icon icon icon
icon icon icon

Amit Shah: ఉమ్మడి పౌరస్మృతి అమలుకు మోదీ గ్యారెంటీ: అమిత్‌షా

భాజపా ప్రభుత్వం కచ్చితంగా యూసీసీని అమలుచేసి తీరుతుందని కేంద్ర మంత్రి అమిత్‌షా తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదం, నక్సలిజం నుంచి దేశాన్ని బయటపడేసిందన్నారు.

Published : 26 Apr 2024 16:02 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని కచ్చితంగా అమలుచేస్తుందనడానికి ప్రధాని మోదీ గ్యారెంటీ అని హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ‘పర్సనల్‌ లా’కు వకాల్తా పుచ్చుకొంటోందని ఆయన విమర్శించారు. శుక్రవారం మధ్యప్రదేశలోని గుణా లోక్‌సభ పరిధిలోని పిప్రాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇక్కడినుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భాజపా తరపున బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

ఈసందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ ‘‘రాహుల్‌ బాబా.. నువ్వు ఎంతైనా వారిని బుజ్జగించు. భాజపా ఇక్కడున్నంతకాలం.. ‘పర్సనల్‌ లా’లను అంగీకరించదు. ఇది మా వాగ్దానం.. మోదీ గ్యారెంటీ. అందుకే మేము దేశంలో యూసీసీని కచ్చితంగా అమలుచేస్తాం. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో అమల్లోకి తెచ్చాం. 

2019లో మోదీ సర్కారు ఒక్క కలం పోటుతో కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తొలగించింది. అప్పుట్లో రాహుల్‌ బాబా భయపడి.. రక్తం ఏరులైపారుతుందన్నారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు.. మోదీ గవర్నమెంట్‌. రాళ్లు రువ్విన ఘటన ఒక్కటి కూడా చోటుచేసుకోలేదు. ఈ ప్రభుత్వం దేశాన్ని ఉగ్రవాదం, నక్సలిజం నుంచి పూర్తిగా బయటపడేసింది. మధ్యప్రదేశ్‌ మావోయిస్టురహిత ప్రాంతమైంది’’ అని అమిత్‌ షా వివరించారు. 

అంతకుముందు అమిత్‌ షా ఓ ఆంగ్ల వార్తాసంస్థతో మాట్లాడుతూ ‘‘మాట మీద నిలబడే పార్టీని ప్రజలు ఎన్నుకోవాలి. అది దేశ సంపద, పేదల సంక్షేమాన్ని కాపాడుతుంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల తర్వాత ప్రజలు భాజపా వైపు ఆశగా చూస్తున్నారన్నారు. ఎప్పటిలానే హస్తం పార్టీ మేనిఫెస్టో బుజ్జగింపులతో నిండిపోయిందన్నారు. దేశం, చట్టాలు ఒక మతం వైపు మొగ్గి ఉండకూడదు’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img