icon icon icon
icon icon icon

మూడో దశలో 64.58% పోలింగ్‌

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికల తృతీయ విడత పోలింగ్‌ మంగళవారం ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే.. అంతటా ఈ ప్రక్రియ ప్రశాంతంగానే జరిగింది.

Published : 08 May 2024 04:56 IST

బెంగాల్‌ మినహా అంతటా ప్రశాంతమే
అస్సాంలో అత్యధికంగా, యూపీలో అత్యల్పంగా ఓటింగ్‌కాంగ్రెస్‌

దిల్లీ, అహ్మదాబాద్‌: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికల తృతీయ విడత పోలింగ్‌ మంగళవారం ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే.. అంతటా ఈ ప్రక్రియ ప్రశాంతంగానే జరిగింది. 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు ఈ దశలో ఓటింగ్‌ నిర్వహించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అన్ని స్థానాల్లో కలిపి 64.58% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. అయితే ఇవి అంచనా గణాంకాలు మాత్రమేనని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నందున ఓటింగ్‌ శాతం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

అస్సాంలో అత్యధికం

మూడో విడతలో అత్యధికంగా అస్సాంలో 81.71% పోలింగ్‌ నమోదైంది. 76.52%తో పశ్చిమ బెంగాల్‌ రెండో స్థానంలో, 75.20%తో గోవా మూడో స్థానంలో నిలిచాయి. అత్యల్పంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం 57.34% మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. బిహార్‌, గుజరాత్‌ల్లోనూ ఓటింగ్‌ 60% కంటే తక్కువే నమోదైంది.

చిన్నారిని ముద్దుచేసి.. అన్నకు నమస్కరించి..

స్వరాష్ట్రం గుజరాత్‌లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని అహ్మదాబాద్‌ నగరంలో ప్రధాని మోదీ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. సోమవారం రాత్రే అహ్మదాబాద్‌ చేరుకున్న ఆయన.. మంగళవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే స్థానిక రాణీప్‌ ప్రాంతంలోని నిశాన్‌ పబ్లిక్‌ స్కూల్‌ వద్ద ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. ఆయన వెంట కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా వచ్చారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఉన్నవారికి అభివాదం చేసిన మోదీ.. పలువురితో కరచాలనం చేశారు. ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఓ తల్లి వెంట వచ్చిన చిన్నారిని ఎత్తుకొని ముద్దుచేశారు. పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించడానికి ముందు తన అన్న సోమాభాయి మోదీకి ప్రధాని తలవంచి నమస్కారం చేశారు. ఓటు వేసి బయటకు వచ్చాక జనానికి అభివాదం చేసి.. సిరాచుక్క ఉన్న వేలిని అందరికీ చూపించారు. ఓ వృద్ధురాలు ఆయనకు రాఖీ కట్టారు. ఇప్పటివరకు  ఎలాంటి హింసకు తావు లేకుండా ఎన్నికలను నిర్వహించినందుకు ఈసీపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. గాంధీనగర్‌ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. షా స్థానిక నారణ్‌పురా ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన ప్రముఖులు

కేంద్రమంత్రులు మాండవీయ, ప్రహ్లాద్‌ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్‌ పవార్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు మూడో విడతలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

రోడ్డు నిర్మించాలన్న తమ డిమాండ్‌ను నెరవేర్చనందుకు నిరసనగా యూపీలోని బదాయూలో ధొరాన్‌పుర్‌ గ్రామస్థులు ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ సమస్యలను అందరి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో.. ఫిరోజాబాద్‌లోని మూడు గ్రామాల్లో (నగ్లా జవహర్‌, నీమ్‌ ఖేరియా, నగ్లా ఉమర్‌) ఒక్కరు కూడా ఓటు వేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img