icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (4)

సార్వత్రిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన పోలింగ్‌ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు.

Updated : 08 May 2024 06:38 IST

పోలింగ్‌ డేటాలో వైరుద్ధ్యాలపై ఇండియా కూటమి నేతలకు ఖర్గే లేఖ

దిల్లీ: సార్వత్రిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన పోలింగ్‌ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆ వైరుద్ధ్యాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని అందులో పిలుపునిచ్చారు. ఈసీ పూర్తి స్వతంత్రత, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడటం అత్యావశ్యకమని పేర్కొన్నారు.


మోదీ నియమావళిగా ఈసీ నిబంధనలు: మమత

పురూలియా: భాజపా నేతలకు వ్యతిరేకంగా వచ్చే ఆరోపణలపై ఎన్నికల కమిషన్‌(ఈసీ) కళ్లు మూసుకుంటోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. వారంతా  ఎన్నికల ప్రచారాల్లో విద్వేషప్రసంగాలకు పాల్పడినప్పటికీ ఈ పరిస్థితి నెలకొనడం చూస్తుంటే ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి మోదీ నియమావళిగా మారిపోయినట్లుగా అనిపిస్తోందని విమర్శించారు. పురూలియా ఎన్నికల ర్యాలీలో మంగళవారం ఆమె ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర భాజపా నేతలు తాము మాత్రమే హిందువులుగా భావిస్తున్నారని ఆక్షేపించారు. అలాగే వారు దేశంలోని ఇతర మతాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు.


మైన్‌పురీలో రిగ్గింగ్‌.. అఖిలేశ్‌ ఆరోపణలు

మైన్‌పురీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పురీలో పోలింగ్‌ బూత్‌లను లూటీ చేసేందుకు భాజపా కార్యకర్తలు ప్రయత్నించారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. విపక్ష కార్యకర్తలను పోలీసు స్టేషన్లలో బంధించారనీ పేర్కొన్నారు. కొన్నిచోట్ల రిగ్గింగ్‌ జరిగిందని కూడా ఆయన ఆరోపించడం గమనార్హం.


అజిత్‌ పవార్‌ ఇంటికెళ్లి..  పెద్దమ్మ ఆశీర్వాదం కోరిన సూలే

బారామతి: మహారాష్ట్రలోని బారామతిలో వరుసగా నాలుగో విజయం కోసం బరిలో దిగిన శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే.. మంగళవారం ఓటు వేసిన అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ తన పెద్దమ్మ, అజిత్‌ తల్లి అశతాయీ పవార్‌ ఆశీర్వాదం కోరారు. బారామతిలో సూలే ప్రధాన ప్రత్యర్థి.. అజిత్‌ భార్య సునేత్రా పవార్‌ కావడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img