icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ నేతల వెనకడుగు!

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాజస్థాన్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల్లో నిస్తేజం ఆవరించింది.

Published : 22 Apr 2024 04:19 IST

రాజస్థాన్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ముఖం చాటేసిన సీనియర్లు
జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ

త ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాజస్థాన్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల్లో నిస్తేజం ఆవరించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఒక్కరూ ఆసక్తి చూపలేదు. అసెంబ్లీ మాజీ స్పీకర్‌ సీపీ జోషి బలవంతంగా భీల్‌వాడా నుంచి బరిలోకి దిగాల్సి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, సీఎం పదవికి పోటీ పడ్డ సచిన్‌ పైలట్‌, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాసరా ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

పట్టు కోల్పోయిన గహ్లోత్‌

1980 నుంచి జోధ్‌పుర్‌లో ఐదు సార్లు ఎంపీగా గెలిచిన అశోక్‌ గహ్లోత్‌ కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత జోధ్‌పుర్‌లో పట్టు కోల్పోయారు. ప్రస్తుతం సర్దార్‌పుర నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. జాట్‌లు, బిష్ణోయ్‌లు, రాజ్‌పూత్‌లు, బ్రాహ్మణులు, ఓస్వాల్‌ జైన్లతోపాటు సొంత సామాజికవర్గానికి చెందిన మాలిల మద్దతునూ గహ్లోత్‌ కోల్పోయారు.

  • 2019లో తన కుమారుడు వైభవ్‌ గహ్లోత్‌ను జోధ్‌పుర్‌ నుంచి అశోక్‌ గహ్లోత్‌ పోటీకి నిలిపారు. అప్పట్లో ఆయన ఓడిపోయారు. ఆయనపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ శెఖావత్‌ 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో జోధ్‌పుర్‌ తనను ఆదరించడంలేదని అశోక్‌ గహ్లోత్‌ అర్థం చేసుకున్నారు. దీంతో పోటీకి నిరాకరించారు.
  • ఈసారి జాలోర్‌-సిరోహీ నుంచి వైభవ్‌ గహ్లోత్‌ పోటీ చేస్తున్నారు. అక్కడ రాజ్‌పూత్‌లు, బిష్ణోయ్‌లు, మాలి, అంజనా చౌధరి, పటేల్‌ సామాజిక వర్గాలతోపాటు గిరిజనులు అధికంగా ఉన్నారు.
  • వైభవ్‌  ప్రత్యర్థి లింబా రామ్‌ అంజనా వర్గానికి చెందినవారు. 2014, 2019లో ఇక్కడి నుంచి భాజపా తరఫున దేవ్‌జీ పటేల్‌ గెలిచారు. గతంలో ఇక్కడి నుంచి బూటా సింగ్‌, బంగారు లక్ష్మణ్‌ విజయం సాధించారు.
  • జాలోర్‌-సిరోహీలో వైభవ్‌ లాంఛన అభ్యర్థే. మొత్తం భారమంతా అశోక్‌ గహ్లోత్‌పైనే ఉంది. ఆయనకే ఇది ప్రతిష్ఠాత్మకం. తొలి విడతలో పోలింగ్‌ జరిగిన నియోజకవర్గాల్లో అశోక్‌ గహ్లోత్‌ ప్రచారం నిర్వహించారు. అయితే గెలిచే అవకాశముందనుకున్న వాటికే ఆయన వెళ్లారు.
  • తన కుమారుడికి మద్దతు ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే జాలోర్‌ ప్రజలను అశోక్‌ అభ్యర్థిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తానని వైభవ్‌ హామీ ఇస్తున్నారు.
  • జాలోర్‌లో వైభవ్‌కు పెద్దగా మద్దతు లభించడం లేదు. ఈసారి ఆయన ఓడిపోతే రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే. మరోవైపు లింబా రామ్‌ స్థానికుడిగా మంచి పట్టు కలిగి ఉన్నారు. దీంతో అద్భుతం జరగాలని అశోక్‌ గహ్లోత్‌ కోరుకుంటున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img