icon icon icon
icon icon icon

డబ్బుల్లేవ్‌... పోటీ చేయలేను

ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బులు తన వద్ద లేవని..ఎన్నికల బరిలో ఉండలేనంటూ ఒడిశాలోని పూరీ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి సుచరిత మహంతి తన టికెట్‌ను తిరస్కరించారు.

Published : 05 May 2024 05:29 IST

కాంగ్రెస్‌ టికెట్‌ తిరస్కరించిన పూరీ లోక్‌సభ అభ్యర్థి సుచరిత

గోపాలపుర్‌, న్యూస్‌టుడే: ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బులు తన వద్ద లేవని..ఎన్నికల బరిలో ఉండలేనంటూ ఒడిశాలోని పూరీ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి సుచరిత మహంతి తన టికెట్‌ను తిరస్కరించారు. తాను పోటీ నుంచి తప్పుకొన్నట్లు తెలియపరిచారు. దీనిపై ఆమె శనివారం పూరీలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రచారానికి రూపాయి కూడా కేటాయించని కాంగ్రెస్‌ సొంత ఏర్పాట్లు చేసుకోవాలని సూచించిందన్నారు. తన వద్ద అంత సొమ్ము లేదని, ఆ విషయం పార్టీ పెద్దలకు తెలిపానన్నారు. కొంతమంది విరాళాలు ఇస్తారని ఆశించినా అది కూడా నెరవేరలేదన్నారు. మరోవైపు పూరీ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ నిలిపిన అభ్యర్థులకు ఆదరణ, ప్రజా సంబంధాలు లేవన్నారు. నాలుగు సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చాలని తాను అధిష్ఠానానికి విన్నవించినా పట్టించుకోనందున టికెట్‌ తిరస్కరిస్తూ పోటీ నుంచి విరమించుకున్నట్లు సుచరిత చెప్పారు.

ఆమెను పార్టీయే తప్పించింది: అజయ్‌ కుమార్‌

సుచరిత మహంతికి పూరీ లోక్‌సభ టికెట్‌ కేటాయించిన ఏఐసీసీ అధిష్ఠానం తర్వాత వెనక్కి తీసుకోవాలని నిర్ణయించి ఆమెకు తెలియపరిచిందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అజయ్‌ కుమార్‌ చెప్పారు. శనివారం భువనేశ్వర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థిని మార్చడం ఖాయమని తెలుసుకొని ఆమె ఇలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రచారానికి పార్టీ నిధులు ఇవ్వడం లేదన్న విషయం కూడా వాస్తవం కాదని, నిధులకు కొరత లేదని  చెప్పారు. అభ్యర్థులందరికీ నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. గెలిచే అవకాశం లేనందున ఆమెను తప్పించిన అధిష్ఠానం త్వరలో పూరీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటిస్తుందన్నారు.


నామినేషన్‌ దాఖలుకు రేపే ఆఖరు తేదీ

పూరీ లోక్‌సభ స్థానానికి ఆరో విడతలో భాగంగా మే 25న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు మే 6 ఆఖరు తేదీ. సుచరిత ఇప్పటి వరకు నామినేషన్‌ దాఖలు చేయలేదు. మరోవైపు ఈ స్థానం నుంచి ఇప్పటికే భాజపా తరఫున సంబిత్‌ పాత్రా, బిజూ జనతా దళ్‌ అభ్యర్థి అరూప్‌ పట్నాయక్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img