icon icon icon
icon icon icon

ప్రచారం వాడీ…వేడిగా

‘నాలుగు గడపలు తిరిగి.. రెండు కూడళ్లలో సమావేశాలు పూర్తి చేయగానే గొంతెండిపోతోంది. నెత్తి చెమటలు పడుతోంది.

Published : 04 May 2024 06:15 IST

 సభలు, ర్యాలీల్లో ‘చెమటోడుస్తున్న’ అభ్యర్థులు
ఎండలకు రాలేమంటున్న పార్టీల కార్యకర్తలు
ఈనాడు - హైదరాబాద్‌

‘నాలుగు గడపలు తిరిగి.. రెండు కూడళ్లలో సమావేశాలు పూర్తి చేయగానే గొంతెండిపోతోంది. నెత్తి చెమటలు పడుతోంది. ఇదేందిరా భయ్‌.. ఎన్నికల్లో గెలుపేమో కానీ, ఈ ఎండలకు తట్టుకునేటట్లు లేం..’ అంటూ కొందరు అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత తారస్థాయికి చేరడంతో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులు ప్రచార షెడ్యూల్‌ పూర్తి చేయలేకపోతున్నారు. ‘ఉదయం 10 గంటల తరువాత మేం రాలేం..’ అంటూ పార్టీల శ్రేణులు సైతం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. పొద్దున, సాయంత్రం తప్ప ఎండకు రామంటూ తెగేసి చెబుతున్నారు. రూ.500 చొప్పున ఇచ్చి జనాన్ని తీసుకొచ్చినా.. ‘నడినెత్తికి సూరీడు వచ్చాక నీడపట్టు నుంచి కదలం’ అంటున్నారని పలు పార్టీల క్యాంపెయిన్‌ నిర్వాహకులు నిట్టూరుస్తున్నారు. ప్రచారంలో ప్రత్యర్థుల కన్నా ఒకడుగు ముందే ఉండేందుకు అభ్యర్థులు తమదైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నా.. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను తాకుతుండటంతో వారి ఎత్తులు చిత్తవుతున్నాయి.

వాతావరణ సూచనలపై ఆరా..

రాష్ట్రంలో ఎండల తీవ్రతతోపాటు వడగాలులు, ఆకస్మిక వర్షాలు కొనసాగుతుండటంతో అభ్యర్థులు వాతావరణ సూచనలు పాటిస్తున్నారు. ‘రేపటి వాతావరణం గురించి కనుక్కో.. దూరం వెళ్దామా.. దగ్గరలోనే తిరిగొద్దామా అనేది నిర్ణయించుకుందాం’ అంటూ వ్యక్తిగత సిబ్బందిని రోజూ ఆరా తీస్తున్నారు. చాలాచోట్ల సాయంత్రం 4 గంటల తరువాతే ప్రచారం ఉద్ధృతమవుతోంది. అవసరమైతే రాత్రి 10 గంటల వరకు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తెల్లవారుజామునే గ్రామాలకు చేరుకొని సమావేశాలు పెడుతున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్గొండ, భువనగిరి, కరీంనగర్‌ నియోజకవర్గాల పరిధిలో కీలక నాయకులు సాయంత్రం తరువాతే ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. చల్లటి మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లు అభ్యర్థుల ప్రచార కాన్వాయ్‌లో తప్పనిసరయ్యాయి.

పెరిగిన వాహనాల సంఖ్య..

ఎండల తీవ్రతతో పార్టీలకు ప్రచార దళాలను తరలించడం ఆర్థికంగా భారమవుతోంది. ఉదయాన్నే కార్యకర్తలను తీసుకుని రావడం, మధ్యాహ్నం ఊర్లలో ఇంటి వద్ద దించేయడం, సాయంత్రం మళ్లీ తీసుకొచ్చి పంపించడానికి వాహనాల ఖర్చు తడిసి మోపెడవుతోందని పలువురు నాయకులు వాపోతున్నారు. దీంతో అభ్యర్థులు కిలోమీటర్ల మేర పాదయాత్రలు చేయకుండా ఎక్కడికక్కడే ప్రచారం చేయాల్సి వస్తోందని క్యాంపెయిన్‌ నిర్వాహకులు(రూట్‌ ప్లానర్లు) పేర్కొంటున్నారు. అలాగే భానుడి ప్రతాపంతో అభ్యర్థులు కొందరు మధుమేహం, అధిక రక్తపోటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రచారంలో ఎక్కువసేపు పాల్గొనలేకపోతున్నారు. మా నాయకుడు గంట ప్రచారం చేస్తే మరో గంటపాటు ఏసీ వాహనంలో కూర్చుని సేదదీరాల్సి వస్తోందంటూ ఓ పార్టీ నేత ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img