icon icon icon
icon icon icon

మైనార్టీల అడ్డాలు!

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు దక్కించుకునేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

Updated : 05 May 2024 07:14 IST

మూడో విడతలో బెంగాల్‌లో 4 స్థానాలకు పోలింగ్‌ 
అన్నింటా త్రిముఖ పోటీ
ఈనాడు ప్రత్యేక విభాగం

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు దక్కించుకునేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటికి కాంగ్రెస్‌, వామపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో భాగంగా బెంగాల్‌లో కీలకమైన మాల్దా ఉత్తరం, మాల్దా దక్షిణం, ముర్శీదాబాద్‌, జంగీపుర్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానాల్లో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువ. దానికితోడు స్థానికంగా వివిధ రాజకీయ సమీకరణాలు పోటీని ఆసక్తికరంగా మార్చాయి. ప్రస్తుతం ఈ నాలుగు చోట్లా త్రిముఖ పోటీ కనిపిస్తోంది.


మాల్దా ఉత్తరం: తృణమూల్‌లో విభేదాలు

ఇది భాజపా సిటింగ్‌ స్థానం. ఆ పార్టీ తరఫున స్థానిక ఎంపీ ఖగేన్‌ ముర్ము మరోసారి బరిలో దిగారు. తృణమూల్‌ నుంచి మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రసూన్‌ బెనర్జీ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ముస్తాక్‌ ఆలం పోటీ చేస్తున్నారు. ఈ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వాటిలో నాలుగింటిని తృణమూల్‌, మూడింటిని భాజపా గెల్చుకుంది. దాన్ని బట్టి తృణమూల్‌దే కాస్త పైచేయి అనిపిస్తున్నా.. అంతర్గత విభేదాలతో ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది. దిగ్గజ నేత ఏబీఏ ఘనీ ఖాన్‌ చౌధరీ కుటుంబానికి మాల్దా జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఆ కుటుంబానికి చెందిన మౌసమ్‌ నూర్‌ మాల్దా ఉత్తరంలో 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచారు. 2019లో ఆమె తృణమూల్‌ తరఫున పోటీ చేయగా, ఘనీ కుటుంబానికే చెందిన ఇషా ఖాన్‌ చౌధరీ కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగారు. ఫలితంగా వారి మధ్య ఓట్లు చీలి.. భాజపా అభ్యర్థి ఖగేన్‌ ముర్ము గెలిచారు. ఈ దఫా తృణమూల్‌ తనకు టికెట్‌ ఇవ్వకపోవడంపై నూర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఫలితంగా పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం లోక్‌సభ సీట్లు 42


ముర్శీదాబాద్‌: ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు తృణమూల్‌వే..

ఈ నియోజకవర్గం తృణమూల్‌ సిటింగ్‌ స్థానం. ఆ పార్టీ తరఫున స్థానిక ఎంపీ అబూ తాహిర్‌ ఖాన్‌ మరోసారి బరిలో ఉన్నారు. సీపీఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ సలీం పోటీ చేస్తున్నారు. భాజపా గౌరీశంకర్‌ ఘోష్‌కు టికెట్‌ ఇచ్చింది. 1980 నుంచి 1999 దాకా ఈ స్థానం సీపీఎం ఖాతాలో ఉంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. తర్వాత ఈ సీటు 2014లో సీపీఎం, 2019లో తృణమూల్‌ ఖాతాలోకి వెళ్లింది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వాటిలో ఆరు ప్రస్తుతం తృణమూల్‌ సిటింగ్‌ స్థానాలు. అయితే ఇటీవల భాజపా బాగానే పుంజుకున్నట్లు కనిపిస్తోంది. సీపీఎం తరఫున మహమ్మద్‌ సలీం లాంటి సీనియర్‌ నేత బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు ఉత్కంఠ రేకెత్తిస్తోంది.


మాల్దా దక్షిణం: భాజపా జోరు

ఇది కాంగ్రెస్‌ సిటింగ్‌ స్థానం. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి, ఘనీ కుటుంబానికి చెందిన అబూ హసీం ఖాన్‌ చౌధరీ స్వల్ప మెజార్టీతో భాజపా నాయకురాలు శ్రీరూప మిత్ర చౌధరీపై విజయం సాధించారు. ప్రస్తుతం హసీం ఖాన్‌ తనయుడు ఇషా ఖాన్‌ చౌధరీ కాంగ్రెస్‌ టికెట్‌పై బరిలో నిలిచారు. కమలదళం మరోసారి శ్రీరూపకు టికెట్‌ ఇచ్చింది.లండన్‌లో సుదీర్ఘకాలం నివసించిన ఎన్నారై షానవాజ్‌ అలీ రెహాన్‌ను ఇక్కడ తృణమూల్‌ బరిలో నిలిపింది.


జంగీపుర్‌: ప్రణబ్‌తో అనుబంధం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఈ నియోజకవర్గంతో అనుబంధం ఎక్కువ. 2004, 2009 ఎన్నికల్లో ఇక్కణ్నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. ప్రణబ్‌ రాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత ఆయన తనయుడు అభిజిత్‌ ముఖర్జీ రెండుసార్లు ఈ స్థానంలో పోటీ చేశారు. ప్రస్తుతం ఇది తృణమూల్‌ సిటింగ్‌ సీటు. ఆ పార్టీ తరఫున స్థానిక ఎంపీ, స్థానిక వ్యాపారవేత్త ఖలీలుర్‌ రహ్మాన్‌ మళ్లీ పోటీ చేస్తున్నారు. భాజపా అభ్యర్థి ధనంజయ్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నేత మొర్తాజా హొస్సేన్‌ల నుంచి రహ్మాన్‌ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img