్థిగా నామినేషన్‌ వేశాడు. దీనిపై బాధితుడు చేసిన ఫిర్యాదుతో శుక్రవారం ఠాణె పోలీసులు మిలింద్‌ కాశీనాథ్‌ కాంబ్లేపై కేసు నమోదు చేశారు. అక్కడ మే 20న ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారమే నామినేషన్లకు చివరిరోజు.


కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో ఔరంగజేబు పాలనలా ఉంది

కాంగ్రెస్‌ పార్టీ తమ మ్యానిఫెస్టోలో జిజియా పన్ను (వారసత్వ సంపదపై పన్ను), గోవధ గురించి ప్రస్తావించింది. ఇది మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు క్రూర పాలనను తలపింపజేస్తోంది. హుందా అయిన ముస్లిం కుటుంబాలు తమ పిల్లలకు ఔరంగజేబు పేరు పెట్టరు. ఓటుబ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను లాక్కొనిపోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మైనారిటీలు, మెజారిటీ ప్రజల ఆహార అలవాట్లు దాదాపు ఒకటే అయినా సమాజంలో ఎక్కువమంది గోవధను వ్యతిరేకిస్తారు. అలాంటి గోవధకు మద్దతు పలికే స్థాయికి కాంగ్రెస్‌ ఇప్పుడు దిగజారిపోయింది.

 మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌ పట్టణంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌


సందేశ్‌ఖాలీ ఉదంతం భాజపా కుట్ర

సందేశ్‌ఖాలీలో అంతా ఒక పథకం ప్రకారమే జరిగింది. కుట్రతో దీనిని భాజపా రూపొందించింది. వాస్తవమేమిటో ఇప్పుడు బహిర్గతమైంది. చాలారోజులుగా నేను ఈ విషయం చెబుతున్నాను. సందేశ్‌ఖాలీపై సందేశాన్ని ఇచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు కేంద్ర ప్రతినిధిగా ఉన్న గవర్నర్‌ ఆనంద్‌బోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు?

 పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో సీఎం మమతా బెనర్జీ


మా పార్టీవారు చేసినా అది తప్పే

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి చివరిక్షణంలో వైదొలగడం ఆశ్చర్యకరం. అది సముచితం కాదు. ఉపసంహరణకు ఒకవేళ మా పార్టీవారు కారణమైనా అది తప్పే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతినిధిని ఎంచుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ఇందౌర్‌లో భాజపా విజయం ఖాయమైపోయింది. ఇక్కడ కమలాన్ని ఎవరూ ఓడించలేరు. భాజపా 400 సీట్ల లక్ష్యంలో తప్పేమీ లేదు.

 పీటీఐ ఇంటర్వ్యూలో లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img