icon icon icon
icon icon icon

రాజకీయ క్రీడాకలాపం!

మన దేశంలో రాజకీయాలకు, క్రీడలకు అవినాభావ సంబంధం ఉంది. ఎందరో క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన సందర్భాలున్నాయి.

Published : 06 May 2024 04:57 IST

రెండింటికీ విడదీయరాని అనుబంధం
రాజకీయాల్లో రాణించిన క్రీడాకారులెందరో..
క్రీడా సంస్థలపైనా నేతల ఆధిపత్యం
(దిల్లీ నుంచి నీరేంద్ర దేవ్‌)

మన దేశంలో రాజకీయాలకు, క్రీడలకు అవినాభావ సంబంధం ఉంది. ఎందరో క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన సందర్భాలున్నాయి. అదే సమయంలో కొందరు క్రీడా దిగ్గజాలు రాజకీయాల్లోకి వచ్చినా సరిపడక మళ్లీ వెనక్కి వెళ్లిన పరిస్థితులూ ఉన్నాయి. మరోవైపు ఉద్ధండ రాజకీయ నాయకులు క్రీడా సంస్థలను విజయవంతంగా నడిపిన సందర్భాలూ గోచరిస్తాయి. మన దేశంలో క్రీడా సంస్థలకు ఎంతో మంది రాజకీయ నాయకులు నేతృత్వం వహించారు.. వహిస్తున్నారు.

 • తన చిన్నప్పుడు కొన్ని క్రీడల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొనేవారు. ఇప్పుడు ఆయన కుమారుడు జై షా భారత్‌ క్రికెట్‌ నియంత్రణ మండలికి (బీసీసీఐ) నేతృత్వం వహిస్తున్నారు. ఆయనకు క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకోవడం కూడా రాదన్న విమర్శలను పక్కనబెడితే ఆ సంస్థను మాత్రం విజయవంతంగానే నడిపిస్తున్నారు.
 • దివంగత నేత, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ భర్త అయిన ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ ఒకప్పుడు ఫుట్‌బాల్‌ ఆడేవారు.
 • శరద్‌ పవార్‌ ఒకప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు. 2004లో బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. 2005లో గెలిచారు. అంతకుముందు పవార్‌ అమెచ్యూర్‌ కబడ్డీ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా పని చేశారు.
 • దివంగత కేంద్ర మంత్రి మాధవరావు సింధియా బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు.
 • మరో దివంగత కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ దిల్లీ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడిగా పని చేశారు.

ఎన్నికల్లో పోటీ..

 • గతంలో బిహార్‌ నుంచి భాజపా తరఫున ఎంపీగా గెలిచిన కీర్తి ఆజాద్‌ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపుర్‌-బర్దమాన్‌ నుంచి తృణమూల్‌ తరఫున బరిలోకి దిగారు. ఆయన భాజపా బలమైన నేత దిలీప్‌ ఘోష్‌తో తలపడుతున్నారు.
 • బెంగాల్‌లోని బహరంపుర్‌లో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరిపై క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ను తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ బరిలోకి దించారు.

రాజ్యసభకు..

 • భారత రత్న, క్రికెట్‌ సూపర్‌స్టార్‌ సచిన్‌ తెందుల్కర్‌ రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు.
 • పరుగుల రాణి పీటీ ఉష కూడా రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు.

గతంలోనూ..

 • 1991లో దిల్లీలోని సదర్‌ సీటులో కాంగ్రెస్‌ తరఫున జూడో ఫెడరేషన్‌ అధ్యక్షుడైన జగదీశ్‌ టైట్లర్‌ పోటీ చేశారు. ఆయనపై పోటీ చేసిన ఆర్చరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ మల్హోత్రా ఓడిపోయారు.
 • 1983లో క్రికెట్‌ ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్‌.. క్రీడా వ్యవహారాల్లో అరుణ్‌ జైట్లీతో విభేదించేవారు. ఆ తర్వాత వారిద్దరూ భాజపా తరఫున ఎంపీలుగా పనిచేయడం విశేషం.
 • 1990లలో క్రికెట్‌లో రాణించిన చేతన్‌ చౌహాన్‌ భాజపా తరఫున పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
 • ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ క్రీడాకారుడు అస్లాం షేర్‌ ఖాన్‌ కూడా రాజకీయాల్లో రాణించారు.
 • క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ 1991లో భోపాల్‌ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. అంతకుముందు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
 • బాస్కెట్‌ బాల్‌ మాజీ ప్లేయర్‌ కృష్ణ తీరథ్‌ దిల్లీలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు.
 • 2019లో తూర్పు దిల్లీ నుంచి భాజపా తరఫున గెలిచిన మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఈసారి పోటీ చేయడం లేదు.
 • కేంద్ర మాజీ మంత్రి సంతోష్‌ మోహన్‌ దేవ్‌ ఫుట్‌బాల్‌ రిఫరీగా పని చేశారు.
 • ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేసిన విద్యా చరణ్‌ శుక్లా కేంద్ర మంత్రిగా పని చేశారు.
 • బిహార్‌ గవర్నర్‌గా పని చేసిన బూటా సింగ్‌ అమెచ్యూర్‌ అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన 1982లో నిర్వహించిన ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగానూ సేవలందించారు.
 • పుణెకు చెందిన వీఎన్‌ గాడ్గిల్‌ ఖోఖో ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా పని చేశారు.
 • కామన్‌వెల్త్‌ క్రీడల్లో అవకతవకల ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన సురేశ్‌ కల్మాడీ.. భారత్‌ ఒలింపిక్‌ సంఘానికి చాలాకాలంపాటు అధ్యక్షుడిగా పని చేశారు.
 • కేంద్ర మాజీ మంత్రి నట్వర్‌ సింగ్‌.. అఖిల భారత టెన్నిస్‌ సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారు.
 • ఒడిశా రాజకీయ నేత కేపీ సింగ్‌ దేవ్‌ కూడా బోవింగ్‌ అకాడమీ అధ్యక్షుడిగా పని చేశారు.
 • మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్దూ పంజాబ్‌ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు.
 • ఫుట్‌బాల్‌ మాజీ క్రీడాకారుడు ప్రసూన్‌ బెనర్జీ హావ్‌డా నుంచి తృణమూల్‌ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు.
 • ఒలింపిక్‌ పతక విజేత రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌ భాజపా తరఫున గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నారు.
 • క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img