icon icon icon
icon icon icon

Loksabha polls: నాకూ అభిషేక్‌ బెనర్జీకీ ముప్పు పొంచి ఉంది: మమతా బెనర్జీ

తనని, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని భాజపా టార్గెట్ చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ఆరోపించారు.

Published : 21 Apr 2024 20:15 IST

కోల్‌కతా: తనని, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని భాజపా టార్గెట్ చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాము సురక్షితంగా లేమని, తమకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. టీఎంసీ పార్టీ అభ్యర్థి, మంత్రి బిప్లబ్ మిత్రాకు మద్దతుగా  కుమార్‌గంజ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

‘‘సోమవారం పెద్ద విధ్వంసం జరుగుతుంది. అది టీఎంసీ, దాని నాయకులను వణికిస్తుంది.’’ అని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి శనివారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మమత స్పందిస్తూ ‘‘భాజపా నన్ను, అభిషేక్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. మేము సురక్షితంగా లేము. అయినా కాషాయ పార్టీ కుట్రలకు మేము భయపడం. పార్టీ నాయకులు, బెంగాల్ ప్రజలపై జరుగుతున్న కుట్రను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా” అని మమత పేర్కొన్నారు. 

దూరదర్శన్ లోగో రంగు మార్పు

మోదీ ప్రభుత్వం దూరదర్శన్ వంటి స్వతంత్ర సంస్థలకూ కాషాయ రంగులు పూసిందని మమత మండిపడ్డారు. ఎన్నికల సమయంలో దూరదర్శన్ లోగోను కాషాయ రంగులోకి ఎలా మారుస్తారని  ఆమె ప్రశ్నించారు. ‘‘డీడీ లోగో అకస్మాత్తుగా కాషాయ రంగులోకి ఎందుకు మారింది. ఆర్మీ సిబ్బంది అధికారిక నివాసాలకు కాషాయ రంగు, వారణాసిలో పోలీసుల సంప్రదాయ యూనిఫారాలు ఇవన్నీ భాజపా మతం ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనం. డీడీ లోగో రంగు మార్పును మేము వ్యతిరేకిస్తున్నాం. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవు. ఒకే వ్యక్తి, ఒకే పార్టీ పాలన ఉంటుంది. వివిధ వర్గాలు మతపరమైన హక్కుల విషయంలో ప్రమాదంలో పడతాయి.’’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img