icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (6)

పంజాబ్‌లోని మరో మూడు లోక్‌సభ స్థానాలకు భాజపా బుధవారం అభ్యర్థులను ప్రకటించింది.

Updated : 09 May 2024 06:31 IST

పంజాబ్‌లో మరో 3 స్థానాలకు భాజపా అభ్యర్థుల ప్రకటన

దిల్లీ/చండీగఢ్‌: పంజాబ్‌లోని మరో మూడు లోక్‌సభ స్థానాలకు భాజపా బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. ఫిరోజ్‌పుర్‌ నుంచి మాజీ మంత్రి రాణా గుర్మీత్‌సింగ్‌ సోధి, ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ నుంచి సుభాష్‌శర్మ, సంగ్రూర్‌ నుంచి అర్వింద్‌ ఖన్నా పోటీ చేస్తారని పార్టీ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలకు 12 స్థానాల్లో భాజపా తన అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది.


ఆప్‌లో చేరిన బీఎస్పీ అభ్యర్థి

చండీగఢ్‌: ఎన్నికల వేళ బీఎస్పీకి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్‌లోని హోశియార్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థి రాకేశ్‌ సోమన్‌ ఆప్‌లో చేరారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సమక్షంలో ఆయన బుధవారం ఆప్‌ కండువా కప్పుకొన్నారు.


ముస్లిం లీగ్‌కు కొత్త రూపంలా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో

ముస్లింలీగ్‌కు కొత్త రూపంలా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో ఉంది. హస్తం పార్టీ మ్యానిఫెస్టో న్యాయ పత్రంలా కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సనాతన ధర్మాలకు అన్యాయ్‌ పత్రంలా ఉంది.అది ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను హరించేలా ఉంది. దేశ ప్రజలు కాంగ్రెస్‌ ఉద్దేశాలను తిరస్కరిస్తారు. భాజపా విద్వేష రాజకీయాలు చేస్తోందన్న కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ముందుగా పచ్చి అబద్ధాలు చెప్పడం మానేసి, నిజాలు మాట్లాడటం నేర్చుకోవాలి.

 గోరఖ్‌పుర్‌లో మీడియాతో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌


రాజ్యాంగాన్ని మార్చే యత్నాలు తిప్పికొడతాం

రాజ్యాంగాన్ని మార్చేయాలని, రిజర్వేషన్ల కోటా లాక్కోవాలని భాజపా చేస్తున్న ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటాం. అధిక ధరలు, నిరుద్యోగం, నల్లధనం నిర్మూలన వంటి విషయాల్లో గత పదేళ్లలో మోదీ.. అబద్ధాలు చెప్పడమే తప్పిస్తే హామీలు నెరవేర్చడం లేదు. దేశ ఆస్తుల్ని ఆయన అమ్మేస్తున్నారు.

 ఝార్ఖండ్‌లోని పలామూలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌


ఓట్ల కోసం హిందూ-ముస్లిం విభజన

ఓట్లు రాబట్టుకునేందుకు హిందువులు, ముస్లింల మధ్య విభజన తెచ్చేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. విద్వేషాన్ని ఎగదోయడం ఆయన స్థాయికి తగదు. ఇది నెహ్రూ భారత్‌ కాదు.. మోదీ భారత్‌. ఆయన్ని ప్రజలు గద్దె దించాలి.

 శ్రీనగర్‌ సభలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా


ఫలితాల తర్వాత ఇండియా కూటమి కనుమరుగు

జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ జైల్లో ఉన్నందువల్ల ఆ పార్టీ ఇక పోటీలో ఉండబోదు. గోవాలో కాంగ్రెస్‌ కంటే ఉత్సాహంగా ఉన్న ఇండియా కూటమిలోని కొన్ని రాష్ట్ర పార్టీలు.. ఫలితాల తర్వాత ఆ పార్టీలోనే విలీనమైపోతాయి.

 పణజీలో మీడియాతో గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img