icon icon icon
icon icon icon

చిన్న నియోజకవర్గాల్లో పెద్ద పోరు

దేశంలోని అతి చిన్న నియోజకవర్గాల్లో ఉన్న దాద్రా నగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌లలో మూడో విడతలో భాగంగా ఈ నెల 7వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

Updated : 04 May 2024 06:44 IST

ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే..
దాద్రా నగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌లలో మూడో విడతలో పోలింగ్‌

దేశంలోని అతి చిన్న నియోజకవర్గాల్లో ఉన్న దాద్రా నగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌లలో మూడో విడతలో భాగంగా ఈ నెల 7వ తేదీన పోలింగ్‌ జరగనుంది. దాదర్‌ నగర్‌ హవేలీ, దమణ్‌, దీవ్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నా ఇక్కడ దాద్రా నగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌ పేరుతో రెండు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఇందులో దాద్రా నగర్‌ను ఎస్టీలకు రిజర్వు చేశారు. ఇక్కడ ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోరు సాగుతోంది.

  •  దాద్రా నగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌ 1,483 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. ఇది లక్షద్వీప్‌ తర్వాత దేశంలోనే రెండో అత్యంత చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతంగా ఇది నిలుస్తోంది.
  •  దాద్రా నగర్‌ హవేలీ జనాభా నాలుగు లక్షల వరకూ ఉంటుంది. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 700 మంది ఉంటారు. ప్రతి వేయి మంది పురుషులకు 774 మంది మహిళలే ఉన్నారు. ఇక్కడ అక్షరాస్యత 76.2 శాతం.

2020లో విలీనం

దాద్రా నగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌లను విలీనం చేస్తూ 2019 జులైలో పార్లమెంటు బిల్లును ఆమోదించింది. 2020 జనవరి 26 నుంచి ఈ కేంద్ర పాలిత ప్రాంతం అమల్లోకి వచ్చింది. ఇందులో దాద్రా, నగర్‌ హవేలీ, దమణ్‌, దీవ్‌ అనే నాలుగు ప్రాంతాలుంటాయి. ఇవన్నీ గతంలో పోర్చుగీస్‌ ఆధీనంలో ఉండేవి. పణజీ రాజధానిగా ఉండేది. 1987 వరకూ గోవా, దమణ్‌ దీవ్‌ పాలనలో ఉండేవి. కొంకణీ భాషోద్యమం మొదలయ్యాక గోవాను ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రం ప్రకటించింది.

తిరుగులేని స్వతంత్ర అభ్యర్థి విషాదాంతం

దాద్రా నగర్‌ హవేలీ నుంచి మోహన్‌భాయ్‌ సంజీభాయ్‌ దేల్కర్‌ ఏడు సార్లు ఎంపీగా గెలిచారు. 1989 నుంచి 2004 వరకూ, ఆ తర్వాత 2019లో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ముంబయిలో ఆత్మహత్య చేసుకున్నారు.ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎక్కువసార్లు గెలిచింది. స్వతంత్ర అభ్యర్థి కూడా పలుమార్లు విజయం సాధించారు.

  • ఈసారి మోహన్‌భాయ్‌ సతీమణి కళాబెన్‌ దేల్కర్‌ను పార్టీలో చేర్చుకుని భాజపా టికెటిచ్చింది. అజిత్‌ రాంజీభాయ్‌ మహ్లా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు.
  • భర్త మరణం అనంతరం ఉప ఎన్నికల్లో కళాబెన్‌ శివసేన తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆమెకు సానుభూతివల్ల 51,269 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈసారి ఆమెను భాజపా తమ పార్టీలో చేర్చుకుని మరీ టికెట్‌ కేటాయించింది.

చిన్నదైనా ప్రతిష్ఠాత్మకమే

భారత వాయవ్య ప్రాంతంలో గుజరాత్‌, మహారాష్ట్రల మధ్యన ఉండే దమణ్‌ దీవ్‌ అతి చిన్న నియోజకవర్గం. దీని విస్తీర్ణం 112 చదరపు కిలోమీటర్లే. ఇందులో రెండు జిల్లాలున్నాయి. వ్యవసాయం,  అటవీ ఉత్పత్తులు, పర్యాటక పరిశ్రమ ఇక్కడ ప్రధాన జీవనాధారాలు. జనాభా దాదాపు 3 లక్షలు.

 ఇక్కడ కాంగ్రెస్‌, భాజపా మధ్యే పోరు సాగుతుంటుంది. ఇక్కడ 9సార్లు ఎన్నికలు జరిగాయి. తొలుత కాంగ్రెస్‌ ఆధిపత్యం చెలాయించినా ఆ తరువాత భాజపా పట్టు సాధించింది. కాంగ్రెస్‌, భాజపాల మధ్య విజయం దోబూచులాడుతూ వస్తోంది. 2019లో భాజపా అభ్యర్థి లాలూభాయ్‌ పటేల్‌ గెలిచారు. మళ్లీ లాలూభాయ్‌నే భాజపా తమ అభ్యర్థిగా నిలిపింది. కాంగ్రెస్‌ నుంచి కేతన్‌ దయాభాయ్‌ పటేల్‌ బరిలో ఉన్నారు.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img