icon icon icon
icon icon icon

గోధ్రా రైలు దహనకాండలో.. బాధ్యులను కాపాడజూసిన లాలూ

అరవైమందికి పైగా కరసేవకులను సజీవదహనం చేసిన 2002 నాటి గోధ్రా రైలు దహనకాండలో బాధ్యులైనవారిని కాపాడేందుకు సైతం ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలనే ఎంచుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు.

Updated : 05 May 2024 06:46 IST

ఉగ్రదాడుల్లో చేతులెత్తేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం
ఝార్ఖండ్‌, బిహార్‌ సభల్లో ప్రధాని మోదీ

దర్భంగా (బిహార్‌)/పలామూ, సిసయీ (ఝార్ఖండ్‌): అరవైమందికి పైగా కరసేవకులను సజీవదహనం చేసిన 2002 నాటి గోధ్రా రైలు దహనకాండలో బాధ్యులైనవారిని కాపాడేందుకు సైతం ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలనే ఎంచుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. శనివారం ఝార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఇరవై ఏళ్ల కిందట తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర బిహార్‌లోని దర్భంగా ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ‘‘బిహార్‌ యువరాజు (తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశించి) తండ్రి నాడు గోధ్రా రైలు నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పుడున్నది సోనియా మేడం పాలన. స్వయంగా దోషిగా (దాణా కుంభకోణం కేసుల్లో) తేలిన ఆయన (లాలూప్రసాద్‌ యాదవ్‌) అప్పుడు రైల్వేమంత్రిగా ఉన్నారు. ఓ విచారణ కమిటీ వేసి, భయంకరమైన నేరానికి పాల్పడినవారిని నిర్దోషులుగా తేలుస్తూ నివేదిక రూపొందించారు. కానీ, కోర్టు ఆ నివేదికను తోసిపుచ్చింది’’ అని మోదీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ముస్లింలకు మళ్లించాలని చూస్తున్న ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌, తొలి ప్రధాని నెహ్రూల దృక్పథాలకు భిన్నంగా వెళుతున్నారని విమర్శించారు. మతప్రాతిపదికన రిజర్వేషన్లను ఈ నేతలిద్దరూ వ్యతిరేకించినట్లు ప్రధాని తెలిపారు. సాయుధ దళాల నేతృత్వానికి మతాన్ని ఆపాదిస్తూ తేజస్వీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘‘గతంలో ఉగ్రదాడుల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోయేది. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. మన వైమానిక దాడులతో అల్లాడిపోయిన పాకిస్థాన్‌.. కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌ను ఉద్దేశించి) భారత ప్రధాని కావాలని ప్రార్థిస్తోంది’’ అన్నారు. పేదల కోసం మోదీ పెట్టే కన్నీళ్లు ఆగర్భ శ్రీమంతులకు అర్థం కావన్నారు. మూడో విడత పాలనలో కచ్చా ఇళ్లన్నీ పక్కాగృహాలుగా మారుస్తానని, ఇది ‘మోదీ గ్యారంటీ’ అని ప్రధాని భరోసా ఇచ్చారు.  


నాకు ఇల్లు, సైకిలు కూడా లేవు

ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఉన్న గత 25 ఏళ్ల కాలంలో తనపై ఒక్క అవినీతి మచ్చా లేదని మోదీ అన్నారు. తనకు సొంత ఇల్లు, సైకిలు కూడా లేకపోగా.. ఝార్ఖండ్‌లోని జేఎంఎం - కాంగ్రెస్‌ అధికార కూటమి నేతలు మాత్రం వారసుల కోసం భారీగా సంపదను కూడబెడుతున్నారని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం అవినీతి శక్తుల ముసుగు తొలగించిందని, వచ్చే అయిదేళ్లలో వారందరికీ చట్టపరమైన శిక్షలు తప్పవన్నారు. అవినీతిపరులకు మద్దతుగా ఇండియా కూటమి నేతలు దిల్లీ, రాంచీల్లో నిర్వహించిన ర్యాలీలు వారి నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాయని ప్రధాని మండిపడ్డారు. యూపీఏ పాలనలో గిరిజన కుటుంబాల్లోని పిల్లలు ఆకలిచావులకు గురవుతుంటే, గిడ్డంగుల్లో ధాన్యం కుళ్లిపోయేదన్నారు. నేడు పేదలకు తాము ఇస్తున్న ఉచిత రేషను పంపిణీని ఈ భూమ్మీద ఏ శక్తీ అడ్డుకోలేదని, ఇది ‘మోదీ గ్యారంటీ’ అన్నారు. శనివారం సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చేరుకున్న ప్రధాని రోడ్‌షో నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img