icon icon icon
icon icon icon

నేడే మూడోవిడత.. 93 స్థానాలకు జరగనున్న పోలింగ్‌

మండుటెండల్లో హోరాహోరీగా సాగుతున్న సార్వత్రిక సమరంలో మరో దశ పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది.

Updated : 07 May 2024 06:57 IST

దిల్లీ, అహ్మదాబాద్‌: మండుటెండల్లో హోరాహోరీగా సాగుతున్న సార్వత్రిక సమరంలో మరో దశ పోలింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. మూడో విడతలో భాగంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారం ఓటింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. 1,300 మందికిపైగా అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు. కేంద్రమంత్రులు అమిత్‌ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్‌ మాండవీయ, పురుషోత్తమ్‌ రూపాలా, ప్రహ్లాద్‌ జోషి, ఎస్‌.పి.సింగ్‌ బఘెల్‌ కూడా తృతీయ విడత బరిలో నిలిచారు. గుజరాత్‌, కర్ణాటక, బిహార్‌, మధ్యప్రదేశ్‌ల్లో మంగళవారం పోలింగ్‌ జరగనున్న అన్ని స్థానాలను 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాయే దక్కించుకుంది. వాటిని నిలబెట్టుకునేందుకు కమలనాథులు తీవ్రంగా కృషిచేస్తున్నారు.

 ఓటేయనున్న మోదీ, షా

ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. సూరత్‌లో ఇప్పటికే భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో, మిగిలిన పాతిక సీట్లకు మూడో దశలో పోలింగ్‌ జరగనుంది. గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని అహ్మదాబాద్‌ నగరంలో మోదీ, అమిత్‌ షా మంగళవారం ఓటు వేయనున్నారు.

ములాయం కుటుంబానికి కీలకం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబానికి ఈ దశ చాలా కీలకం. ఆ కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. మైన్‌పురీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ములాయం మరణం తర్వాత మైన్‌పురీ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఎస్పీ జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్‌ యాదవ్‌ తనయుడు అక్షయ యాదవ్‌ ఫిరోజాబాద్‌ నుంచి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్‌ యాదవ్‌ కుమారుడు ఆదిత్య యాదవ్‌ బదాయూ నుంచి బరిలో నిలిచారు. మరోవైపు- మహారాష్ట్రలో బారామతి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, సిటింగ్‌ ఎంపీ సుప్రియా సూలే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ విడతతో 283 సీట్లలో పోలింగ్‌ పూర్తవనుంది.


కన్నడనాట తుది సమరం

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో తుది విడత సార్వత్రిక సమరానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. గత నెల 26న 14 చోట్ల పోలింగ్‌ ముగిసింది. మిగిలిన 14 సీట్లలో మంగళవారం ఓటింగ్‌ జరగనుంది. దక్షిణ భారత్‌లో కనీసం 50 స్థానాలు గెల్చుకోవాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని అందుకోవాలంటే కర్ణాటకలో సత్తా చాటడం అత్యంత కీలకం. మరోవైపు- రాష్ట్రంలో నిరుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. జాతీయ స్థాయిలోనూ పట్టు బిగించాలని చూస్తోంది. అందులో భాగంగా కన్నడనాట ఈసారి మెజార్టీ సీట్లు దక్కించుకోవడంపై దృష్టిసారించింది. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై వచ్చిన తీవ్రస్థాయి లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్రంలో ఎన్నికల వేడిని ఇటీవల మరింత పెంచిన సంగతి తెలిసిందే.

కర్ణాటకలో పోలింగ్‌ జరగనున్న స్థానాలు: 14
ఓటింగ్‌ జరిగే ప్రాంతాలు: కిత్తూరు కర్ణాటక, కల్యాణ కర్ణాటక, మధ్య కర్ణాటక
నియోజకవర్గాలు: చిక్కోడి, బెళగావి, బాగల్‌కోటె, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్‌, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img