Alamgir Alam: టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ

ఆ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖలో టెండర్‌ దక్కాలంటే మంత్రిగారికి 1.5శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనంట. ఈ విషయాన్ని  దర్యాప్తు సంస్థ ఈడీ కోర్టుకు వెల్లడించింది.  

Updated : 17 May 2024 13:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మనీలాండరింగ్‌ కేసులో ఇటీవల అరెస్టైన ఝార్ఖండ్‌ మాజీ మంత్రి ఆలంగీర్‌ ఆలమ్‌ (Alamgir Alam) ప్రభుత్వ టెండర్లలో భారీగా సొమ్ములు వసూలు చేసేవాడని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ న్యాయస్థానానికి వెల్లడించింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన ఏ టెండర్‌లోనైనా ఆయనకు 1.5 శాతం వాటా కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని.. అప్పుడే అవి ఓకే అవుతాయని తెలిపింది.

ఆలంగీర్‌ సన్నిహితుడు సంజీవ్‌ కుమార్‌ లాల్‌ పని మనిషి జహంగీర్‌ ఆలమ్‌ అనే వ్యక్తి ఫ్లాట్‌ నుంచి రూ.32.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నట్లు ఈడీ పేర్కొంది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్‌ సొమ్ములు వసూలు చేసి పంచే బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్లు చూసుకుంటారని వెల్లడించింది. ఇలానే 2022 సెప్టెంబర్‌లో ఓ ఇంజినీర్‌ నుంచి రూ.3 కోట్లు అందుకున్నట్లు పేర్కొంది.

2020లో గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ వీరేంద్ర రామ్‌పై కేసు నమోదు చేసింది. ‘‘తన శాఖలో పనులు అప్పగించడానికి రామ్‌ కాంట్రాక్టర్ల వద్ద నుంచి సొమ్ములు వసూలు చేసేవాడు. ఈ డబ్బు సేకరణకు అసిస్టెంట్‌ ఇంజినీర్లు సాయం చేసేవారు’’ అని ఈడీ పీఎంఎల్‌ఏ కోర్టుకు వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంలో గ్రామీణాభివృద్ధి శాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉద్యోగులున్నారని ఈడీ పేర్కొంది.  భారీ మొత్తంలో నగదు తీసుకొని.. ఆ తర్వాత వాటితో మనీలాండరింగ్‌ చేసినట్లు చెప్పింది.

సార్వత్రిక ఎన్నికల వేళ ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో గుట్టలుగా రూ.32 కోట్లు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర మంత్రి ప్రైవేటు కార్యదర్శి పనిమనిషి ఇంటి నుంచి ఈడీ  అధికారులు ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ వీరేంద్ర కుమార్‌ రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది. రూ.10 వేలు లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై నాడు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఈ హవాలా నెట్‌వర్క్‌ బయటపడింది. కాంట్రాక్టర్లకు టెండర్ల ఆశ జూపి వారి నుంచి భారీ మొత్తం డబ్బులు దండుకున్నట్లు వీరేంద్ర విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇందులో తనతో పాటు చాలా మంది పెద్ద స్థాయి అధికారులు కూడా భాగస్వాములైనట్లు చెప్పాడు. మొత్తం టెండర్‌ విలువలో కొంత శాతం కమీషన్‌ తీసుకోగా.. అందులో తన వాటా 0.3 శాతమని పేర్కొన్నాడు. అతడు ఇచ్చిన వాంగ్మూలంతో ఈడీ విస్తృత దర్యాప్తు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని