icon icon icon
icon icon icon

మూడోదశ ప్రచారానికి తెర

సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడోదశ కింద 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 స్థానాలకు మంగళవారం జరగబోయే పోలింగుకు సంబంధించి ప్రచార పర్వానికి ఆదివారం సాయంత్రం తెరపడింది.

Updated : 06 May 2024 06:50 IST

రేపు 94 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌
బరిలో అమిత్‌షా, జ్యోతిరాదిత్య సహా కేంద్ర మంత్రులు

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడోదశ కింద 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 స్థానాలకు మంగళవారం జరగబోయే పోలింగుకు సంబంధించి ప్రచార పర్వానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. గుజరాత్‌లో మొత్తం 26 స్థానాలూ ఈ దశలోనే ఉన్నాయి. సూరత్‌లో ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మిగిలిన 25 స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, యూపీలో 10, మధ్యప్రదేశ్‌లో 8, పశ్చిమబెంగాల్‌, అస్సాంలలో చెరో 4, బిహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 7 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. మిగిలిన అయిదు సీట్లు ఇతర రాష్ట్రాలో ఉన్నాయి. అస్సాంలో ఆదివారం భారీ వర్షాలు కురిసినా అధికార, విపక్షాలు రెండూ వాహన ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారాన్ని యథావిధిగా కొనసాగించాయి.

ప్రముఖుల్లో విజయం ఎవరిదో!

బరిలోని ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు- అమిత్‌షా (గాంధీనగర్‌), మన్సుఖ్‌ మాండవీయ (పోర్‌బందర్‌), పురుషోత్తం రూపాలా (రాజ్‌కోట్‌), ఎస్‌.పి.సింగ్‌ బఘెల్‌ (ఆగ్రా), జ్యోతిరాదిత్య సింధియా (గుణ), ప్రహ్లాద్‌ జోషి (ధార్వాడ్‌), నారాయణ రాణె (రత్నగిరి-సింధుదుర్గ్‌) ఉన్నారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (విదిశా), దిగ్విజయ్‌సింగ్‌ (రాజ్‌గఢ్‌); కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై (హవేరీ), జగదీశ్‌ శెట్టర్‌ (బెలగావి) తదితరులు ప్రజా తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. యూపీలోని మైన్‌పురీలో డింపుల్‌ యాదవ్‌ (సమాజ్‌వాదీ పార్టీ), ఎటాలో యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ తనయుడు రాజ్‌వీర్‌సింగ్‌ భవితవ్యం ఈ దశలో తేలనుంది. మహారాష్ట్రలోని బారామతిలో వదినా మరదళ్ల (సునేత్రా పవార్‌, సుప్రియా సూలే) సమరంలో ఎవరికి ఓటర్లు పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img