icon icon icon
icon icon icon

ఎన్నికల్లో మార్వాడీల కీలకపాత్ర!

ఎడ్ల బండి కూడా వెళ్లలేని చోటుకు మార్వాడీలు వెళ్తారు అనేది నానుడి. అన్నట్లుగానే వారు ఇప్పుడు దేశమంతటా విస్తరించారు. వివిధ వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారు.

Published : 09 May 2024 05:20 IST

దేశవ్యాప్తంగా విస్తరించిన వర్గం
తొలుత కాంగ్రెస్‌ మద్దతుదారులుగా.. ప్రస్తుతం భాజపా వెంట
(ప్రకాశ్‌ భండారీ)

ఎడ్ల బండి కూడా వెళ్లలేని చోటుకు మార్వాడీలు వెళ్తారు అనేది నానుడి. అన్నట్లుగానే వారు ఇప్పుడు దేశమంతటా విస్తరించారు. వివిధ వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారు. దీంతో ఎన్నికల్లో వారిని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మకు ఇప్పుడు భారీ డిమాండు ఏర్పడింది. దేశవ్యాప్తంగా మార్వాడీలు ఉన్న చోట ఆయన వచ్చి ప్రచారం చేయాలని భాజపా నాయకులు కోరుకుంటున్నారు.


 రాజకీయంగానూ క్రియాశీలం

శతాబ్దం కిందటే తమ మూలాల నుంచి వలస వచ్చిన మార్వాడీల్లో ఎక్కువ మంది వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. రాజకీయంగానూ క్రియాశీలకంగానే ఉంటారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లినవారూ ఉన్నారు. వారిలో జమ్నాలాల్‌ బజాజ్‌, రామకృష్ణ బజాజ్‌, కమల్‌ నయన్‌ బజాజ్‌, దేవీచంద్‌ సాగర్‌మల్‌, జీడీ బిర్లా తదితరులు ఉన్నారు. బిర్లాలు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండేవారు. మహాత్మా గాంధీకి జీడీ బిర్లా అత్యంత సన్నిహితుడు.


కాంగ్రెస్‌ నుంచి భాజపా దిశగా..

మార్వాడీ వర్గం తొలుత కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేది. పశ్చిమ బెంగాల్‌లో ట్రేడ్‌ యూనియన్ల పేరుతో తమను లెఫ్ట్‌ నేతలు ఇబ్బందిపెట్టారని భావించిన వారు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండేవారు. ఈ వర్గానికి చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్‌ హయాంలో లైసెన్స్‌ రాజ్‌ అమల్లో ఉన్నప్పుడు సులభంగా అనుమతులు తెచ్చుకుని లబ్ధి కూడా పొందారు. వారంతా క్రమంగా భాజపావైపు మళ్లడం ప్రారంభించారు. రాజస్థాన్‌లో భాజపా, కాంగ్రెస్‌లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడి ముఖ్యమంత్రులకు డిమాండు ఉంటుంది. దేశ వ్యాప్తంగా విస్తరించిన మార్వాడీల్లో ప్రచారం చేయడానికి పార్టీ నేతలు వారిని ఆహ్వానిస్తారు.

  •  రాజస్థాన్‌ సీఎం భజన్‌ లాల్‌ శర్మ ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో భాజపా తరఫున ప్రచారం చేశారు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడ ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయన బెంగాల్‌ కార్యకర్తల్లో ప్రాచుర్యం పొందారు. ఈసారి పశ్చిమ బెంగాల్‌లో 35 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శర్మ తెలిపారు.
  •  అమిత్‌ షా ఆధ్వర్యంలో ఆయన బెంగాల్‌లో పని చేయడంవల్లే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవి వచ్చిందని అంటుంటారు.
  •  ఝార్ఖండ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో భజన్‌లాల్‌ శర్మ ప్రచారం చేస్తున్నారు.

గహ్లోత్‌కూ ప్రజాదరణ

రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌కూ మార్వాడీల్లో మంచి ప్రజాదరణ ఉంది. మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, దక్షిణాది రాష్ట్రాల్లోని వలస మార్వాడీల కోసం ఆయన ప్రచారం చేస్తుంటారు. భజన్‌ లాల్‌ మాదిరిగానే గహ్లోత్‌ ప్రచారం చేస్తుంటారు. తన కుమారుడు పోటీ చేసిన ఝాలోర్‌కే ఆయన తొలుత పరిమితమయ్యారు. అక్కడ ఎన్నికలు పూర్తి కావడంతో మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనూ ఆయన ప్రచారానికి రానున్నారు.


పలు రాష్ట్రాల్లో..

మార్వాడీలు పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఒడిశా, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్ర, అస్సాం, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, దిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వారి ఉనికి ఉంది. దాదాపు 15 రాష్ట్రాల్లో మార్వాడీలు ఎన్నికల్లో ప్రభావం చూపగలరు.

  • మార్వాడీల్లో వ్యాపారవేత్తలే కాదు.. కార్మికులూ ఉంటారు. వారు మార్వాడ్‌, మేవాడ్‌, వగద్‌, శెఖావత్‌ ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వస్తుంటారు.
  • మహారాష్ట్రలోని ఉత్తర ముంబయి, ఉత్తర మధ్య ముంబయి, నాగ్‌పుర్‌, పుణె, మరాఠ్వాడా ప్రాంతాల్లో మార్వాడీల ప్రాబల్యం అధికం.
  • గుజరాత్‌లోని సూరత్‌, రాజ్‌కోట్‌, గాంధీనగర్‌, వడోదరా, అహ్మదాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు.
  • అస్సాంలోని దిబ్రూగఢ్‌, గువాహటి ప్రాంతాల్లో ఉంటారు.
  • మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌, విదిశా ప్రాంతాల్లో మార్వాడీలు అధికంగా ఉంటారు.
  • తెలంగాణాలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లకే వారు పరిమితమయ్యారు.
  • ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గుంటూరులో అధికంగా ఉంటారు.
  • ఝార్ఖండ్‌లోని రాంచీ, జెమ్‌షెడ్‌పుర్‌, బొకారో, సంద్‌, చైబాసా ప్రాంతాల్లో మార్వాడీలు ఉంటారు.
  • ఒడిశాలోని కటక్‌, భద్రక్‌, సంబల్‌పుర్‌ ప్రాంతాల్లో వారి ఉనికి ఉంది.
  • కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, శివమొగ్గ ప్రాంతాల్లో అధికంగా ఉంటారు. బెంగళూరులో మార్వాడీ వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగానూ ఒకరికి అవకాశం కల్పించారు.
  • తమిళనాడులోని చెన్నై, మదురై, కోయంబత్తూర్‌లలో మార్వాడీలు అధికంగా ఉంటారు.
  • ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌, దుర్గ్‌, భిలాయ్‌, బస్తర్‌, రాయ్‌గఢ్‌, బిలాస్‌పుర్‌లలో ఉంటారు.
  • బిహార్‌లోని భాగల్పుర్‌, పట్నా, దర్భంగాలలో ఉంటారు.
  • ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 20 నియోజకవర్గాల్లో వారి ఉనికి ఉంటుంది.
  • హరియాణాలోని పానిపట్‌, గురుగ్రామ్‌లలో మార్వాడీలు ఉంటారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img