icon icon icon
icon icon icon

Lok Sabha Polls: ముగిసిన రెండో విడత పోలింగ్‌.. ఓటింగ్‌ శాతాలు ఇలా..!

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 61 శాతం పోలింగ్‌ నమోదైంది. పూర్తి వివరాలివే..

Updated : 26 Apr 2024 18:48 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Lok sabha Elections) సమరంలో రెండో విడత పోలింగ్‌ (second Phase Voting) ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల  పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా  దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్‌ ముగించారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. కేరళ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలలో లోపాలు, బోగస్‌ ఓట్లతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, రాజస్థాన్‌లో బన్స్‌వారా, మహారాష్ట్ర, త్రిపురలోని పర్భానిలలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించి నిరసన తెలిపారు.

రాష్ట్రాల వారీగా పోలింగ్‌ శాతాలు ఇలా.. (ఓటర్‌ టర్న్‌ అవుట్‌ యాప్‌ ప్రకారం..)

సాయంత్రం 5గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం.. అస్సాంలో 70.66 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. బిహార్‌లో 53.03, ఛత్తీస్‌గఢ్‌ 72.13, జమ్మూకశ్మీర్‌ 67.22, కర్ణాటక 63.90, కేరళ 63.97, మధ్యప్రదేశ్‌ 54.83, మహారాష్ట్ర 53.51, మణిపుర్‌ 76.06, రాజస్థాన్‌ 59.19, త్రిపుర 77.53, ఉత్తరప్రదేశ్‌ 52.74, పశ్చిమబెంగాల్‌ 71.84 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది. మూడో దశ ఎన్నికలు 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

ఇప్పటివరకు ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే..

తమిళనాడు(39), కేరళ(20), రాజస్థాన్‌ (25), త్రిపుర (2), ఉత్తరాఖండ్‌ (5), అరుణాచల్‌ప్రదేశ్‌ (2), మేఘాలయ (2), అండమాన్‌ నికోబార్‌ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్‌ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1), లక్షద్వీప్‌ (1). తొలి విడతలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. దాదాపు 65.5 శాతం పోలింగ్ నమోదైంది.

ఓటేసి.. స్ఫూర్తిని చాటారు!

ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. కొత్త ఓటర్లతో పాటు కొత్తగా పెళ్లయిన జంటలు సంప్రదాయ వస్త్రధారణతో పలుచోట్ల పోలింగ్‌ కేంద్రానికి ఉత్సాహంగా వచ్చి ఓటేశారు. రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 41 మంది రోగులు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. వారు ఓటేసేందుకు ఆస్పత్రి యాజమాన్యంతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగం సహకరించింది. అంబులెన్స్‌ సర్వీసులను అందుబాటులో ఉంచి గ్రీన్‌కారిడార్లను ఏర్పాటు చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, వైద్యుల అనుమతి పొందాకే రోగులను ఓటు వేయడానికి వెళ్లేందుకు పంపించినట్లు ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img