icon icon icon
icon icon icon

కీలక నేతలకు అగ్ని పరీక్ష

కీలక నేతలు బరిలో నిలిచిన మూడోవిడత పోలింగ్‌ ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ నెల 7న 93 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో 9 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల్లోని అగ్రనేతలు పోటీలో ఉన్నారు.

Updated : 04 May 2024 06:42 IST

మూడో విడత బరిలో కొందరికి కష్టం.. కొందరికి సులభం

కీలక నేతలు బరిలో నిలిచిన మూడోవిడత పోలింగ్‌ ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ నెల 7న 93 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో 9 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల్లోని అగ్రనేతలు పోటీలో ఉన్నారు. వారిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారి స్థానాల్లో గట్టిపోటీ నెలకొంది. అవేమిటో చూద్దాం..


శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

ధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 20ఏళ్ల తర్వాత లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. భాజపాకు కంచుకోట అయిన విదిశలో ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన విజయం నల్లేరుపై నడకే కానుంది. నియోజకవర్గంపై ఆయనకు గట్టి పట్టుంది.


దిగ్విజయ్‌ సింగ్‌

గత ఎన్నికల్లో భోపాల్‌లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ అగ్ర నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఈసారి తన సొంత గడ్డ రాజ్‌గఢ్‌ నుంచి బరిలోకి దిగారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఆయన ఇక్కడికి వచ్చారు. 2009లో ఇక్కడ కాంగ్రెస్‌ గెలిచింది. 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. గత ఎన్నికల్లో భాజపా 4లక్షలకుపైగా మెజారిటీతో గెలిచింది. దీంతో దిగ్విజయ్‌ సింగ్‌కు ఇది కష్టతరంగానే ఉంది. అయినా ఆయన తనకున్న పరిచయాలతో గట్టిగా పోరాడుతున్నారు.


అమిత్‌ షా

గత ఎన్నికల్లో సాధించిన 5.55 లక్షల మెజారిటీని దాటాలని గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి మరోసారి పోటీ చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున సోనాల్‌ పటేల్‌ బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సీజే చావ్‌డా ప్రస్తుతం భాజపాలో ఉన్నారు. 1989 నుంచి భాజపా ఇక్కడ గెలుస్తూ వస్తోంది. గతంలో ఇక్కడి నుంచి వాజ్‌పేయీ, ఆడ్వాణీ ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గంలోనే ప్రధాని మోదీ ఓటరుగా ఉన్నారు. 30ఏళ్లుగా తాను గాంధీనగర్‌ నుంచే శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానని, రూ.22,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని అమిత్‌ షా తెలిపారు. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లను గెలుచుకున్న భాజపా ఈసారీ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తోంది. గాంధీనగర్‌లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం భాజపానే ప్రాతినిధ్యం వహిస్తోంది. 


ప్రహ్లాద్‌ జోషి

ఇప్పటికే మూడు సార్లు గెలిచిన భాజపా నేత ప్రహ్లాద్‌ జోషి నాలుగోసారి కర్ణాటకలోని ధార్వాడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌ కొత్త అభ్యర్థి వినోద్‌ అసూటీతో తలపడుతున్నారు. కేంద్ర మంత్రిగా పని చేసిన జోషికి ఈ ఎన్నికల్లోనూ అనుకూల వాతావరణమే కనిపిస్తోంది.


జ్యోతిరాదిత్య సింధియా

కాంగ్రెస్‌ నుంచి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన భాజపా.. మధ్యప్రదేశ్‌లోని గుణలో ఆయననే అభ్యర్థిగా నిలిపింది. రాజ కుటుంబం నుంచి వచ్చిన ఆయన  2019లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి లక్షకుపైగా తేడాతో తొలిసారి ఓడిపోయారు. ఆ తర్వాత భాజపాలో చేరారు. ఈసారి ఆయన ఒకప్పటి భాజపా అగ్ర నేత, 2023లో కాంగ్రెస్‌లో చేరిన రావ్‌ యాదవేంద్ర సింగ్‌ యాదవ్‌తో తలపడుతున్నారు. ఈ ఎన్నిక ఆయనకు అత్యంత ప్రతిష్ఠాత్మకం. గుణలో గెలిచి రాజ కుటుంబం పట్టును నిలుపుకోవాలని ఆయన చూస్తున్నారు.


సుప్రియా సూలే

మహారాష్ట్రలో తన జీవితంలోనే అత్యంత కఠిన పరీక్షను శరద్‌ పవార్‌ ఎదుర్కొంటున్నారు. తమ కంచుకోట బారామతిలో కుమార్తె సుప్రియా సూలేపై అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ పోటీకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికతో ప్రజలు శరద్‌ పవార్‌ వెంటా, అజిత్‌ పవార్‌ వెంటా అనేది తేలనుంది. సుప్రియా సూలే కొత్త గుర్తుతో పోటీ చేస్తుండటం పోటీని మరింత కఠినంగా మార్చింది. 2009 నుంచి ఇక్కడ సుప్రియా సూలే గెలుస్తూ వస్తున్నారు.


డింపుల్‌ యాదవ్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌లో అఖిలేశ్‌ కుటుంబానికి కంచుకోట అయిన మైన్‌పురీ నుంచి ఆయన సతీమణి డింపుల్‌ యాదవ్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ఈ సీటులో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న భాజపా ఠాకుర్‌ జైవీర్‌ సింగ్‌ను బరిలోకి దింపింది. 2019లో ఇక్కడి నుంచి ములాయం సింగ్‌ యాదవ్‌ గెలిచారు. ఆయన మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్‌ యాదవ్‌ విజయం సాధించారు. పట్టు నిలుపుకోవాలని అఖిలేశ్‌, ఎలాగైనా గెలవాలని భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ ఆసక్తికర పోరు సాగుతోంది.


బద్రుద్దీన్‌ అజ్మల్‌

స్సాంలోని ధుబరీ నుంచి పోటీ చేస్తున్న ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు బద్రుద్దీన్‌ అజ్మల్‌ ఈసారి భాజపా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 2009 నుంచి ఆయన గెలుస్తూ వస్తున్నారు. అయితే డీలిమిటేషన్‌లో భాగంగా ముస్లింలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను వేరే దాంట్లో కలపడంతో ఈసారి ఆయనకు గట్టి సవాలు ఎదురవుతోంది. పలు ప్రాజెక్టులను ఈ ప్రాంతానికి తేవడంలో ఆయన విజయం సాధించడంతో ఇక్కడ పట్టు సాధించారు.


పల్లవి డెంపో

గోవాలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చిన పల్లవి డెంపో దక్షిణ గోవా నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. రూ.1,361 కోట్ల ఆస్తులున్న ఆమె మూడో విడతలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. గోవాలో తొలిసారిగా భాజపా తరఫున పోటీ చేస్తున్న మహిళ కూడా ఆమే. 2019లో దక్షిణ గోవాలో కాంగ్రెస్‌ నుంచి ఫ్రాన్సిస్కో సర్దిన్హా 9,755 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి ఎలాగైనా ఈ సీటును దక్కించుకోవాలని పల్లవిని భాజపా బరిలోకి దింపింది. దీంతో గట్టి పోటీ నెలకొంది.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img