icon icon icon
icon icon icon

లోక్‌సభ ఎన్నికల్లో ‘ఏకగ్రీవం’.. ఇప్పటివరకూ ఎంతమందంటే..?

సూరత్‌ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా ఏకగ్రీవం విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి..? గతంలో ఎంతమంది ఇలా ఎన్నికయ్యారంటే..?

Published : 29 Apr 2024 19:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోలింగ్‌ జరగకుండానే భాజపా ఈ లోక్‌సభ ఎన్నికల్లో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని సూరత్‌ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ కుంభానీ నామినేషన్‌ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారి ఎదుట హాజరయ్యేందుకు నిరాకరించారు. తాము ఆ పత్రాలపై సంతకాలు చేయలేదని వారు స్పష్టం చేశారు. దీంతో ఆ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థి నామినేషనూ చెల్లలేదు. ఆ వెంటనే స్వతంత్రులు సహా ఇతరులంతా బరి నుంచి వైదొలగడంతో నాటకీయ పరిణామాల నడుమ ముకేశ్‌ దలాల్‌ విజేత అయ్యారు. ఈ స్థానంలో ఆయనపై కాంగ్రెస్‌, బీఎస్పీ, మూడు చిన్న పార్టీలు అభ్యర్థులను నిలబెట్టాయి. స్వతంత్రులుగా నలుగురు బరిలో దిగారు. నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజు నాటికి దలాల్‌ ఒక్కరే మిగిలారు. దీంతో ముకేశ్‌ నెగ్గినట్లు జిల్లా ఎన్నికల అధికారి ధ్రువీకరణపత్రం అందించారు. భాజపా నుంచి ఇది తొలి ఏకగ్రీవంగా చెబుతున్నారు.

నిబంధనలు ఎలా ఉన్నాయి..?

నామినేషన్ల ఉపసంహరణ నాటికి బరిలో ఒక్క అభ్యర్థి మాత్రమే మిగిలితే అతడిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారు.  1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 53(3) ప్రకారం.. రిటర్నింగ్‌ అధికారికి ఈ అధికారం ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ను ఆ నియోజకవర్గం నుంచి కనీసం ఒక్కరైనా ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థి లేదా గుర్తింపుపొందని పార్టీ అభ్యర్థి అయితే.. పది మందైనా నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయాల్సిఉంటుంది. అలాకానిపక్షంలో ఆ నామినేషన్లను తిరస్కరించే అధికారం రిటర్నింగ్‌ అధికారికి ఉంటుంది.

నోటా ఉన్నా..

బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం ఓటర్లకు ఉంటుంది. దీన్ని 2013 నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. పోటీలో ఒక్క అభ్యర్థే మిగిలినప్పటికీ నోటా ఉంటుంది కదా.. ఎన్నికలు నిర్వహించాలని వాదించేవారు కొందరు ఉంటారు. అయితే.. నోటాకు ఎన్ని ఓట్లు వచ్చినా వాటిని తుది ఫలితం ప్రకటించే సమయంలో పరిగణనలోకి తీసుకోరు.

గతంలో ఇలా ఎన్నికయ్యారా..?

  • 1951 నుంచి ఇప్పటివరకు 35 మంది అభ్యర్థులు లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • గతంలో వై.బి.చవాన్‌, ఫరూక్‌ అబ్దుల్లా, హరేకృష్ణ మెహతాబ్‌, టి.టి.కృష్ణమాచారి, పి.ఎం.సయీద్‌, ఎస్‌.సి.జమీర్‌ వంటివారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • గత 12 ఏళ్లలో మాత్రం ఇలా ఎవరూ ఎన్నిక కాలేదు. 2012లో కన్నౌజ్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది.
  • 1957 ఎన్నికల్లో అత్యధికంగా ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1951 ఎన్నికల్లో ఐదుగురు, 1967 ఎన్నికల్లో మరో ఐదుగురు ఇలా ఎన్నికయ్యారు. 1962 ఎన్నికల్లో ముగ్గురు, 1977 ఎన్నికల్లో ఇద్దరు, 1971, 1980, 1989 ఎన్నికల్లో ఒక్కొక్కరూ ఇలా గెలుపొందారు.
  • ఉప ఎన్నికల్లో పోటీ లేకుండా గెలిచినవారు తొమ్మిది మంది ఉన్నారు.
  • ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌ నుంచే ఉన్నారు.
  • సిక్కిం, శ్రీనగర్‌ స్థానాలు రెండుసార్లు ఏకగ్రీవమయ్యాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img