icon icon icon
icon icon icon

PM Modi: చనిపోయాకా కాంగ్రెస్‌ మిమ్మల్ని దోచుకుంటుంది: మోదీ

కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బతికున్నప్పుడు, చనిపోయాక కూడా ఆ పార్టీ మిమ్మల్ని దోచుకుంటుందని వ్యాఖ్యానించారు.

Published : 24 Apr 2024 21:26 IST

PM Modi | భోపాల్‌/ రాయ్‌పూర్‌: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi). ఆ పార్టీ మతం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకురావాలని చూస్తోందన్నారు. ఈ తరహా రిజర్వేషన్లను రాజ్యాంగం కూడా వ్యతిరేకిస్తోందని గుర్తు చేశారు. అంబేడ్కర్‌ ఆశయాలకు కాంగ్రెస్‌ పార్టీ వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు. సంపద పంపిణీపై కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ గురించి శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘చనిపోయాక కూడా మిమ్మల్ని కాంగ్రెస్‌ దోచుకుంటుంది’ అంటూ విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన బుధవారం మాట్లాడారు.

‘‘కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దొడ్డిదారిన మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తోంది. ముస్లింలందరినీ ఓబీసీ కేటగిరీలో చేర్చి వారికి రిజర్వేషన్లు తీసుకొస్తోంది. ఓబీసీల నుంచి రిజర్వేషన్లను లాక్కుంటోంది. కాంగ్రెస్‌ చర్యలు మీ భవిష్యత్‌నే నాశనం చేస్తాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించకూడదని రాజ్యాంగం చెప్తోంది. బాబాసాహెబ్‌ కూడా దీనికి పూర్తి వ్యతిరేకం. అయినా కాంగ్రెస్‌ పార్టీ దీన్ని తీసుకొచ్చేందుకు ఏళ్ల క్రితమే ప్రతినబూనింది. 2009, 2014 ఎన్నికల సమయంలోనే మతపరమైన రిజర్వేషన్లను తీసుకొస్తామని ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో పెట్టింది’’ అని మోదీ అన్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానిస్తే దాన్ని తిరస్కరించిందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సంపద పంపిణీ హామీని మోదీ మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. వారసత్వ పన్నుపై ఆ పార్టీ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను తాజాగా ప్రస్తావించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. వారసత్వంగా వచ్చిన సంపదపై పన్నులు వేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. మీరు కష్టపడి సంపాదించి పిల్లల కోసం దాచి పెట్టుకున్న సొమ్ము లాగేసుకోవడానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది. మీరు బతికున్నప్పుడు మీ దగ్గర ట్యాక్సుల రూపంలో లాక్కుంటుంది. మీరు చనిపోయాక వారసత్వ పన్ను పేరిట మీ పిల్లల నుంచి ఆస్తులను తీసుకుంటుంది. ‘మీరు బతికున్నా.. చచ్చినా దోచుకోవడమే ఆ పార్టీ నైజం’ అంటూ మోదీ  వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి కుటుంబ విలువలు తెలియవని మండిపడ్డారు.

శామ్‌ పిట్రోడా ఏమన్నారు..?

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేత శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరోసారి వివాదంలోకి నెట్టింది. అమెరికాలోని ఓ విధానాన్ని ఉటంకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘‘అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అదొక ఆసక్తికరమైన అంశం. అంటే మీరు సంపదను సృష్టించి, వదిలివెళ్లిపోతున్నారు. ప్రజల కోసం దానిని వదిలేయాలి. మొత్తం కాదు సగమే. అది నాకు న్యాయంగా అనిపిస్తోంది’’ అని పిట్రోడా అన్నారు. దీంతో ప్రజలు చెమటోడ్చి సంపాదించిన సొమ్మును లాక్కోవాలనుకుంటున్నారంటూ భాజపా విమర్శల దాడికి దిగింది. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడంతో అది ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img