icon icon icon
icon icon icon

ఎన్డీయేకు 150 సీట్లైనా రావు

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాలకు 150 సీట్లు కూడా రావడం కష్టమేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు.

Updated : 07 May 2024 06:37 IST

 మేం వచ్చాక 50% మించి రిజర్వేషన్లు: రాహుల్‌

అలీరాజ్‌పుర్‌ (మధ్యప్రదేశ్‌): ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాలకు 150 సీట్లు కూడా రావడం కష్టమేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. భాజపా-ఆరెస్సెస్‌ చేస్తున్న ప్రయత్నాల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఈ ఎన్నికల ఉద్దేశమని అన్నారు. మధ్యప్రదేశ్‌లో రత్లాం-ఝాబువా లోక్‌సభ స్థానం పరిధిలో సోమవారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. రిజర్వేషన్లపై ఉన్న 50% గరిష్ఠ పరిమితిని.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎత్తివేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు. కులగణన ఆవశ్యకతను ఆయన మరోసారి నొక్కిచెబుతూ.. అలాంటి లెక్క తేలినప్పుడు మాత్రమే ప్రజల స్థితిగతులేమిటనేది బహిర్గతమవుతుందని, అది దేశ రాజకీయాల దిశను మారుస్తుందని పేర్కొన్నారు.‘రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు స్పష్టంగా చెప్పారు. అందుకే 400 పైచిలుకు స్థానాలు రావాలనే నినాదాన్ని ఇస్తున్నారు. 400 సంగతి పక్కనపెట్టండి.. వాళ్లకు 150 స్థానాలైనా రావు.  దళితులు, బీసీలకు ప్రయోజనాలు కల్పించింది రాజ్యాంగమే. వీరందరి హక్కుల్ని మోదీ లాక్కొనిపోవాలనుకుంటున్నారు. దానిని మేం అడ్డుకోదలిచాం. మేం వచ్చాక రిజర్వేషన్లను 50% మించి పెంచుతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకే కాకుండా ఇతర వర్గాల్లోని పేదలకూ ప్రయోజనం కలిగేలా మేం పనిచేస్తాం. కులగణనతో పాటు ఆర్థిక గణన కూడా చేస్తాం’ అని రాహుల్‌ చెప్పారు. ఖర్గోన్‌ లోక్‌సభ స్థానం పరిధిలో జరిగిన మరో సభలో ఆయన ప్రసంగిస్తూ.. తాము అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు పెంచడంతో పాటు రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు.

నాలాగే మీరూ సర్వశక్తులూ ధారపోయండి

దిల్లీ: విద్వేష ఎజెండాతో కూడిన సిద్ధాంతంతో భాజపా నుంచి ముప్పు పొంచి ఉందని, దానిని ఎదుర్కొనేందుకు తనలాగే కార్యకర్తలంతా సర్వశక్తులూ ధారపోయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘ఎక్స్‌’ ద్వారా పిలుపునిచ్చారు. ‘ఇవి మామూలు ఎన్నికలు కావు. పార్టీల మధ్య పోరు కాదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నమిది. ఇంటింటికీ వెళ్లి న్యాయ్‌ గ్యారంటీలను వివరించండి. ఈ ఎన్నికల్లో నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. మీరూ సర్వం ధారపోయండి. మీరు లేకుండా పార్టీ విజయం సాధించజాలదు’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img