icon icon icon
icon icon icon

ఓటింగ్‌ వేళ ఈవీఎంలు మొరాయిస్తే..?

ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) వినియోగంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. ఓటు వేసే క్రమంలో ఒకవేళ పొరపాటున ఈవీఎంలో తప్పు బటన్‌ను నొక్కితే ఏమవుతుంది? ఓటింగ్‌ జరుగుతుండగా అకస్మాత్తుగా ఈవీఎం పనిచేయడం ఆగిపోతే ఎలా? అనే ప్రశ్నలు ఉదయిస్తుంటాయి.

Published : 22 Apr 2024 04:20 IST

ఈటీవీ భారత్‌

ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) వినియోగంపై చాలామందికి సందేహాలు ఉంటాయి. ఓటు వేసే క్రమంలో ఒకవేళ పొరపాటున ఈవీఎంలో తప్పు బటన్‌ను నొక్కితే ఏమవుతుంది? ఓటింగ్‌ జరుగుతుండగా అకస్మాత్తుగా ఈవీఎం పనిచేయడం ఆగిపోతే ఎలా? అనే ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. వాటికి సమాధానాలివే.

విద్యుత్‌ అక్కర్లేదు

ఈవీఎంలో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగాన్ని బ్యాలెట్‌ యూనిట్‌ (బీయూ) అంటారు. మరో భాగాన్ని కంట్రోల్‌ యూనిట్‌ (సీయూ) అని పిలుస్తారు. బీయూలో మనం ఓటును నమోదు చేస్తాం. దీన్ని ప్రత్యేకమైన ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌ లోపల ఉంచుతారు. అందులోకి వెళ్లి మనం రహస్యంగా ఓటు వేయొచ్చు. సీయూ అనేది ప్రిసైడింగ్‌ అధికారి లేదా పోలింగ్‌ అధికారి దగ్గర ఉంటుంది. అయిదు మీటర్ల కేబుల్‌తో బీయూ, సీయూ అనుసంధానమై ఉంటాయి. ఎంతమంది ఓటు వేశారు అనే సమాచారం సీయూలో ఎప్పటికప్పుడు కనిపిస్తుంది. వీటికి అదనంగా ‘ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీప్యాట్‌)’ యంత్రం కూడా అక్కడే ఉంటుంది. మనం ఈవీఎంలో ఓటు వేయగానే వీవీ ప్యాట్‌లో నుంచి ఒక స్లిప్‌ బయటికి వచ్చి అక్కడే కింద అమర్చిన బాక్సులో పడిపోతుంది. ఈవీఎంలు పనిచేయడానికి కరెంటు అవసరం లేదు. అవి బ్యాటరీ సాయంతో పనిచేస్తాయి. అందువల్ల విద్యుత్‌ కనెక్షన్లు లేని ప్రాంతాల్లో కూడా ఈవీఎంలను వినియోగించుకోవచ్చు.

తప్పు బటన్‌ నొక్కితే..

ఈవీఎంపై రాజకీయ పార్టీ/అభ్యర్థికి సంబంధించిన గుర్తు వద్ద ఉండే బటన్‌ను నొక్కగానే ఎరుపు రంగు సిగ్నల్‌ వస్తుంది. వెంటనే బీప్‌ సౌండ్‌ వినిపిస్తుంది. వీవీప్యాట్‌ నుంచి స్లిప్‌ రిలీజవుతుంది. ఓటు నమోదైందని చెప్పేందుకు ఇవన్నీ ధ్రువీకరణలు. ఒకవేళ మనం పొరపాటున ఈవీఎంపై తప్పు బటన్‌ను నొక్కి ఓటు నమోదు కాకపోతే మరోసారి ఓటు వేయడం అంత సులువు కాదు. దానికోసం అక్కడున్న పోలింగ్‌ అధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. పోలింగ్‌ అధికారి వెంటనే వచ్చి ఈవీఎంలో ఉండే ఒక బటన్‌ను నొక్కితేనే మరోసారి ఫ్రెష్‌గా ఓటు వేసేందుకు అవకాశం కలుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమాలు-1961లోని రూల్‌ నంబర్‌ 49ఎంఏ ప్రకారం ఇటువంటి పరిస్థితుల్లో ఓటరు నుంచి రాతపూర్వక ప్రకటనను ప్రిసైడింగ్‌ అధికారి కోరే అవకాశం ఉంటుంది. ఓటరు చేస్తున్న క్లెయిమ్‌ నిజమైనదని రుజువయితేనే రిటర్నింగ్‌ అధికారి అనుమతి తీసుకొని మరోసారి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఈ క్రమంలో రిటర్నింగ్‌ అధికారి అనుమతి వచ్చే వరకు ఆ ఈవీఎంలో పోలింగ్‌ను నిలిపివేస్తారు.


అకస్మాత్తుగా పనిచేయకపోతే..

టింగ్‌ జరుగుతుండగా అకస్మాత్తుగా ఈవీఎం మొరాయిస్తే కంగారుపడాల్సిన అవసరం లేదు. అప్పటివరకు నమోదైన ఓట్లన్నీ కంట్రోల్‌ యూనిట్‌లోని మెమొరీలో సేవ్‌ అయి ఉంటాయి. ఒకవేళ ఆ సమాచారం కూడా దొరకని పరిస్థితి ఎదురైతే వీవీప్యాట్‌ స్లిప్పులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. పోలింగ్‌ స్టేషనులో బీయూ, సీయూల్లో ఏ ఒక్కటి మొరాయించినా వెంటనే కొత్తగా బీయూ, సీయూ, వీవీప్యాట్‌ల సెట్‌ను అక్కడికి పంపిస్తారు. జోనల్‌ మేజిస్ట్రేట్లు, ఏరియా మేజిస్ట్రేట్ల పరిధిలో రిజర్వులో ఉండే ఎన్నికల సామగ్రి నుంచి వీటిని కేటాయిస్తారు. వీవీప్యాట్‌ యంత్రం ఒక్కటే మొరాయిస్తే దాని స్థానంలో మరో కొత్త వీవీప్యాట్‌ యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో- అన్ని ఈవీఎంలలో నమోదైన ఓట్లను కౌంటింగ్‌ రోజున లెక్కిస్తారు. ఏదైనా సాంకేతిక కారణంతో సీయూలోని ఓట్లు డిస్‌ప్లే కాకపోతే.. దాని వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img