icon icon icon
icon icon icon

Nirmala Sitharaman: వారసత్వ పన్నుతో దేశం వెనక్కి.. కాంగ్రెస్‌పై నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు

వారసత్వ పన్నుపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ పన్ను వల్ల దేశం వెనక్కి పోతుందని తాజాగా నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు.

Published : 26 Apr 2024 15:53 IST

Nirmala Sitharaman | బెంగళూరు: వారసత్వ పన్నుపై ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ తనదైన శైలిలో విరుచుకుపడుతుండగా.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా విమర్శలు గుప్పించారు. ఈ పన్ను వల్ల దేశం మళ్లీ వెనక్కి పోతుందని, ఈ పదేళ్లు చేసిన అభివృద్ధి కాస్త మళ్లీ సున్నాకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. రెండో విడత పోలింగ్‌లో భాగంగా కర్ణాటకలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. 

‘‘వారసత్వ పన్ను అనేది మధ్యతరగతికి గుదిబండలా మారుతుంది. వారి ఆశలను, ఆశయాలను చిదిమేస్తుంది. మధ్యతరగతికి చెందిన వ్యక్తులు కష్టపడిన సొమ్మును దాచుకుంటూ ఉంటారు. ఫిక్సడ్‌ డిపాజిట్లు, చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకుంటూ ఉంటారు. సొంతింటి నిర్మాణం వంటి కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు. భవిష్యత్‌ కోసం దాచుకోవడమే అప్పుడు పాపమవుతుంది. ఇలాంటి పన్నుల వల్ల ఈ పదేళ్లలో సాధించిన అభివృద్ధి కాస్తా వెనక్కి పోయి.. మళ్లీ సున్నాకు చేరుకోవాల్సి వస్తుంది’’ అని నిర్మలా సీతారామన్‌ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో 90 శాతం పన్నులు విధించిన రోజులు కూడా ఉన్నాయని చెప్పారు. 1968లో నిర్బంధ డిపాజిట్‌ స్కీమ్‌ ఉండేదని, 18-20 శాతం సొమ్మును డిపాజిట్‌ చేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు.

పిట్రోడా ఏమన్నారు..?

అమెరికాలో వారసత్వ పన్ను (ఇన్‌హెరిటెన్స్‌ టాక్స్‌) అమల్లో ఉందని దీని ప్రకారం.. ఒక వ్యక్తి సంపాదనలో సుమారు 45 శాతమే అతని మరణానంతరం వారసులకు బదిలీ అవుతుందని, 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పిట్రోడా వ్యాఖ్యానించారు. ‘ఇదో ఆసక్తికర చట్టం. దీని ప్రకారం మీ సంపాదనలో ప్రజల కోసం కొంత వదిలేయాలి. భారత్‌లో మాత్రం ఎవరైనా వెయ్యికోట్ల డాలర్లు సంపాదించి చనిపోతే ఆయన వారసులకు ఆ వెయ్యికోట్ల డాలర్లూ వస్తాయి. ప్రజలకు ఏమీ లభించదు. ఇది చర్చించాల్సిన విషయం. సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కొత్త విధానాల గురించి ఆలోచించాలి. అవి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలి. ధనవంతుల ప్రయోజనాల కోసం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని ఆ పార్టీ వివరణ ఇచ్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img