icon icon icon
icon icon icon

కులం చూసి.. టికెట్‌ కేటాయింపు!

అభ్యర్థుల ఎంపికలో తాము వారి కులాలకు ప్రాధాన్యమివ్వలేదనేది రాజకీయ పార్టీలు తరచూ చెప్పే మాట! కానీ అందులో వాస్తవం లేదంటున్నారు విశ్లేషకులు.

Updated : 04 May 2024 06:47 IST

గుజరాత్‌లో అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికీ అదే కీలకాంశం

అహ్మదాబాద్‌: అభ్యర్థుల ఎంపికలో తాము వారి కులాలకు ప్రాధాన్యమివ్వలేదనేది రాజకీయ పార్టీలు తరచూ చెప్పే మాట! కానీ అందులో వాస్తవం లేదంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా గుజరాత్‌లో టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెబుతున్నారు. నగరీకరణ ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కులపరమైన గుర్తింపునకు ప్రాధాన్యం తగ్గినా ఇప్పటికీ ఈ పరిస్థితి ఉండటం కొంత ఆందోళనకరమని పేర్కొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో అధిక పట్టింపు

ప్రధానంగా గ్రామీణ గుజరాత్‌లోని స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో పార్టీలు కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్థితులు ఉన్నాయని భావ్‌నగర్‌ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి, సామాజిక శాస్త్రవేత్త విద్యుత్‌ జోషి అన్నారు. ‘‘కులం ఒక గుర్తింపు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు దాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుంటాయి. సాధారణంగా గ్రామీణ ఓటర్లు తమ వర్గానికి చెందిన అభ్యర్థులకు ఓటేసేందుకే ప్రాధాన్యమిస్తుంటారు. నాయకులు తమ కులం వారైతే.. ఎన్నికలయ్యాక ఏదైనా పని కోసం వారిని సంప్రదించడం తేలికవుతుందని వారు భావిస్తుంటారు’’ అని ఆయన పేర్కొన్నారు.

హిందుత్వ ఎజెండాతో భాజపా

మధ్య, దక్షిణ గుజరాత్‌ల్లోని అహ్మదాబాద్‌, వడోదరా వంటి పట్టణ ప్రాంతాల్లో కుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోందని వడోదరాలోని ఎం.ఎస్‌.యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అమిత్‌ ఢోలకియా తెలిపారు. సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్‌ వంటి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అది చాలా ప్రభావశీల అంశంగా కొనసాగుతోందని వివరించారు. అయితే రాష్ట్రంలో కుల సమీకరణాలపై ఆధారపడకుండా హిందుత్వ ఎజెండాతో గంపగుత్తగా ఓట్లు రాబట్టుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లతో కూడిన విపక్ష ఇండియా కూటమి మాత్రం కుల సమీకరణలతోనే కమలదళ వ్యూహాన్ని దెబ్బకొట్టొచ్చని భావిస్తోందని వివరించారు.

‘గెలిచే సమర్థతే ముఖ్యం’

టికెట్ల కేటాయింపులో కులానికి ప్రాధాన్యమిచ్చే అంశంపై గుజరాత్‌ భాజపా అధికార ప్రతినిధి యామల్‌ వ్యాస్‌ స్పందిస్తూ.. ‘‘అభ్యర్థుల ఎంపికలో మేం సమతుల్యత పాటిస్తుంటాం. కులాలకు అధిక ప్రాధాన్యమేమీ ఇవ్వం. పార్టీ పట్ల అభ్యర్థి విధేయత, గెలవగల సమర్థత, విద్యార్హతల వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటుంటాం’’ అని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ దోషీ మాట్లాడుతూ.. టికెట్ల కేటాయింపులో కులాలకు ప్రాధాన్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ఓటర్లదేనని పేర్కొన్నారు. అధిక విద్యార్హతలు, సేవ చేయాలనే తపన ఉన్న అభ్యర్థులను వారు ఓడిస్తే.. కులం వంటి ఇతర సమీకరణాల వైపు పార్టీలు చూడక తప్పదని వివరించారు. ఎన్నికల్లో విజయం సాధించగల సమర్థతే అన్నింటికంటే ముఖ్యమని పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టి.ఎన్‌.శేషన్‌ కాంగ్రెస్‌ తరఫున గాంధీనగర్‌ స్థానం నుంచి 1999 లోక్‌సభ ఎన్నికల బరిలో దిగి పరాజయం పాలైన సంగతిని ఆయన గుర్తుచేశారు. నాడు శేషన్‌ భాజపా అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ చేతిలో ఓడిపోయారు.


గుజరాత్‌లో భాజపా ఈ దఫా పాటీదార్‌ వర్గానికి చెందిన ఆరుగురికి టికెట్లు ఇచ్చింది. ఓబీసీలను ఏడు స్థానాల్లో బరిలో దింపింది. ఇండియా కూటమి కూడా ఆరుగురు పాటీదార్లను పోటీలో నిలిపి, ఏడుగురు ఓబీసీలకు టికెట్లు కేటాయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img