icon icon icon
icon icon icon

మిశ్రమ ఫలితాల మిథిల!

బిహార్‌ మిథిలాంచల్‌ ప్రాంతంలోని 5 నియోజకవర్గాల్లో మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ 54 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

Updated : 29 Apr 2024 05:11 IST

బిహార్‌లోని నదీ పరివాహక ప్రాంతంలో సామాజిక సమీకరణాలే ముఖ్యం
మూడో విడతలో భాగంగా 7న 5 నియోజకవర్గాల్లో పోలింగ్‌  
ఈనాడు ప్రత్యేక విభాగం

బిహార్‌ మిథిలాంచల్‌ ప్రాంతంలోని 5 నియోజకవర్గాల్లో మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ 54 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఎన్నికలు ఝంఝార్‌పుర్‌, సుపౌల్‌, అరరియా, మధేపురా, ఖగడియాలలో జరగనున్నాయి. ఈ ప్రాంతంలో జేడీయూ, ఆర్జేడీ, లోక్‌ జన్‌శక్తి పార్టీలకు పట్టుంది. ఒకసారి ఎన్డీయే కూటమి, మరోసారి ఆర్జేడీ కూటమి గెలుస్తూ వస్తున్నాయి.

వరదలతో సతమతం

నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండటంతో ఝంఝార్‌పుర్‌, ఖగడియా నియోజకవర్గాలు ఎల్లప్పుడూ వరదలతో సతమతమవుతుంటాయి. గంగ, గండక్‌, బాగమతి, కమలా, బాలన్‌, కోసి నదులు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. నేపాల్‌ సరిహద్దు కూడా ఉంది.  

సోషలిజం ప్రయోగశాల ఝంఝార్‌పుర్‌

మైథిలీగా పిలుచుకునే ఝంఝార్‌పుర్‌ ఏటా వరద ప్రమాదాలకు గురవుతూ ఉంటుంది. సోషలిజం ప్రయోగశాలగా ఈ నియోజకవర్గం నిలుస్తూ వస్తోంది. గతంలో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్ర ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జేడీయూ నేత రాంప్రీత్‌ మండల్‌ ఎన్నికయ్యారు. సిటింగ్‌ ఎంపీ స్థానికంగా కొంత అభివృద్ధి చేశారు. ఇక్కడి ప్రజలు వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మూసివేసిన చక్కెర కర్మాగారాలను తెరిపించాలనే డిమాండూ ఉంది. ఈ నియోజకవర్గంలో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలవారే ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక్కడ ముక్కోణ పోటీ నెలకొంది. జేడీయూ (ఎన్డీఏ) నుంచి రాంప్రీత్‌ మండల్‌, ఇండియా కూటమిలోని వికాశ్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) నుంచి సుమన్‌ కుమార్‌ మహాసేత్‌ పోటీ చేస్తున్నారు. వీరిద్దరినీ ఆర్జేడీ రెబల్‌ నేత, బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న గులాబ్‌ యాదవ్‌ సవాలు చేస్తున్నారు. గులాబ్‌ను ప్రధాన అభ్యర్థులు సీరియస్‌గా తీసుకోకున్నా ఆయన ఆశ్చర్యకర స్థాయిలో ఓట్లను సాధించే అవకాశముంది. గులాబ్‌ యాదవ్‌ సతీమణి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కుమార్తె జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా గెలిచారు. ఇక్కడ ఎస్సీలు 13.5 శాతం, ముస్లింలు 13.9 శాతం, బ్రాహ్మణులు 20 శాతం ఉన్నారు. యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ కోటీశ్వరులే.


మైనారిటీల అరరియా

కప్పటి కాంగ్రెస్‌ కంచుకోట అయిన సీమాంచల్‌లోని అరరియాలో ఆ తర్వాతి కాలంలో జనతాదళ్‌, భాజపా గెలిచాయి. ఆర్జేడీ రెండు సార్లు విజయం సాధించింది. 13 లక్షలకుపైగా ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉంటారు. 2019లో ఇక్కడ భాజపా గెలిచింది. 2014లో ఆర్జేడీ విజయం సాధించింది. అప్పుడు భాజపా, జేడీయూ విడివిడిగా పోటీ చేశాయి. ఈసారి ఆర్జేడీ కూటమికి ఇక్కడ విజయం సాధించడం కొంత కష్టంగానే ఉంది. మళ్లీ గెలిచేందుకు భాజపా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ నియోజకవర్గంలో 42.9 శాతం ముస్లింలు, 56.6శాతం హిందువులు ఉన్నారు. ముస్లింల ఓట్లు గంపగుత్తగా పడినా హిందువుల ఓట్లు కూడా వస్తేనే ఆర్జేడీ గెలిచేందుకు అవకాశముంటుంది. హిందువుల్లో యాదవులు, మండల్‌ల ఓట్లు అధికంగా ఉంటాయి. ఇంకా కుర్మీలు, కోయిరీలు, బ్రాహ్మణులు, భూమిహార్లు, రాజ్‌పూత్‌లు, కాయస్థలు ఉన్నారు. ఈసారి అరరియాలో భాజపా తరఫున ప్రదీప్‌ కుమార్‌, ఆర్జేడీ తరఫున మహమ్మద్‌ షానవాజ్‌ ఆలం పోటీ చేస్తున్నారు.


యాదవ్‌ల మధేపుర

వీఐపీ నియోజకవర్గమైన మధేపురలో గత ఎన్నికల్లో జేడీయూ నేత దినేశ్‌ చంద్ర యాదవ్‌ గెలిచారు. అప్పట్లో ఆర్జేడీ నుంచి పోటీ చేసిన శరద్‌ యాదవ్‌ ఓడిపోయారు. 2014లో ఇక్కడి నుంచి ఆర్జేడీ గెలిచింది. రోమ్‌ పోప్‌దైతే మధేపుర యాదవులది అనే నినాదం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. యాదవులే ఇక్కడి ఫలితాన్ని నిర్ణయిస్తుంటారు. ఇక్కడి నుంచి గెలిచిన వారిలో ఒక్క బీపీ మండల్‌ మినహా అందరూ యాదవ్‌ సామాజికవర్గానికి చెందినవారే. ఇది ఆర్జేడీకి కంచుకోట. లాలూ ప్రసాద్‌ ఇక్కడి నుంచే గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. శరద్‌ యాదవ్‌ నాలుగు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. యాదవ్‌ల తర్వాత ఇక్కడ అధికంగా ముస్లింలు, బ్రాహ్మణులు, రాజ్‌పూత్‌లు ఉన్నారు. యాదవ్‌లు, ముస్లింల ఓట్లతో ఇక్కడ మరోసారి గెలవాలని ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. మోదీ ప్రభావంతో ఎన్డీయే జెండా ఎగురవేయాలని జేడీయూ చూస్తోంది. 4 లక్షలకుపైగా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓట్లతో జేడీయూ గతంలో ఇక్కడ గెలవగలిగింది. ఇక్కడ జేడీయూ నుంచి దినేశ్‌ చంద్ర యాదవ్‌, ఆర్జేడీ నుంచి కుమార్‌ చంద్రదీప్‌ తలపడుతున్నారు. ద్విముఖ పోటీ నెలకొంది.


వరదల ఖగడియా

రదలతో సతమతమయ్యే మరో నియోజకవర్గం ఖగడియా. ముంగేర్‌ డివిజన్‌లోని ఈ ప్రాంతం గంగ, గండక్‌, బాగమతి, కమలా, కోసీ నదుల వల్ల వరదలకు గురవుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో కొండ ప్రాంతాలు లేవు. వరదలవల్ల ఇక్కడ ఖరీఫ్‌ పంటలు సాగుకావు. రబీలో గోధుమ సాగవుతుంది. 2019లో ఇక్కడి నుంచి లోక్‌ జన్‌శక్తి పార్టీ అభ్యర్థి చౌధరి మెహబూబ్‌ అలీ కౌజర్‌ గెలిచారు. వికాశ్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఇదీ యాదవుల ప్రాబల్యమున్న నియోజకవర్గమే. ఇక్కడ యాదవులు 3.5 లక్షలు, ముస్లింలు  1.5 లక్షలు, నిషద్‌లు   1.5 లక్షలు, కుర్మీలు,  కుశ్వాహాలు 2.5 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ ఎన్డీయే తరఫున ఎల్జేపీ (రాం విలాస్‌ పాస్వాన్‌) నుంచి రాజేశ్‌ వర్మ, ఇండియా కూటమి తరఫున సీపీఎం నుంచి సంజయ్‌ కుమార్‌ కుశ్వాహా పోటీ చేస్తున్నారు. యాదవులు, ముస్లింలే ఇక్కడ ఫలిత నిర్ణేతలు.


రెండోసారి అవకాశమివ్వని సుపౌల్‌

నేపాల్‌ సరిహద్దులోని సుపౌల్‌లో ఆర్జేడీ నుంచి చంద్రహాస్‌ చౌపాల్‌, జేడీయూ నుంచి దిలేశ్వర్‌ కమాయిత్‌ బరిలో ఉన్నారు. డీలిమిటేషన్‌ అనంతరం 2008లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో 2009 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గానికి ఒకవైపు సీమాంచల్‌ ఉంటుంది. ఇక్కడ వరుసగా రెండోసారి ఎవరూ గెలవలేదు. అభివృద్ధి కంటే కులమే ఇక్కడ ప్రాధాన్యాంశం. వెనుకబడిన, యాదవ్‌ వర్గాలవారి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఇక్కడ ఒకే పార్టీ కంటే బహుళ పార్టీలకు ప్రజలు మద్దతుగా నిలుస్తారు. గత ఎన్నికల్లో జేడీయూ గెలిచింది. ఈసారి ఎన్నికల్లో రెండోసారి జేడీయూ అభ్యర్థిని గెలిపించి సంప్రదాయాన్ని బ్రేక్‌ చేస్తారా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

పోటీలో ఉన్న అభ్యర్థులు

  • ఝంఝార్‌పుర్‌: 10
  • సుపౌల్‌: 15
  • అరరియా: 9
  • మధేపురా: 8
  • ఖగడియా: 12
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img