icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. రామ మందిరానికి ‘బాబ్రీ తాళం’

అయోధ్యలోని రామ మందిరానికి ‘బాబ్రీ తాళం’ వేయకుండా, కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 మళ్లీ తీసుకురాకుండా కాంగ్రెస్‌ పార్టీని అడ్డుకునేందుకే ఎన్‌డీయేకు 400 సీట్లు ఇవ్వాలని తాను కోరుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Updated : 08 May 2024 06:35 IST

షాబానో కేసులా అయోధ్య తీర్పు మారుస్తారు
మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర సభల్లో ప్రధాని మోదీ

ధార్‌, ఖర్గోన్‌, బీడ్‌: గ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌, ఖర్గోన్‌ పట్టణాలతోపాటు మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా సభల్లో మోదీ మాట్లాడారు. 1985 నాటి షాబానో కేసులో తన తండ్రి (నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ) చేసినట్టే రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పును మార్చాలని కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌గాంధీని ఉద్దేశించి) రహస్య సమావేశంలో చర్చించినట్లు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఓ నేత వారి కుట్రను బయటపెట్టారని ప్రధాని ఆరోపించారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలంగా చేసిన ప్రకటనపైనా విరుచుకుపడ్డారు. ‘‘పశువుల దాణా తిన్న అవినీతి కేసులో కోర్టు దోషిగా తేల్చగా, అనారోగ్య కారణాలు చూపి బెయిలుపై ఉన్న విపక్ష నేత ఒకరు రిజర్వేషన్లు మొత్తం ముస్లింలకు కట్టబెట్టాలని చెబుతున్నారు. ఈ నేతను కాంగ్రెస్‌ తన నెత్తిన ఆడిస్తోంది. ఓటుబ్యాంకు అండతో కొన ఊపిరితో ఉన్న ఈ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను పూర్తిగా తుడిచిపెట్టాలని చూస్తున్నాయి. మోదీ బతికున్నంత వరకు కుహనా లౌకికవాదం పేరుతో దేశం గుర్తింపును తుడిచిపెట్టేందుకు చేసే ఎలాంటి ప్రయత్నమైనా అడ్డుకుంటాడు’’ అని చెప్పారు.

‘‘కాంగ్రెస్‌ కా హాత్‌.. పాకిస్థాన్‌ కే సాథ్‌’’

‘‘లోక్‌సభ ఎన్నికల పోలింగు విడతలు పెరుగుతున్నకొద్దీ కాంగ్రెస్‌కు పాక్‌పై ప్రేమ పెరుగుతోంది. భారత సైన్యం ఉగ్రదాడులు చేస్తోందని, పాక్‌ సైన్యం తప్పు లేదని కాంగ్రెస్‌ మాజీ సీఎం ఒకరన్నారు. 26/11 ముంబయి ఉగ్రదాడుల వెనుక పాకిస్థాన్‌ హస్తం లేదని కాంగ్రెస్‌కు చెందిన మరో పెద్ద నేత ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ దాడుల్లో మహారాష్ట్ర ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరేను పాక్‌ ఉగ్రవాది కసబ్‌ చంపలేదని కాంగ్రెస్‌ నేత (విజయ్‌ వడెట్టివార్‌) అన్నారు. ఈ ప్రకటనలు చేస్తున్న ఇండియా కూటమి నేతల ఉద్దేశం ఏమిటని కాంగ్రెస్‌ యువరాజును అడగాలనుకొంటున్నా. 2008లో ముంబయిలోకి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించిన  ఉగ్రవాదులతో కాంగ్రెస్‌కు ఏదో అనుబంధం ఉంది’’ అని మోదీ ఆరోపించారు. అసలు పాక్‌ అంటే విపక్షాలకు ఎందుకింత ప్రేమ, భారత సైన్యం అంటే ఎందుకంత ద్వేషమని ప్రశ్నించారు.‘‘అందుకే ప్రజలు చెబుతున్నారు కాంగ్రెస్‌ కా హాత్‌..’’ అని ప్రధాని మధ్యలో ఆపగా, ‘‘పాకిస్థాన్‌ కే సాథ్‌’’ అని సభికులు పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img