icon icon icon
icon icon icon

2024 India elections: ఓటర్లూ అందుకోండి ఈ ఆఫర్లు..: పోలింగ్‌ను పెంచేందుకు యత్నాలు..!

ఎన్నికల సందడిలో ప్రభుత్వాలు, కంపెనీలు ప్రత్యేకంగా ఓటర్ల కోసమే పలు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించాయి. అవేంటో తెలుసుకోండి.

Updated : 09 May 2024 16:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే పోలింగ్‌ ముగిసినచోట్ల చప్పగా సాగింది. ఏ దశలోనూ 70శాతం దాటలేదు. దీంతో ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు, స్థానిక అధికారులు, వివిధ ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి సమష్టి యత్నం మొదలుపెట్టారు. ఓటు వేయడాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రత్యేక ఆఫర్లు, కార్యక్రమాలు చేపట్టారు. రెస్టారంట్లు, రైడ్‌, బస్‌ ఆపరేటర్లు వంటి వారు వీటిలో భాగస్వాములయ్యారు. 

2019లో 29.7 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోకుండా ఇంటికే పరిమితమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అంకెను చూస్తే సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా పట్టణ ఓటర్ల ఉదాసీనతే దీనికి ప్రధాన కారణం. 2024 ఎన్నికల తొలి దశలో 66.14 శాతం, రెండో దశలో 66.71 శాతం, మూడో దశలో ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు 65.68 శాతం పోలింగ్‌ జరిగింది. ఇంకా నాలుగు దశల ఓటింగ్‌ మిగిలి ఉంది. మే 13, మే 20, మే 25, జూన్ 1న ఇవి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్‌ పెంచేందుకు ఆకర్షణీయమైన చర్యలు తీసుకొంటున్నారు. 

మెట్రోలో డిస్కౌంట్లు..

ముంబయి పౌరులు మే 20వ తేదీన ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వెళ్లే సమయంలో మెట్రోలో డిస్కౌంట్‌ పొందవచ్చు. మెట్రోలైన్‌ 2ఏ, 7లో ఎన్నికల రోజున అదనంగా 10శాతం డిస్కౌంట్‌ ప్రకటించారు. పోలింగ్‌ స్టేషన్‌కు రాకపోకలు చేసే ప్రయాణికులు ముంబయి కార్డ్‌ 1, పేపర్‌ క్యూఆర్‌, పేపర్‌ టికెట్‌పై తగ్గింపు పొందవచ్చు. 

తెలుగు రాష్ట్రాల్లో అభిబస్‌ రాయితీ..

ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్‌ టికెట్‌ బుకింగ్‌ అగ్రిగేటర్‌, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్‌ వెల్లడించింది. ఇటీవల ఆ సంస్థ సీఈఓ లెనిన్‌ కోడూరు, సీఓఓ రోహిత్‌శర్మ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 11 నుంచి 15 తేదీల మధ్య చేసే ప్రయాణాలకు కూపన్‌ కోడ్‌ ABHIVOTE  (అభిఓట్‌) ఉపయోగించి, టికెట్‌ ధరలో కనీసం 20 శాతం నుంచి గరిష్ఠంగా రూ.250 వరకు రాయితీ పొందొచ్చని పేర్కొన్నారు. ఇదికాక రూ.100 క్యాష్‌బ్యాక్‌ కూడా లభిస్తుందన్నారు. సమ్మర్‌24 కూపన్‌ వినియోగించి, టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారిలో రోజుకు ఒకరిని డ్రా ద్వారా ఎంపిక చేసి ఏసీ బహుమతిగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ర్యాపిడోలో ఫ్రీరైడ్‌..

హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌లోని ఓటర్లకు ర్యాపిడో ఆఫర్లు ప్రకటించింది. మే 13వ తేదీన పోలింగ్‌ బూత్‌కు వెళ్లేవారికి ఉచితంగా బైక్‌ ట్యాక్సీ, ఆటో, క్యాబ్‌ ప్రయాణాలు ఉచితంగా ఇస్తామని సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో కలిసి పోలింగ్‌ శాతం పెంచేందుకు ఈ ఆఫర్‌ను తెచ్చినట్లు పేర్కొన్నారు. ఎన్నికల రోజున ఓటర్లు ‘వోట్‌ నౌ’ కోడ్‌ను ఉపయోగించి ర్యాపిడో యాప్‌ ద్వారా ఉచిత రైడ్‌లను పొందొవచ్చు. 

మధ్యప్రదేశ్‌లో ఉచిత ఆఫర్లు..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, గ్వాలియర్‌, ఇండోర్‌లో మూడు రోజుల పాటు ఫ్రీ రైడ్లు ఇచ్చేందుకు బస్సు ఆపరేటర్లు ముందుకొచ్చారు. భోపాల్‌, గ్వాలియర్‌లో ఇటీవల మంగళవారం పోలింగ్‌ ముగిసిన విషయం తెలిసిందే. దీంతోపాటు పోలింగ్‌ బూత్‌ల్లో లక్కీ డ్రాలు తీసి టీ-షర్టులను ఇస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకొన్నవారు వీటిని పొందవచ్చు.   

* ఇటీవల పోలింగ్‌లో పాల్గొన్న భోపాల్‌లో ఓటర్లకు డైమండ్‌ రింగ్‌లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్‌ సెట్లు, వాషింగ్‌ మిషిన్లు డ్రా తీసి బహూకరించారు.

* పోలింగ్‌ జరగాల్సిన ఇండోర్‌లో ఎన్నికల రోజు ఓటర్లకు ఉచితంగా పోహా, జిలేబీ అల్పాహారంగా అందించనున్నారు. దీంతోపాటు వేలిపై సిరా గుర్తును చూపిస్తే పలు మెడికల్‌ ల్యాబ్‌ల్లో పరీక్షలపై డిస్కౌంట్లు ప్రకటించారు. 

గురుగ్రామ్‌లో సినిమా టికెట్లపై డిస్కౌంట్లు..

గురుగ్రామ్‌ ఎంపీ సెగ్మెంట్‌లో ఓటింగ్‌ పెంచేందుకు స్థానిక జిల్లా అధికారులు మల్టీప్లెక్స్‌లతో జట్టు కట్టి సరికొత్త తాయిలాలను ముందుకుతెచ్చారు. ఓటు వేసేవారికి సినిమా టికెట్లు, ఆహార పదార్థాలపై తగ్గింపును ప్రకటించారు. వీటిని పొందాలంటే వేలిపై సిరా గుర్తు చూపి ఆఫ్‌లైన్లో టికెట్లు తీసుకోవచ్చు. 

* హరియాణాలోని 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా వేలిపై సిరా గుర్తును చూపి సినిమా హాల్స్‌లో రాయితీలను పొందే అవకాశం కల్పించారు. 

దిల్లీలో పెయిడ్‌ హాలిడే..

దిల్లీలో మే 25వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఈనేపథ్యంలో దిల్లీ ఎన్నికల కమిషనర్‌ ఆ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో అర్హులైన ఉద్యోగులందరూ నాడు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఈ పెయిడ్‌ హాలిడేను వాడుకోవచ్చు. 

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఆఫర్‌..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) తనవంతుగా ఓ ముందడుగేసింది. తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ, ఇంటర్నేషనల్‌ సర్వీసుల టికెట్‌ ధరలపై వారికి 19 శాతం రాయితీ ప్రకటించింది. ఈ ఆఫర్‌ పొందాలనుకునేవారు 18 నుంచి 22 ఏళ్ల వయసువారై ఉండాలి. మొబైల్‌ యాప్‌, కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. ఏప్రిల్‌ 18 నుంచి జూన్‌ 1 మధ్య ప్రయాణించాలి. ఓటు వేయబోయే నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టు గమ్యస్థానమై ఉండాలి. ఆఫర్‌ పొందడం కోసం ఐడీ సహా సంబంధిత పత్రాలు చూపించాలి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లోని (Air India Express) ఎక్స్‌ప్రెస్‌ లైట్‌, ఎక్స్‌ప్రెస్‌ వాల్యూ, ఎక్స్‌ప్రెస్‌ ఫ్లెక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బిజ్‌.. ఇలా నాలుగు కేటగిరీలకూ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img