icon icon icon
icon icon icon

ఇదీ ఏకగ్రీవం కథ!

సాధారణంగా ఏకగ్రీవ ఎన్నికలంటే ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధులు ఎన్నుకునే సమయంలో జరుగుతుంటాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఇవి బహు అరుదు.

Published : 29 Apr 2024 04:05 IST

పోటీలో ఒకరే ఉంటే ప్రకటించే అధికారం ఆర్వోదే
సూరత్‌లో ముకేశ్‌ దలాల్‌ ఎన్నిక

సాధారణంగా ఏకగ్రీవ ఎన్నికలంటే ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధులు ఎన్నుకునే సమయంలో జరుగుతుంటాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఇవి బహు అరుదు. ఎవరైనా ప్రజాప్రతినిధి ఉగ్రదాడుల్లో మరణిస్తే వారి గౌరవార్థం కుటుంబ సభ్యులు పోటీ చేస్తే మిగిలిన పార్టీలు పోటీ చేయకుండా సహకరిస్తుంటాయి. కానీ ఈసారి అనూహ్యంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం, స్వతంత్రులతో నామినేషన్లను ఉపసంహరింపజేయడంతో సూరత్‌లో ఎన్నిక ఏకగ్రీవమైంది. దాదాపు 20లక్షల మంది ప్రజలు ఓటు వేయాల్సిన ఎన్నిక ఏకగ్రీవం కావడం ఆమోదనీయమేనా? ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అసలు ఏముంది? సూరత్‌ విషయంలో ఏం జరిగింది?

సెక్షన్‌ 53(3) ఏం చెబుతోంది?

సూరత్‌ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన భాజపా నేత ముకేశ్‌ దలాల్‌కు రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) ఏప్రిల్‌ 22వ తేదీన ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఒకే అభ్యర్థి ఉంటే పోలింగ్‌ జరగకుండానే ఎన్నికైనట్లుగా ప్రకటించే అధికారం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 53(3) ప్రకారం.. రిటర్నింగ్‌ అధికారికి ఉంటుంది. నామినేషన్‌ పత్రాలను సమర్పించాక అవి సక్రమంగా ఉన్నాయని ఆర్వో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాలోని పేర్లతో ఆయన సరి చూసుకుంటారు. ప్రతిపాదకుల వివరాలపైనా ఆర్వో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి విషయంలో నామినేషన్‌ పత్రాలు సక్రమంగా లేవని జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. ప్రతిపాదకులు తాము సంతకం చేయలేదని చెప్పడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈసీ కరదీపికలో ఏముంది?

రిటర్నింగ్‌ అధికారులకు ఎన్నికల సంఘం (ఈసీ) 2023 ఆగస్టులో ఒక కరదీపికను అందజేసింది. ఇందులో పోటీ లేని ఎన్నికపై వివరణ ఉంది. ‘ఏదైనా నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి పోటీలో ఉంటే నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వెంటనే ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాలి. ఇలాంటి సందర్భాల్లో పోలింగ్‌ జరపాల్సిన అవసరం లేదు. ఏకగీవ్రంగా ఎన్నికైన అభ్యర్థి నిర్ణీత సమయంలోగా నేర చరిత్రను వెల్లడించాలి’ అని అందులో ఉంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img