icon icon icon
icon icon icon

PM Modi: రోజుకు 3,500 కి.మీ.. నాలుగు సభలు.. మండే ఎండల్లో మోదీ ప్రచారం ఇలా..

మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

Updated : 29 Apr 2024 16:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఓవైపు సార్వత్రిక ఎన్నికల ప్రచార వేడి పెరిగింది. మరోవైపు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో 41 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే.. వీటన్నింటినీ లెక్క చేయకుండా అగ్ర నేతలు తమ పర్యటనలు, ప్రచార ర్యాలీలను కొనసాగిస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అయితే.. మండే ఎండల్లోనూ సుడిగాలి పర్యటనలతో అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటూ, కార్యకర్తల్లో జోష్‌ నింపుతూ మోదీ తన పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇంత వేడి వాతావరణంలోను ప్రధాని మోదీ ప్రతిరోజు దాదాపు 3,500 కి.మీ. తిరిగేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇందులో రోజుకు 4 సభలు ఉండేలా చూసుకున్నారు.

  • ప్రచారంలో భాగంగా సోమవారం కర్ణాటకలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మహారాష్ట్రలో నాలుగు సభలకు హాజరవుతారు. మొత్తం 3,650 కి.మీ. పర్యటిస్తారు.  ఇందులో పుణెలో ఒక్కచోటే సాయంత్రం మీటింగ్‌ ఉండగా.. మిగతావన్నీ మధ్యాహ్నమే కొనసాగనున్నాయి.
  • ఆదివారం కర్ణాటకలో ప్రధాని నాలుగు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బెళగావి, ఉత్తర కన్నడ, దావణగిరె, బళ్లారి సభలకు ఆయన హాజరయ్యారు. దాదాపు 4,300 కి.మీ. ప్రయాణించారు.
  • శనివారం మోదీ రెండు ర్యాలీలకే పరిమితమయ్యారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌, దక్షిణ గోవాలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆ రోజు కొల్హాపూర్‌లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
  • శుక్రవారం కూడా ప్రధాని మూడు ర్యాలీలు, ఒక రోడ్‌షోలో పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్‌, బిహార్‌, యూపీలను చుట్టేశారు. ఉదయం 10.45కు మొదటి సభ ప్రారంభం కాగా.. 6.30 రోడ్‌షోతో ఆ రోజు కార్యక్రమాలు ముగిశాయి. మొత్తం మూడు వేల కి.మీ.కు పైగా ప్రయాణించారు.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లో ఎండలు మండిపోతున్నాయి. మరికొన్ని రోజులు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంత వేడి వాతావరణంలో కూడా ఆయా పార్టీల నేతలు తమ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img