icon icon icon
icon icon icon

పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగం ఎలా?

ఎన్నికల విధులు నిర్వర్తించే పోలింగ్‌ అధికారులు, పోలీసులు, వీడియోగ్రాఫర్లు తదితరులు పోస్టల్‌ బ్యాలట్‌ను ఎక్కడ, ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం శుక్రవారం అందుకు విధి, విధానాలను విడుదల చేసింది.

Published : 27 Apr 2024 05:32 IST

విధి, విధానాలను విడుదల చేసిన సీఈఓ కార్యాలయం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల విధులు నిర్వర్తించే పోలింగ్‌ అధికారులు, పోలీసులు, వీడియోగ్రాఫర్లు తదితరులు పోస్టల్‌ బ్యాలట్‌ను ఎక్కడ, ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం శుక్రవారం అందుకు విధి, విధానాలను విడుదల చేసింది.


అర్హులు:

  • ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు.
  • ఓటరు జాబితాలో సర్వీస్‌ ఓటరుగా నమోదైన వివిధ సైనిక దళాల సిబ్బంది.
  • 40% అంగవైకల్యం కలిగినవారు.
  • 85 ఏళ్లు దాటిని వయోవృద్ధులు.
  • ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారు.
  • అత్యవసర సేవల సిబ్బంది (రైల్వే, ఆర్టీసీ, ఫైర్‌, వైద్యం మొదలైనవారు).

ఓటేసే ప్రదేశం: (ఏ ఓటరు ఎక్కడ ఓటు వేయాలి)

సర్వీసు ఓటర్లు: ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ పోస్టల్‌ బ్యాలట్‌ విధానం ద్వారా ఓటు వేయవచ్చు.

ఎన్నికల సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది: రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) నిర్దేశించిన తేదీల్లో ఏర్పాటు చేసిన ఓటర్ల ఫెసిలిటేషన్‌ సెంటర్లలో వినియోగించుకోవచ్చు.
దివ్యాంగులు, వయోవృద్ధులు, కొవిడ్‌ బాధితులు: ఆర్వో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బృందం సహకారంతో ఓటరు ఇంటి వద్దే ఓటు వినియోగించుకోవచ్చు.

విధానం: ఓటు ఉన్న పోలింగ్‌ స్టేషన్‌ (బూత్‌) నంబర్‌ ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్లు క్రమ సంఖ్య తెలుసుకోవాలి. ఓటర్‌ కార్డు, ఇతర గుర్తింపు కార్డుతో ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటు వేయవచ్చు.


ప్రతి ఓటరుకూ పోస్టల్‌ బ్యాలట్‌ పేపర్‌తో పాటు:

  • ఫాం 13ఎ డిక్లరేషన్‌
  • ఫాం 13బి లోపలి కవర్‌-ఎ (చిన్నది)
  • ఫాం 13సీ వెలుపలి కవర్‌-బి (పెద్దది)
  • ఫాం 13డి ఓటరుకు సూచనలతో కూడిన ఫాంలను ఇస్తారు.
  • శాసనసభ బ్యాలట్‌ పత్రం ‘గులాబి’, లోక్‌సభ బ్యాలట్‌ పత్రం ‘తెలుపు’ రంగులో ఉంటాయి.
  • బ్యాలట్‌ పత్రం మీద ఓటును ‘క్రాస్‌’ లేదా ‘టిక్‌’ రూపంలో నమోదు చేయాలి. దానిపై ఎలాంటి సంతకం, ఓటరు గుర్తింపు తెలిపే గుర్తులు రాయకూడదు.
  • ‘ఫాం 13ఎ డిక్లరేషన్‌’ ఫాంలో బ్యాలట్‌ పత్రం క్రమ సంఖ్య తప్పనిసరి రాసి, ఓటరు సంతకం చేయాలి.
  • ఓటరు గుర్తింపు, ‘ఫాం 13ఎ’లో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ దగ్గర ఉన్న గెజిటెడ్‌ అధికారి తప్పనిసరిగా ధ్రువీకరించాలి.
  • ఓటు నమోదు చేసిన బ్యాలట్‌ పత్రాన్ని ఫాం 13బి (లోపలి కవర్‌-ఎ)లో పెట్టి సీల్‌ చేయాలి. లోపలి కవర్‌పై నియోజకవర్గ ఆర్వో చిరునామా, పోస్టల్‌ బ్యాలట్‌ క్రమ సంఖ్య రాయాలి.
  • బ్యాలట్‌ పత్రాన్ని సీల్‌ చేసి పెట్టిన ‘లోపలి కవర్‌-ఎ’, ‘13ఎ డిక్లరేషన్‌’ ఫాంను విడివిడిగా ‘ఫాం 13సి(వెలుపలి కవర్‌-బి)’లో పెట్టి సీల్‌ చేసి, సంతకం చేయాలి.
  • అక్కడ ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలి.
  • ఓట్ల లెక్కింపు సమయంలో వెలుపలి ‘కవర్‌-బి’ని తెరవగానే.. అందులో ‘కవర్‌-ఎ’, ‘13ఎ-ఓటరు డిక్లరేషన్‌’ విడివిడిగా లేకుంటే ఆ బ్యాలట్‌ పత్రంలోని ‘లోపలి కవర్‌-ఎ’ని పరిగణనలోకి తీసుకోరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img