icon icon icon
icon icon icon

తెల్ల టీషర్టే ఎందుకు ధరిస్తానంటే?

రాజకీయ ప్రత్యర్థుల పరస్పర విమర్శలు, ఆరోపణలతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గరంగరంగా మారిన వేళ.. ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించటానికా అన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ..రెండు నిమిషాలకు మించిన నిడివి గల ఓ వీడియోను విడుదల చేసింది.

Published : 06 May 2024 04:38 IST

రాహుల్‌గాంధీ సరదా సమాధానాలతో కాంగ్రెస్‌ పార్టీ వీడియో విడుదల

దిల్లీ: రాజకీయ ప్రత్యర్థుల పరస్పర విమర్శలు, ఆరోపణలతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గరంగరంగా మారిన వేళ.. ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించటానికా అన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ..రెండు నిమిషాలకు మించిన నిడివి గల ఓ వీడియోను విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ తెల్ల టీషర్టే ఎందుకు ధరిస్తున్నారో వివరించడంతో పాటు పలు ప్రశ్నలకు రాహుల్‌ గాంధీ సరదాగా ఇచ్చిన జవాబులు అందులో ఉన్నాయి. ‘కర్ణాటకలో ఒక రోజు ఎన్నికల ప్రచారం...’ శీర్షికతో తన సామాజిక మాధ్యమ ఛానళ్లలో ఆ వీడియోను కాంగ్రెస్‌ పార్టీ పోస్ట్‌ చేసింది. ‘పారదర్శకతతో పాటు నిరాడంబరతను సూచిస్తుందనే ఉద్దేశంతోనే పాదయాత్రల్లో, ఎన్నికల ప్రచారంలో శ్వేతవర్ణ టీషర్ట్‌ను ధరిస్తున్నా’నని ఆ వీడియోలో రాహుల్‌ సమాధానమిచ్చారు. సరళత్వం, నిరాడంబరత తనకిష్టమైనవని వివరించారు. ‘అధికారం వైపు అడుగులు వేసే పెద్ద సంస్థకు సైద్ధాంతికపరమైన స్పష్టత అవసరమని నా అభిప్రాయం. పేదలు, మహిళల అనుకూల భావజాలం, సమానత్వం, బహుళత్వ వాదం తదితర అంశాల్లో మన సైద్ధాంతిక దృక్పథాన్ని ప్రజలకు వివరించి వారిని ఒప్పించడం ముఖ్యం’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ‘జాతీయ స్థాయిలోనూ, సంస్థాగతంగానూ సిద్ధాంతపరమైన పోరాటం ఎల్లవేళలా కొనసాగాల’ని కాంగ్రెస్‌ అగ్రనేత అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో మీకు అత్యంత ఇష్టమైనది ఏమిటని ప్రశ్నించగా... ‘అది ముగింపు దశకు రావడమే’నంటూ చమత్కరించారు. భారత్‌ జోడో యాత్రను ఒక ప్రచార కార్యక్రమంగా కాకుండా ప్రజలతో మమేకమయ్యే అవకాశమని భావించడంతోనే 70 రోజులకు పైగా రహదారులపైనే గడపగలిగానని వివరించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కొన్ని ప్రశ్నలు సంధించారు రాహుల్‌ గాంధీ. ఎన్నికల ప్రచారంలో ఖర్గేకు నచ్చిన, నచ్చని అంశాలేమిటని ఆరా తీశారు. ‘దేశం కోసం శ్రమిస్తున్న ఎన్నికల పోరు ఇది. దేశానికి హాని చేస్తున్న వ్యక్తులను నిలువరించడం ద్వారా జన్మభూమికి మేలు చేస్తున్నామన్న సంతృప్తి కలుగుతోంద’ని ఖర్గే ఆ వీడియోలో బదులిచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా వీడియోలో కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img