icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (7)

గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలవారి నుంచి రిజర్వేషన్లను లాక్కొని.. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు వాటిని ఇవ్వడమే కాంగ్రెస్‌ ఎజెండా.

Updated : 06 May 2024 06:29 IST

రిజర్వేషన్‌ లాక్కోవడమే కాంగ్రెస్‌ ఎజెండా

గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలవారి నుంచి రిజర్వేషన్లను లాక్కొని.. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు వాటిని ఇవ్వడమే కాంగ్రెస్‌ ఎజెండా. మునుపటిమాదిరి ఓటుబ్యాంకు రాజకీయాలు, కులమతాల రాజకీయాలు లేకుండా అందరి అభివృద్ధికి పాటుపడడమే నరేంద్రమోదీ సర్కారు లక్ష్యం. మైనారిటీలను ప్రత్యేకంగా చూస్తామని మ్యానిఫెస్టోలోనూ కాంగ్రెస్‌ చెప్పింది. అలాంటి పార్టీకి తగిన బుద్ధి చెప్పండి.

ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పుర్‌లో భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా


మోదీ రాజకీయ చరిత్ర అంతా హిందూ-ముస్లిం వివాదాలపైనే

ప్రధాని నరేంద్రమోదీ రాజకీయ చరిత్ర అంతా హిందూ-ముస్లిం వివాదాలపైనే ఆధారపడి ఉంది. దానినుంచి ఎవరు లబ్ధిపొందారో, ఎవరు ఇబ్బందులు పడ్డారో ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలైన అంశాలపై కాకుండా కులమతాలపై భాజపా ఓట్లు అడుగుతోంది. ఎన్నికల్లో భాజపా విజయంలో ఈవీఎంల పాత్ర ఉందనే నేను అనుకుంటున్నాను.

పీటీఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌


రాముడి పేరుతో ఓట్లు అడుగుతారు అభివృద్ధిపై మాట్లాడరు

ద్వారక, మథుర, అయోధ్య వంటి ప్రతి ఆలయానికీ నరేంద్ర మోదీ వెళ్తారు. రాముడి పేరుతో ఓట్లడుగుతారు. అభివృద్ధి, ద్రవ్యోల్బణం, ఉద్యోగాల గురించి మాత్రం మాట్లాడరు. 2019లో పుల్వామా దాడి ఎందుకు జరిగిందో కూడా చెప్పరు. మొదటి రెండు దశల లోక్‌సభ ఎన్నికల తర్వాత భాజపా వెనకబడింది.

ముంబయిలో విలేకరులతో శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నేత సంజయ్‌ రౌత్‌


వాజ్‌పేయీ చెప్పిన రాజధర్మం వ్యాఖ్య గుర్తుంది

గోధ్రా రైలు ఘటనపై మా తండ్రి లాలూ గురించి మోదీ ఏమైనా చెప్పనీయండి. గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగినప్పుడు అప్పటి ప్రధాని వాజ్‌పేయీ ఆనాటి గుజరాత్‌ సీఎం మోదీని ఉద్దేశించి- రాజధర్మాన్ని పాటించాలని చెప్పిన వ్యాఖ్య నాకు గుర్తుంది.

బిహార్‌లోని దర్భంగాలో పీటీఐతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌


ఈవీఎం ఓ దొంగ యంత్రం

ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం) అంటే దొంగ యంత్రం. దానిలో మతలబులు జరిగే అవకాశం ఉంది. దానిని గుర్తుంచుకుని ఈ ఎన్నికల్లో ఓటు వేసినప్పుడు మీరు నొక్కిన మీట వద్ద ఎల్‌ఈడీ లైట్‌ వెలిగిందా, బీప్‌మనే శబ్దం వచ్చిందా లేదా అనేవి చూసుకోవాలి. మీరు ఓటువేసిన గుర్తునే ఓటు రసీదు యంత్రం చూపించిందా అనేది చూడండి.

శ్రీనగర్‌ శివార్లలోని సభలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా


2014 స్క్రిప్టును మోదీ చదువుతున్నారు

ముస్లింలకు రిజర్వేషన్లపై ప్రధాని మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014 స్క్రిప్టును ఇప్పుడు చదువుతున్నారు. పదేళ్లలో సాధించిందేమిటో ప్రజలకు చెప్పి ఈ ఎన్నికల్లో ఆయన ఓట్లు అడుగుతారని మేం అనుకున్నాం. అలా కాకుండా కాంగ్రెస్‌ గురించి తప్ప ఆయన మరేమీ మాట్లాడడం లేదు. 2004లో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరిగి భాజపా అధికారం కోల్పోతుంది.

కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ విభాగం అధిపతి సుప్రియా శ్రీనేత్‌


అసలైన అంశాలకు భాజపా జవాబివ్వదు

ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలకు భాజపా సమాధానమివ్వదు. తమ నేతల్ని మాత్రం పదేపదే రాజ్యాంగం మార్పు గురించి మాట్లాడాలని చెబుతుంది. అలా వారికి ఎందుకు చెప్పాల్సి వస్తోందో భాజపా జవాబివ్వగలదా? ఉద్యోగాల భర్తీ, ప్రశ్నపత్రాల లీకేజి, అగ్నిపథ్‌ పథకం వంటివాటికి సమాధానాలు లేకపోతే ఆ పార్టీకి ఓట్లు వేయకూడదు.

ఆగ్రా సభలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img