icon icon icon
icon icon icon

పది స్థానాలపై పట్టు బిగించేలా!

రాష్ట్రంలోని పది లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు, సికింద్రాబాద్‌ కంట్మోనెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నేతలను ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది.

Updated : 01 May 2024 06:15 IST

కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక కసరత్తు
పరిశీలకులుగా ఇతర రాష్ట్రాల నేతలకు బాధ్యతలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పది లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు, సికింద్రాబాద్‌ కంట్మోనెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నేతలను ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం ఆదేశాలు జారీచేశారు.

బోసురాజుకు నిజామాబాద్‌, షఫీ పరంబిల్‌కు ఆదిలాబాద్‌

ఇప్పటికే పోలింగ్‌ పూర్తయిన కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలను అధిష్ఠానం పరిశీలకులుగా రంగంలోకి దించింది. కేరళకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే షఫీ పరంబిల్‌కు ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. కర్ణాటక మంత్రి బోసురాజుతో పాటు అదే రాష్ట్రానికి చెందిన మంతర్‌ గౌడను నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి, కేరళ రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఏడుసార్లు ఎంపీగా నెగ్గిన కోడికున్నిల్‌ సురేశ్‌ను మెదక్‌ స్థానానికి పరిశీలకులుగా పంపింది. పరిశీలకుల నియామకం జరిగిన  నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ కచ్చితంగా గెలిచే అవకాశాలున్న స్థానాలతో పాటు, గట్టి పోటీని ఎదుర్కొంటున్నవీ ఉన్నాయి. ‘ప్రత్యర్థి పార్టీలైన భాజపా, భారాసలకు దీటుగా ప్రచారం నిర్వహించడంతోపాటు ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే వ్యూహాల అమలును పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ప్రధానంగా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఉన్న ఆదిలాబాద్‌, మెదక్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ తదితర స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసేలా పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను, కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నవారిని ఒకే తాటిపైకి తేవడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారని’ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో పక్క రాష్ట్రాలకు చెందిన ప్రజలను ఆకట్టుకునేలా ప్రచారం నిర్వహించే  ప్రణాళికలను వీరు అమలుచేస్తారని వివరించారు.

అనుభవానికి పెద్దపీట

బోసురాజు గతంలో తెలంగాణకు ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ ఎలా ఉందనే అంశంలో మంచి అనుభవముంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచార వ్యూహాల అమలును పర్యవేక్షించిందీ ఈయనే. అలాగే కోడికున్నిల్‌ సురేశ్‌కు కేరళతోపాటు జాతీయ రాజకీయాల్లో అపార అనుభవముంది. గతంలో కేంద్ర మంత్రిగా, లోక్‌సభలో కాంగ్రెస్‌ చీఫ్‌విప్‌గా పనిచేశారు. మెదక్‌లో భాజపా, భారాస వ్యూహాలను తిప్పికొట్టి..పార్టీ అభ్యర్థిని గెలుపు దిశగా నడిపించే సత్తా ఉందనే భావనతో అయన్ను ఇక్కడ నియమించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img