icon icon icon
icon icon icon

సందేశ్‌ఖాలీ ఘటనలు భాజపా కుట్రే!

సందేశ్‌ఖాలీ ఘటనలు.. లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి భాజపా పన్నిన కుట్ర అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది.

Updated : 05 May 2024 05:11 IST

వీడియో విడుదల చేసిన తృణమూల్‌

కోల్‌కతా: సందేశ్‌ఖాలీ ఘటనలు.. లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి భాజపా పన్నిన కుట్ర అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ మేరకు ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఈ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి ఉన్నట్లు భాజపా మండల శాఖ అధ్యక్షుడు గంగాధర్‌ వ్యాఖ్యానించడం ఈ వీడియోలో కనిపించింది. షాజహాన్‌ షేక్‌ సహా ముగ్గురు తృణమూల్‌ నేతలపై అత్యాచార ఆరోపణలు చేసేలా స్థానిక మహిళలను ప్రేరేపించాలని సువేందు తనకు సూచించినట్లు అతడు చెప్పారు. సందేశ్‌ఖాలీలోని ఒక ఇంట్లో ఆయనే తుపాకులు పెట్టించారని, వాటిని కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకునేలా నాటకమాడించారని ఆయన పేర్కొనడమూ అందులో కనిపించింది. ‘‘డబ్బు ఎరజూపడం ద్వారా సువేందు.. స్థానికులతో తప్పుడు ఆరోపణలు చేయించారు. బెంగాల్‌, సందేశ్‌ఖాళీకి ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్నదే ఆయన ఉద్దేశం. తాజా వీడియో దీన్ని తేటతెల్లం చేస్తోంది. అత్యాచార ఆరోపణల నుంచి ఆయుధాల స్వాధీనం వరకూ.. అన్నీ బూటకమే. ఇదంతా సువేందు కుట్రే’’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ వీడియోపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. బంగ్లాదేశ్‌ పురోగామి ఆలోచనలు, సంస్కృతి పట్ల భాజపాకున్న వ్యతిరేకతను ఇది బట్టబయలు చేస్తోందన్నారు. ప్రతి దశలోనూ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న తలంపు భాజపాలో ఉందని ఆరోపించారు. బెంగాల్‌ వీటిని వమ్ము చేస్తుందన్నారు. ఈ ఉదంతాల వెనుక కమలం పార్టీ ఉందన్న తమ ఆరోపణలను ఇది నిజం చేస్తోందని తృణమూల్‌ అగ్రనేత అభిషేక్‌ బెనర్జీ పేర్కొన్నారు. తృణమూల్‌ ఆరోపణలను సువేందు అధికారి ఖండించారు. ఆ పార్టీ చూపుతోంది నకిలీ వీడియో అని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే.. అందరి దృష్టిని మళ్లించేందుకు తృణమూల్‌ ఇలా చేస్తోందని దుయ్యబట్టారు. సందేశ్‌ఖాలీలో మహిళలు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేశారన్నారు. మరోవైపు ఈ వీడియో అంశంపై భాజపా మండల శాఖ అధ్యక్షుడు గంగాధర్‌.. సీబీఐకి ఫిర్యాదు చేశారు. అది మార్ఫింగ్‌ వీడియో అని, కృత్రిమ మేధ (ఏఐ)తో తన స్వరాన్ని రూపొందించి, అందులో పెట్టారని ఆయన ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img