icon icon icon
icon icon icon

Chirag Paswan: బిహార్‌లో ఎన్డీయేకు పోటీ లేదు.. అందుకే తక్కువ పోలింగ్‌: చిరాగ్‌

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌పై లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ స్పందించారు.

Published : 20 Apr 2024 23:04 IST

పట్నా: సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా బిహార్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఆయా స్థానాలల్లో అత్యల్పంగా ఓటింగ్‌ శాతం నమోదైంది. దీనిపై లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ (Chirag Paswan) స్పందించారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి పోటీ లేకపోవడం వల్లే తక్కువ పోలింగ్‌ శాతం నమోదైందని వ్యాఖ్యానించారు. 

తొలిదశ పోలింగ్‌పై విలేకరులతో మాట్లాడుతూ.. 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం ఒక్క సీటుకే పరిమితమైందనీ, అప్పటితో పోలిస్తే ఆ పార్టీ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ పనితీరు మరింత దిగజారిందని ఎద్దేవా చేశారు. ‘‘బిహార్‌లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. ప్రతిపక్షం క్షీణించడమే ఇందుకు కారణం. ఎన్డీయే ప్రతిచోటా రాణిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్డీయేకి ఎంతోకొంత పోటీ ఉంది కాబట్టే పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు’’ అని చిరాగ్‌ అన్నారు.

అదే సమయంలో ఆర్జేడీ లీడర్‌ తేజస్వీ యాదవ్‌కు సంబంధించి ఇటీవల వైరల్‌గా మారిన వీడియో గురించి ప్రస్తావించారు. ఆయన మాటలు దళిత వ్యతిరేకత మనస్తత్వాన్ని చాటుతున్నాయన్నారు. ఎన్డీయేకు ముస్లింల నుంచి ఆదరణ పెరుగుతోందన్నారు. ఆర్జేడీ దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. బిహార్‌లో శుక్రవారం తొలి దశ పోలింగ్‌ జరిగిన నాలుగు స్థానాల్లో 48.23 శాతం ఓటింగ్‌ నమోదైంది. రాష్ట్రంలో 40 ఎంపీ స్థానాలుండగా.. ఎన్డీయే కూటమితో పొత్తు కుదుర్చుకున్న జన్‌శక్తి పార్టీ ఐదు స్థానాల్లో పోటీకి దిగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img