icon icon icon
icon icon icon

ముస్లింలకు ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్‌

గుజరాత్‌ లోక్‌సభ ఎన్నికల్లో 35 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఒక్కరూ ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడం లేదు.

Published : 06 May 2024 04:56 IST

గుజరాత్‌లో మారిన హస్తం పార్టీ సంప్రదాయం

అహ్మదాబాద్‌: గుజరాత్‌ లోక్‌సభ ఎన్నికల్లో 35 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఒక్కరూ ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ముస్లింలకు కనీసం ఒకటో రెండో సీట్లు కేటాయించే హస్తం పార్టీ కూడా ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. ఆ వర్గం నుంచి ఒక్కరినీ అభ్యర్థిగా ప్రకటించలేదు. కాస్త పేరున్న పార్టీల్లో ఒక్క బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) మాత్రమే గాంధీ నగర్‌ నుంచి ఓ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టింది. పోటీ చేస్తున్న 35 మంది ముస్లిం అభ్యర్థుల్లో కూడా చాలా మంది స్వతంత్రులే కావడం గమనార్హం. మిగిలిన వారంతా చిన్నా చితక పార్టీల నుంచి పోటీచేస్తున్నారు. మొత్తం 26 లోక్‌సభ సీట్లలో వీరు 25 నియోజకవర్గాల్లో పోటీకి దిగుతున్నారు. పోలింగ్‌ మంగళవారం జరగనుంది.

భరూచ్‌ కూడా దక్కలేదు

భరూచ్‌ లోక్‌సభ సీటును సాధారణంగా కాంగ్రెస్‌ ముస్లిం అభ్యర్థికి కేటాయించేది. ఈసారి సీట్ల పంపకంలో భాగంగా ఆ నియోజకవర్గం ఆప్‌కు వెళ్లింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్న దివంగత కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైజల్‌ పటేల్‌, కుమార్తె ముంతాజ్‌ పటేల్‌కు చుక్కెదురైంది. భరూచ్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌ తొలిసారి 1977లో పోటీ చేశారు. 1980, 84లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ సారి భరూచ్‌ నుంచి ఆప్‌ గిరిజన నేత ఛైతర్‌ వసావాను నిలబెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img