icon icon icon
icon icon icon

KCR: తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. ఇంకా ఉంది: కేసీఆర్‌

తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా భారాస ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు.

Published : 05 May 2024 17:23 IST

వీణవంక: తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా భారాస ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా వీణవంకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమే. రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపోటములు సహజం. గెలిస్తేనే లెక్క అనుకోవద్దు. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చే విధంగా కష్టపడ్డాను. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు ఎంతో కృషి చేశాం. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోవాలని యోచిస్తున్నాయి. రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఒకటి తమిళనాడుకు వెళ్లి పోయింది. అల్యూమినియం, ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. దీంతో ఆ కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాయని మీడియాలో వార్తలు చూస్తుంటే బాధేస్తోంది. నాలుగైదు నెలల్లోనే ఇలా చేశారని దుఃఖం కలుగుతోంది. 2001లో తెలంగాణ జెండా ఎత్తిన రోజు పెద్ద పెద్ద నాయకులు లేకపోయినా ఎక్కువ మంది జడ్పీటీసీలు, ఎంపీపీలను గెలిపించిన గడ్డ హుజూరాబాద్‌. దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం అయి పోలేదు.. ఇంకా ఉంది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగాల్సిన అవసరముంది. నాలుగైదు నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది’’ అని కేసీఆర్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img