icon icon icon
icon icon icon

మతపరమైన రిజర్వేషన్లతో మరోమారు దేశ విభజన ముప్పు

‘‘కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం ఆవాస్‌ యోజన, ఉజ్వల యోజన.. ఇలా ఏ పథకమైనా వివక్ష లేకుండా అందరికీ అందుతున్న విషయాన్ని ముస్లిం సోదర సోదరీమణులు గమనిస్తున్నారు.

Updated : 06 May 2024 06:28 IST

విపక్షాల చేతిలో పావులుగా మారామని ముస్లింలు గ్రహించారు: మోదీ
అయోధ్యలో పూజలు, రోడ్‌ షో

అయోధ్య, ఇటావా, సీతాపుర్‌ (యూపీ):‘‘కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం ఆవాస్‌ యోజన, ఉజ్వల యోజన.. ఇలా ఏ పథకమైనా వివక్ష లేకుండా అందరికీ అందుతున్న విషయాన్ని ముస్లిం సోదర సోదరీమణులు గమనిస్తున్నారు. ఓటుబ్యాంకు రాజకీయ కాంట్రాక్టర్ల ఆటలు ఇక సాగవు. మతపరమైన రిజర్వేషన్ల డిమాండుతో మరోమారు దేశ విభజనకు విపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ విషయాన్ని అవి గుర్తించడం లేదు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా, ధౌరెహరా ఎన్నికల సభల్లో ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్‌, ఇండియా కూటమి తమను పావులుగా వాడుకొంటున్నాయని ముస్లింలు గ్రహించారని, ఎలాంటి పక్షపాతం లేని భాజపా సర్కారు అభివృద్ధిని చూసి ఈ వర్గం విపక్షాల నుంచి దూరమవుతోందని ప్రధాని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో పూర్తిస్థాయి రాజ్యాంగం అమలును ఇన్నాళ్లూ అడ్డుకున్న ఆర్టికల్‌ 370కి మోదీ సమాధి కట్టాడని, దీన్ని బయటకుతీసి మళ్లీ దేశం నెత్తిన రుద్దడం ఎవరి తరం కాదని చెప్పారు. అధికారంలోకి వస్తే ఉచిత రేషను పథకం, వందేభారత్‌ రైళ్ల వంటి సదుపాయాలు నిలిపివేస్తామని విపక్షాలు చెబుతున్నాయన్న మోదీ.. ‘‘సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీలను నేను ఒక విషయం అడగదలచుకున్నా. అధికారంలోకి వస్తే రామమందిరాన్ని ఆసుపత్రిగా మార్చేస్తారా? కాశీ విశ్వనాథుని ఆవరణలో బుల్డోజర్‌ నడుపుతారా?’’ అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

మోదీ, యోగిలకు పిల్లలు లేరు..

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల నేతలు వారి కుటుంబాలు, పిల్లలు, ఓటుబ్యాంకుల లబ్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని.. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న మోదీ, యోగి (యూపీ సీఎం)లకు పిల్లలు లేరని ప్రధాని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన దివంగత ములాయంసింగ్‌ యాదవ్‌ సొంత జిల్లా ఇటావా ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకుటుంబాలకు చెందినవారే ముఖ్యమంత్రులు, ప్రధానులు అవుతారన్న చెడు సంప్రదాయాన్ని ఈ ‘చాయ్‌వాలా’ (మోదీ) బద్దలు చేశాడన్నారు. ఒక దుష్ట ఆచారాన్ని (సతీ సహగమనం) రూపుమాపిన రాజా రామ్‌మోహన్‌ రాయ్‌ గురించి ఇప్పటికీ ఎలా చెప్పుకొంటున్నారో, అదేవిధంగా సామాన్యులకు ఉన్నత పదవులను చేరువ చేసిన ‘చాయ్‌వాలా’ ప్రధాని గురించి చెప్పుకొనే రోజు కూడా వస్తుందన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టిన సమాజ్‌వాదీ పార్టీ నేతలు వారు మాత్రం రహస్యంగా టీకాలు తీసుకొన్నట్లు మోదీ విమర్శించారు.


అయోధ్య రాముడికి సాష్టాంగ నమస్కారం

అయోధ్యకు చేరుకొన్న ప్రధాని మోదీ నేరుగా రామమందిరాన్ని సందర్శించుకొని పూజలు చేశారు. టీవీల్లో ప్రసారమైన ఈ కార్యక్రమంలో రామ్‌లల్లా విగ్రహం ముందు ప్రధాని సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలంకరణతో తీర్చిదిద్దారు. పూజల అనంతరం అయోధ్య నగరంలో రెండు కి.మీ.ల మేర మోదీ రోడ్‌షో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి లల్లూ సింగ్‌ వెంట ఉన్నారు.


వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్‌ 14న

వారణాసి: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి స్థానం నుంచి మరోసారి పోటీచేస్తున్న ప్రధాని మోదీ ఈ నెల 14న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అంతకుముందు రోజు నిర్వహించే భారీ రోడ్‌ షోలో ప్రధాని మోదీ పాల్గొంటారని వారణాసి నగర భాజపా అధ్యక్షుడు విద్యాసాగర్‌ రాయ్‌ ఆదివారం వెల్లడించారు. రోడ్‌ షో నిర్వహించే మార్గం ఖరారైందని, అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. వారణాసి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అజయ్‌ రాయ్‌, బీఎస్పీ అభ్యర్థిగా అతహర్‌ జమాల్‌ లారీ బరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో జూన్‌ 1న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img