icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (8)

సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశల్లో ఓట్లశాతం తగ్గుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సలహాదారుడు, ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్‌ తన నివేదికలో పేర్కొన్నారు.

Updated : 07 May 2024 07:01 IST

2019కి భిన్నంగా 2024 ఎన్నికలు
పెరగనున్న ఓట్లశాతం: నివేదిక

ముంబయి: సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశల్లో ఓట్లశాతం తగ్గుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సలహాదారుడు, ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్‌ తన నివేదికలో పేర్కొన్నారు. పోలైన ఓట్ల ఆధారంగా విశ్లేషణ చేయడం సరైన పద్ధతి అన్నారు. 2019తో పోలిస్తే తొలి 2 దశల్లో ఓటింగ్‌ 3.1% తగ్గినా, మిగతా ఐదు దశల్లో ఓటింగ్‌ శాతం ఇంగ్లిషు అక్షరం ‘జె’ ఆకారంలో పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ‘‘కర్ణాటకలో ఎక్కువ ఓటర్లు పాల్గొనే అవకాశం ఉంది. తర్వాత స్థానాల్లో అస్సాం, మహారాష్ట్ర నిలుస్తాయి’’ అని పేర్కొన్నారు.  


రాయ్‌బరేలీలో ఏఐసీసీ పరిశీలకుడిగా భూపేశ్‌ బఘేల్‌
అమేఠీలో అశోక్‌ గహ్లోత్‌కు బాధ్యతలు

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో తమకు కంచుకోటల్లాంటి రాయ్‌బరేలీ, అమేఠీ స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ ముమ్మరంగా కృషిచేస్తోంది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను ఆ నియోజకవర్గాల్లో తమ పార్టీ పరిశీలకులుగా సోమవారం నియమించింది. రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌కు, గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరీలాల్‌ శర్మ బరిలో నిలిచిన అమేఠీలో రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. మరోవైపు- ఈ రెండు స్థానాల్లోనూ ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రా విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు.


గాంధీనగర్‌లో 10 లక్షల మెజార్టీపై భాజపా దృష్టి

గాంధీనగర్‌: గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు మెజార్టీపై భాజపా దృష్టి పెట్టింది. ఆ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బరిలో ఉన్నారు.  కాంగ్రెస్‌ తరఫున గుజరాత్‌ మహిళా కాంగ్రెస్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ సోనాల్‌ పటేల్‌ పోటీలో ఉన్నారు. అయితే ఆమె బలహీనమైన అభ్యర్థి కావడంతో ఈసారి అమిత్‌ షాకు 10లక్షలకు పైగా మెజార్టీని సాధించాలని స్థానిక భాజపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019లో ఆయన 5.5 లక్షల మెజార్టీతో గెలుపొందారు.


మమతది తుచ్ఛ రాజకీయం.. రాజ్‌భవన్‌పై ‘దీదీ’గిరీ చెల్లదు: గవర్నర్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీది తుచ్ఛమైన రాజకీయమని గవర్నర్‌ ఆనందబోస్‌ విమర్శించారు. ఓ ఉద్యోగినిని గవర్నర్‌ లైంగికంగా వేధించినట్లు సీఎం ఎన్నికల ప్రచార సభల్లో ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘‘మమతది నీచ రాజకీయం. విశిష్టమైన గవర్నర్‌ కార్యాలయం- రాజ్‌భవన్‌పై ‘దీదీ’గిరీ చెలాయించాలని చూస్తే సహించేది లేదు. నేను చెప్పదలచున్నది అంతే’’ అని ఆయన అన్నారు.


కంటిపరీక్ష చేయించుకోండి

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ‘సంపద సృష్టించడం’ అనే పదాలు అధికార పార్టీ వారికి ‘సంపదను తిరిగి పంచడం’గా కనిపిస్తున్నాయేమో. మమ్మల్ని విమర్శిస్తున్నవారు తిరిగి మాధ్యమిక పాఠశాలకైనా వెళ్లాలి, లేదా నేత్రవైద్యుడి వద్దకు వెళ్లి ఓసారి కంటిపరీక్ష చేయించుకోవాలి. ఉత్పత్తి, సేవా రంగాలు విస్తరించేలా పారిశ్రామిక, వ్యాపార విధానాలను రూపొందించాలనేది మా ఉద్దేశం. స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని నిరోధించే అన్ని చట్టాలు, నిబంధనల్ని మేం తిరిగి సమీక్షిస్తాం.

 కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ పి.చిదంబరం


విదేశీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది

అబద్ధపు వాగ్దానాలతో ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్‌ కలలు కంటోంది. అవన్నీ కల్లలవుతాయి. అది జూన్‌ 4న తేటతెల్లమవుతుంది. ‘డరో మత్‌’ అని నినదించిన రాహుల్‌గాంధీయే భయపడి మరో సీటు వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్‌ 60 ఏళ్ల ఏలుబడిలో మన దేశ భూభాగం నుంచి వేల ఎకరాలు విదేశీ శక్తులకు ధారాదత్తం అయ్యాయి. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో చూస్తే విదేశీ ప్రమేయం సుస్పష్టంగా కనిపిస్తోంది.

 హిమాచల్‌ప్రదేశ్‌లో పీటీఐతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌


అమితాబ్‌ అంతటి గౌరవం దక్కింది నాకే

సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తర్వాత ఆ స్థాయిలో గౌరవాన్ని, ప్రేమను నేను పొందాను. ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పగలను. రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, దిల్లీ, మణిపుర్‌ సహా దేశంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు.

సినీనటి, మండీ నియోజకవర్గ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌


నా జుట్టును కూడా భాజపా తాకలేదు

అబద్ధాల ప్రచారంతో ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏకంగా అబద్ధాల బ్లూప్రింట్‌నే భాజపా సిద్ధం చేస్తోంది. దేశాన్ని దోచుకోవడానికి భాజపా తరఫున ఇద్దరు జాతీయ స్థాయి నాయకులున్నారు. సందేశ్‌ఖాలీ గురించి భాజపా తప్పుడు ప్రచారం చేస్తోంది. నా ఆఖరి శ్వాస వరకు బెంగాల్‌లోనే ఉంటా.. భాజపా ఎజెండాపై పోరాటం చేస్తుంటా.. నా జుట్టును కూడా భాజపా తాకలేదు. 

పశ్చిమబెంగాల్‌లో సభల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img