icon icon icon
icon icon icon

‘ఇండియా’ గెలుపు పక్కా

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Updated : 05 May 2024 06:25 IST

ఫలితాల తర్వాత తృణమూల్‌ సహా మరిన్ని పార్టీలూ మాతో కలుస్తాయ్‌
సంకీర్ణ సర్కారు ఏర్పడితే.. ఇతరుల మాట వినే ప్రధాని వస్తారు
కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ వ్యాఖ్యలు

దిల్లీ: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత- భాజపాను అడ్డుకునేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా పలు ఇతర పార్టీలూ తమతో చేతులు కలుపుతాయని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి సంకీర్ణ సర్కారును ఏర్పాటుచేస్తే.. ఇతరుల మాట వినే ప్రధానిని ప్రజలు పొందొచ్చని పేర్కొన్నారు. ప్రముఖ వార్తాసంస్థ ‘పీటీఐ’ సంపాదకులతో మాటామంతిలో థరూర్‌ తాజాగా పలు అంశాలపై మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వాల గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నొక్కిచెప్పారు. అలాంటి సర్కారులు ఏర్పడితే ప్రధాని పదవిని ఎవరు చేపట్టినా నిరంకుశ నిర్ణయాలు ఉండవని, ఇతర పార్టీల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఒకే పార్టీ పూర్తి ఆధిక్యంతో అధికారంలోకి వచ్చినప్పటితో పోలిస్తే.. సంకీర్ణ సర్కారుల హయాంలోనే దేశ ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉందని చెప్పారు. మాజీ ప్రధానమంత్రులు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, మన్మోహన్‌సింగ్‌ల నేతృత్వంలోని ప్రభుత్వాల పాలనను అందుకు ఉదాహరణలుగా ప్రస్తావించారు. కేరళలో కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య ఉన్న వైరం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అడ్డుకాబోదని అభిప్రాయపడ్డారు. అయోధ్యలో రామాలయ ప్రారంభమనే గొప్ప కార్యక్రమాన్ని.. ప్రధాని మోదీని కీర్తించే రాజకీయ వేదికగా మార్చేశారంటూ థరూర్‌ విమర్శించారు. అందుకే ప్రాణప్రతిష్ఠ వేడుకకు కాంగ్రెస్‌ దూరంగా ఉండటం సబబేనన్నారు. మరోవైపు- వారసత్వపు పన్నుపై కాంగ్రెస్‌ నేత శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై భాజపా విమర్శలు గుప్పిస్తుండటాన్ని థరూర్‌ తప్పుబట్టారు. తమ పార్టీ ఎప్పుడూ వారసత్వ పన్ను గురించి మేనిఫెస్టో రూపకల్పన సమయంలో చర్చించలేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img