icon icon icon
icon icon icon

కన్నడ నాట కొత్త ప్రచారబాట

కర్ణాటకలో మలి విడత ఎన్నికలకు ఒక రోజే మిగిలిన వేళ.. రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోతోంది. మంగళవారం నిర్వహించే ఎన్నికలకు బహిరంగ ప్రచారం ఆదివారంతో ముగిసిపోయింది.

Published : 06 May 2024 04:40 IST

ఈసారి మారిన నేతల శైలి
వర్తమాన అంశాలే కీలకాస్త్రాలు

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో మలి విడత ఎన్నికలకు ఒక రోజే మిగిలిన వేళ.. రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోతోంది. మంగళవారం నిర్వహించే ఎన్నికలకు బహిరంగ ప్రచారం ఆదివారంతో ముగిసిపోయింది. ఈసారి ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని 14 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా రెండు జాతీయ పార్టీల మధ్యే కీలక పోరు కొనసాగనుంది. ఈ ప్రాంతంలో జనతాదళ్‌కు పట్టులేని కారణంగా పోటీ కంటే భాజపా అభ్యర్థులకు మద్దతివ్వాలని తీర్మానించుకుంది. గత ఎన్నికల్లో ఈ 14 సీట్లనూ గెలుచుకున్న భాజపా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని ప్రయత్నిస్తుండగా, కమలం ఆధిపత్యానికి గండికొట్టాలని కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల కోసం తొలుత జాతీయ అంశాలను ప్రచారంలో ప్రస్తావించిన పార్టీలు క్రమంగా స్థానిక అంశాలపై దృష్టి సారించాయి.


గ్యారంటీలతో మొదలై..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రధాన బలం 5 గ్యారంటీ పథకాలే. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసిన సర్కారు ఎన్నికల సమయానికి ఐదింటినీ పట్టాలెక్కించింది. ఇవే కాంగ్రెస్‌కు బలమని గుర్తించిన భాజపా ఎన్నికలకు ముందే వీటి లోపాలను ప్రచారం చేసింది. భాజపా రాష్ట్ర నేతలంతా ఈ గ్యారంటీల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు పక్కనబెట్టారని సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ మొదలు కేంద్ర మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఈ గ్యారంటీలు ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకాలంటూ విశ్లేషించారు. ఇలాంటివి 75 తెచ్చినా ఎన్‌డీఏ పదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధికి సాటి రావంటూ ప్రధాని మోదీ సవాలు చేశారు. తాను ప్రచారం చేసిన ప్రతి చోటా కేంద్ర సర్కారు జల్‌జీవన్‌ మిషన్‌, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సదుపాయాలను వివరిస్తూ.. ఇవన్నీ భాజపా ఇచ్చే శాశ్వత గ్యారంటీలని ప్రచారం చేశారు.


కాంగ్రెస్‌ ప్రచారం..

రాష్ట్రంలో 85% మంది 5 గ్యారంటీలకు లబ్ధిదారులుగా ఉన్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,  కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ గ్యారంటీలను పాన్‌ ఇండియా స్థాయిలో తీసుకెళ్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్‌.. తమ ప్రణాళికల్లో ప్రకటించిన మహిళలు, రైతులు, యువతకు అందించే 25 గ్యారంటీలపై భరోసా ఇచ్చారు.


భాజపా కౌంటర్‌..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు నెలల్లోనే ఖజానాను ఖాళీ చేసిన కాంగ్రెస్‌ ఆ తప్పును కేంద్రంపై వేస్తోందని, ఏటా వేల కోట్లు గ్యారంటీల కోసం ఖర్చు చేసే సర్కారు కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితికి వచ్చినట్లు భాజపా ప్రచారం చేసింది. యూపీఏ సర్కారు పదేళ్ల కాలంలో ఇచ్చిన నిధుల కంటే పది శాతం అదనపు నిధులు ఇచ్చినట్లు మోదీ, అమిత్‌ షాలు స్వయంగా ప్రచారాల్లో వివరించారు. రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకున్న కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రజలకు ‘చిప్ప’ చేతికి ఇచ్చినట్లు భాజపా సామాజిక మాధ్యమాల్లో  ప్రచారం చేసింది.


ఆర్థిక అంశాలు..

ఈ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వ్యవహారాలు పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కర్ణాటక కరవు పరిహారంపై పెద్ద రాజకీయ యుద్ధమే కొనసాగింది. రాష్ట్రం పంపిన కరవు నివేదికలకు  కేంద్రం స్పందించలేదంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు నుంచి రాష్ట్రానికి కరవు పరిహారం చెల్లించాల్సిందిగా ఇచ్చిన తీర్పు ఈ ఎన్నికలకు ప్రచారాస్త్రంగా మారింది. నియమావళి కారణంగా ఎన్నికల సంఘంతో అనుమతి తీసుకున్న కేంద్రం సుప్రీంకోర్టు సూచించిన గడువులోనే రూ.3,440 కోట్లను రాష్ట్రానికి కరవు పరిహారంగా విడుదల చేసింది. ఈ మొత్తం రాష్ట్రానికి కలిగిన నష్టం రూ.34వేల కోట్లలో కనీసం 10శాతం కూడా లేదంటూ మళ్లీ కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. ఇదే సందర్భంగా కేంద్రం రాష్ట్రానికి ‘ఖాళీ చెంబు’ను ఇచ్చినట్లు కాంగ్రెస్‌ పత్రికల్లో ఇచ్చిన ప్రకటన ఈ ఎన్నికల్లో పెద్ద చర్చగా మారింది.


రిజర్వేషన్ల వివాదం..

కాంగ్రెస్‌ ప్రకటించిన ప్రణాళిక ‘ముస్లిం లీగ్‌’ది అంటూ ఆరోపించిన భాజపా.. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశాన్ని ప్రచారం చేసింది. రెండు రోజులుగా భాజపా సామాజిక మాధ్యమంలో ప్రచారం అవుతున్న రిజర్వేషన్ల ప్రకటన దుమారం రేపుతోంది. ఓ బుట్టలో ముస్లిం గుడ్డును ఉంచిన రాహుల్‌ అనంతరం ఆ గుడ్డు నుంచి వచ్చిన ముస్లిం వ్యక్తికి నిధులను అందించడం, ఆ వ్యక్తి పెరుగుతూ చివరకు బుట్టలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను నెట్టివేస్తున్న ప్రకటనపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.


సామాజిక అంశాలు..

సున్నితమైన సామాజిక అంశాలను రెండు జాతీయ పార్టీలు ప్రచారంలోకి తెచ్చాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నగా మారతాయని భాజపా ఆరోపించింది. ప్రధాని మోదీ రెండో విడతలో చేసిన ప్రతి ప్రచారంలోనూ బెంగళూరులోని ఓ హోటల్‌లో పేలుడు గురించి ప్రస్తావించారు. హుబ్బళ్లిలో హత్యకు గురైన నేహ ఉదంతాన్ని భాజపా ప్రచారాస్త్రంగా మార్చుకుంది.


ప్రజ్వల్‌ వ్యవహారం..

హాసన ఎంపీ, జనతాదళ్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్ణ అంశం ప్రముఖ ప్రచారాస్త్రంగా మారింది. ఎన్డీయే అభ్యర్థిగా హాసనలో పోటీ చేసిన ప్రజ్వల్‌కు మోదీ, అమిత్‌ షాలు అతని కృత్యాలు తెలిసీ మద్దతిచ్చారంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆయన దేశాన్ని విడిచి పోయేందుకు భాజపా సర్కారే కారణమని రాహుల్‌ ఆరోపించారు. ఏడాది కిందటే ప్రజ్వల్‌ విషయం తెలిసీ సర్కారు ఉదాసీనంగా వ్యవహరించినట్లు భాజపా కౌంటర్‌ ఇచ్చింది. మహిళల పట్ల అకృత్యాలకు పాల్పడితే వారిని ఉపేక్షించబోమని ప్రకటించిన అమిత్‌ షా నష్టనివారణకు ప్రయత్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img