icon icon icon
icon icon icon

Bastar: నక్సల్‌ ఏరియాలో పోలింగ్‌.. ఆ గ్రామంలో కదలని ఓటర్!

మావోయిస్టు ప్రభావిత బస్తర్‌ నియోజకవర్గంలో నిర్వహించిన పోలింగ్‌ ప్రక్రియకు పువర్తి గ్రామస్థులు దూరంగా ఉన్నారు. దానికి కారణం అదేనా..!

Published : 21 Apr 2024 00:06 IST

సుక్మా: దేశంలో ఎన్నికల పండగ ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా మావోయిస్టుల కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ నియోజకవర్గంలోనూ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మావోయిస్టులు ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ పిలుపును ధిక్కరించి.. ఇక్కడి పలు మారుమూల పల్లెల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క గ్రామంలో తప్ప.. అదే పువర్తి. 

బీజాపూర్‌ జిల్లా సరిహద్దులో, సుక్మా జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ గ్రామం ఉంది. బస్తర్‌లో భద్రతా దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు కీలక సూత్రధారిగా భావిస్తున్న మావోయిస్టు నేత హిడ్మా స్వగ్రామం. పువర్తిలో మొత్తం 332 మంది ఓటర్లున్నారు. ఈ ప్రాంతం సహా టేకల్‌గుడియం (158 మంది ఓటర్లు), జోనగూడ (157)లకు కలిపి పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుచేశారు. టేకల్‌గుడియం, జోనగూడ నుంచి కేవలం 31 మంది ఓటు వేయగా.. పువర్తి నుంచి మాత్రం ఒక్కరూ ముందుకురాలేదని తెలుస్తోంది.

అందుకే ఓటింగ్‌కు దూరమా..?

ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పువర్తి పరిసర గ్రామాల్లో బ్యానర్లు ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు బేస్‌ ఏర్పాటుచేసినప్పటికీ.. అది నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో ప్రాణ భయంతోనే ఓటింగ్‌కు ఆ గ్రామస్థులంతా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 19న బస్తర్‌లో పోలింగ్‌ జరగ్గా.. 67.56 శాతం ఓటింగ్‌ నమోదైంది.

మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్‌

నక్సల్‌ బెడద, భౌగోళిక పరిస్థితుల కారణంగా ఇక్కడ అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కరవైనట్లు అధికారులు తెలిపారు. ఇలాంటిచోట భద్రతా శిబిరాలను ఏర్పాటుచేయడం వల్ల వందలమంది గ్రామస్థులను మావోయిస్టుల చెర నుంచి విడిపించడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల బస్తర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది నక్సల్స్‌ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img