icon icon icon
icon icon icon

రాహుల్‌ ఇటలీకి పోవాల్సిందే.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీలో ఓడిపోవడం ఖాయం. స్థిరపడడానికి ఆ తర్వాత ఇటలీ వెళ్లాల్సిందే.

Updated : 09 May 2024 06:29 IST

లఖింపుర్‌ ఖేరీ/ కన్నౌజ్‌: ‘‘కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీలో ఓడిపోవడం ఖాయం. స్థిరపడడానికి ఆ తర్వాత ఇటలీ వెళ్లాల్సిందే. ఆయనకు మిగిలింది అదొక్కటే’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. అమేఠీ నుంచి మొదట వయనాడ్‌కు, ఇప్పుడు రాయ్‌బరేలీకి వెళ్లిన ఆయనకు పరాజయం తప్పదన్నారు. బుధవారం యూపీలోని లఖింపుర్‌ ఖేరీ, హర్దోయీ, కన్నౌజ్‌లలో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ‘..వాళ్ల ఓటుబ్యాంకు ఎవరో అందరికీ తెలుసు. విపక్షానికి ఓటుబ్యాంకు భయం ఉందేమో గానీ మాకు లేదు. ఔరంగజేబు నాశనం చేసిన కాశీ విశ్వనాథుని నడవాను కూడా మేం నిర్మించాం. శ్రీరాముడికి సంబంధించిన పనినుంచి పారిపోయేవారికి యూపీ ఎప్పటికీ మద్దతు ఇవ్వదు. సమాజ్‌వాదీ పార్టీ పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించినది. ఆ ఒక్క కుటుంబం నుంచి అయిదుగురు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ల పిల్లలు పెద్దయ్యాక మొత్తం 80 స్థానాల్లోనూ వారే పోటీ చేస్తారు. యాదవ సామాజిక వర్గానికి వారేమీ శ్రేయోభిలాషులు కాదు’ అని ఆయన చెప్పారు.

 వారు నెగ్గితే ప్రధాని ఎవరు?

‘ఈ ఎన్నికల్లో విపక్షాలు గెలిచే అవకాశమే లేదు.  నెగ్గినట్లయితే ప్రధాని ఎవరు? శరద్‌పవార్‌, మమతా బెనర్జీ, స్టాలిన్‌, అఖిలేశ్‌ లేదా రాహుల్‌లలో ఎవరు ఆ పదవి చేపడతారు? ఆ కూటమికి ప్రధాని అభ్యర్థి లేరు. ఒక విధానంలేదు. ఒక కట్టుబాటు లేదు. తొలి మూడు దశల్లో మేం 190 సీట్లు సాధించబోతున్నాం. నాలుగో దశలో మరింత బలపడి 400 స్థానాల దిశగా వెళ్తాం. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతాయి. రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను మేం రద్దుచేసి బీసీలకు ఇస్తాం. ఒక్క పోటుతో పేదరికాన్ని నిర్మూలిస్తానని రాహుల్‌ అంటున్నారు. ఆయన నానమ్మ (ఇందిరాగాంధీ) ఎమర్జెన్సీ విధించారు. ఆయన తండ్రి (రాజీవ్‌గాంధీ) ముమ్మారు తలాక్‌ను తిరిగి అమల్లోకి తెచ్చారు. బీసీల రిజర్వేషన్లను ఆయన పార్టీ (కాంగ్రెస్‌) లాక్కొనిపోయింది. బీసీలంతా దీనిని అర్థం చేసుకోవాలి’ అని అమిత్‌షా చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిని ఈడీ, సీబీఐ పట్టుకుంటాయని, దానిని ఎవరూ ఆపలేరనేది రాహుల్‌, అఖిలేశ్‌లకు తాను చెప్పదలచుకున్నానని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img