icon icon icon
icon icon icon

Loksabha polls: మోదీ పాలనలో కశ్మీర్‌పై రాయి వేసే ధైర్యం ఎవరికీ లేదు: అమిత్ షా

ప్రధాని మోదీ పాలనలో ఎవరూ జమ్మూకశ్మీర్‌పై రాయి విసిరే సాహసం చేయరని, ఏ ఒక్కరికీ ఆ దమ్ము లేదని  భాజపా నేత అమిత్‌ షా అన్నారు.

Updated : 20 Apr 2024 12:34 IST

జైపూర్‌: ప్రధాని మోదీ పాలనలో ఎవరూ జమ్మూకశ్మీర్‌పై రాయి విసిరే సాహసం చేయరని, ఏ ఒక్కరికీ ఆ దమ్ము లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పార్టీ నిర్వహించిన రోడ్‌ షోలో షా పాల్గొన్నారు. ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్‌లో గందరగోళానికి దారితీస్తుందని గతంలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను దుయ్యబట్టారు.

ర్యాలీలో షా మాట్లాడుతూ ‘‘గతంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగిస్తే ఇక్కడ రక్తపాతం జరుగుతుందని చెప్పేవారు.  ప్రత్యేక హోదాను రద్దు చేసి ఐదేళ్లయ్యింది. ఇది మోదీ ప్రభుత్వం ఇక్కడ రక్తపాతం మాట వదిలేయండి కనీసం రాయి విసిరే ధైర్యం ఎవరికీ లేదు’’ అని పేర్కొన్నారు.

ఉదయ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన భాజపా అభ్యర్థి మన్నాలాల్ రావత్‌కు మద్దతుగా షా శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మతో కలిసి అమిత్‌ షా దిల్లీ గేట్ చౌరాస్తా నుంచి సూరజ్‌పోల్ చౌరాస్తా వరకు జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో భాజపా భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాజస్థాన్‌లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి దశలో 12 స్థానాలకు శుక్రవారం ఓటింగ్ ప్రక్రియ ముగియగా, రాష్ట్రంలోని మిగిలిన 13 స్థానాలకు ఏప్రిల్ 26న రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img